ఎమ్మా రాబర్ట్స్..వెండితెర అల్లరిపిల్ల. యువ ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టిన గ్లామర్ క్వీన్. మేనత్త జూలియా రాబర్ట్స్ స్ఫూర్తితో సినీ రంగ ప్రవేశం చేసి స్వశక్తితో హాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎమ్మా ఎదిగిన వైనం అద్వితీయం. క్రేజీ నాయికగా అటు వెండితెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులతోపాటు గాయనిగా సైతం శ్రోతల్ని ఫిదా చేసిన ఎమ్మా రాబర్ట్స్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
'ఆర్ ఆర్ ఆర్'లో ఎన్టీఆర్ సరసన..!
టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్'. ఇందులో ఎన్టీఆర్‌కి జోడీగా ఎమ్మా రాబర్ట్స్‌ని ఎంపిక చేశారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్‌కి జోడీగా ఇంతకముందు ఎంపిక చేసిన బ్రిటన్ కథానాయిక డైసీ ఎడ్గార్ జోన్స్ అనుకోని కారణాల వల్ల తప్పుకున్నారు. ఆమె స్థానంలో శ్రద్ధా కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, పరిణీతి చోప్రా వంటి బాలీవుడ్ కథానాయికల పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్‌గా హాలీవుడ్ పాపులర్ స్టార్ హీరోయిన్ ఎమ్మా రాబర్ట్స్‌ని ఎంపిక చేశారట. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బహు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోయే ఈ చిత్రంలో చరణ్ సరసన అలియాభట్ కథానాయికగా నటిస్తోంది. అజరు దేవగన్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.
జూలియా రాబర్ట్స్ స్ఫూర్తితో చిత్ర రంగ ప్రవేశం..
ప్రముఖ హాలీవుడ్ స్టార్ జూలియా రాబర్ట్స్ స్ఫూర్తితో కథానాయికగా మారిన ఎమ్మా రాబర్ట్స్ 1991 ఫిబ్రవరి 10న అమెరికా, న్యూయార్క్‌లోని రినెబెక్లో జన్మించారు. వీరిది సినీ కుటుంబం కావడం విశేషం. తండ్రి ఎరిక్ రాబర్ట్స్ ప్రముఖ హాలీవుడ్ నటుడు. తల్లి కెల్లీ మోడల్, నటిగా రాణించారు. తల్లిదండ్రులు ఒకే రంగంలో ఉన్నా, ఇగోల కారణంగా విడాకులు తీసుకునేంత వరకు వచ్చింది. తండ్రి ఎలిజా అనే నటిని పెళ్ళి చేసుకున్నారు. ఆమె తరపున వచ్చిన తాత, అమ్మలు డేవిడ్ రేఫీల్, లిలా గార్రెట్ సినిమాల్లోనే రైటర్స్‌గా ఉన్నారు. ఇక తల్లి కెల్లి నికెల్స్ని పెళ్ళి చేసుకున్నారు. ఆయన మ్యూజిషియన్. తల్లి తరపున వచ్చిన వాళ్ళు కూడా సినిమాల్లోనే ఉండటం విశేషమైతే, పాపులర్ స్టార్ హీరోయిన్ జూలియా రాబర్ట్స్ ఆమెకి మేనత్త కావడం మరో విశేషం. తల్లిదండ్రుల్లో ఇద్దరితోనూ ఎమ్మా అనుబంధాన్ని కొనసాగించారు. పేరెంట్స్ దూరంగా ఉండటంతో చిన్నప్పుడు ఎక్కువగా నటి జూలియా ఇంట్లోనే గడిపారు. ఆమెతోపాటు షూటింగ్‌లకు వెళ్ళేవారు. షూటింగ్లో జూలియా పొందే మర్యాదలు, ఆమెకున్న ఇమేజ్, సెట్లో యాక్టింగ్‌కి సంబంధించిన అంశాలకు ఎమ్మా బాగా ఆకర్షితులయ్యారు. ఆ ఆకర్షణే ఆమెని చిత్ర రంగంలోకి తీసుకొచ్చి ప్రేక్షకుల్ని మెచ్చిన నటిని చేసింది.
బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పించిన క్రేజీ కథానాయిక..
జూలియా సపోర్ట్‌తో 'బ్లో' చిత్రానికి ఆడిషన్‌కి వెళ్ళగా సపోర్టింగ్ రోల్లో ఎంపికయ్యారు. తొలి సినిమానే జానీడెప్ వంటి టాప్ స్టార్ చిత్రంలో అవకాశం కావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి. కొకైన్స్మగ్లర్ జార్జ్ జంగ్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రమిది. జానీ డెప్‌కి కూతురిగా క్రిస్టినా జంగ్ పాత్రలో నటించారు. ఇందులో పెనలోప్ క్రజ్ కథానాయికగా నటించారు. 2001లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. అప్పటికి ఆమె వయసు కేవలం తొమ్మిదేండ్లే కావడం విశేషం. మొత్తమ్మీద సినిమా కష్టాలు పడకుండానే నటిగా ఎమ్మా తెరంగేట్రం చేయగలిగారు. మొదటి సినిమాలో ఆమె నటనకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో అంతగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో తన సినీకుటుంబ నేపథ్యం వెండితెరకి పరిచయం చేయగలిగింది గాని, నటిగా నిలబెట్టలేకపోయింది. అదే ఏడాది 'బిగ్లవ్' అనే లఘు చిత్రంలో, జూలియా రాబర్ట్స్ నటించిన 'అమెరికాస్్ స్వీట్‌హార్ట్స్' చిత్రంలో పెద్దగా గుర్తింపు లేని పాత్ర పోషించారు. అలాగే బాలల చిత్రం 'గ్రాండ్ ఛాంపియన్'లో మెరిశారు. నటిగా రాణించాలనే ఆమె ఆశలు అడియాశలయ్యాయి. ఎంట్రీ బాగానే జరిగింది కానీ, తర్వాతే అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. దాదాపు మూడేండ్లపాటు తననితాను నటిగా మలుచుకునే ప్రయత్నం చేశారు. ఈ స్ట్రగుల్లో భాగంగా 2004లో 'అన్ఫేబులస్' అనే టెలివిజన్ ఆఫర్ వచ్చింది. ఇందులో అడ్డీ సింగర్ పాత్రలో నటించి మెస్మరైజ్ చేశారు. దాదాపు మూడేండ్లపాటు టెలికాస్ట్ అయిన ఈ సిరీస్‌తో ఎమ్మాకి నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఒక్క టెలివిజన్‌తోనే బాగా పాపులర్ అవ్వడంతో టీవీ అవకాశాలు క్యూ కట్టాయి. ఆ వెంటనే సీట్కామ్ టెలివిజన్ 'డ్రేక్ అండ్ జోష్'లో నటించారు. క్రమంగా తన ఆలోచనలు సింగింగ్ వైపు తిరిగాయి. సంగీతపరంగా 'అన్ఫేబులస్ అండ్ మోర్'(2005) పేరుతో సింగర్‌గా తొలి ఆల్బమ్ రూపొందించారు. ఇది బాగా శ్రోతకాదరణ పొంది ఎమ్మాకి గుర్తింపు తెచ్చింది.
కెరీర్‌నే మలుపు తిప్పిన అక్వామెరైన్..
2006లో వచ్చిన 'అక్వామెరైన్' అనే సినిమా అవకాశం తన కెరీర్‌నే మార్చేసింది. టీనేజ్ ఫాంటసీ కామెడీగా ఎలిజబెత్ అల్లెన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జోన్నా, సారా పాక్ట్సన్తో కలిసి నటించారు. మహిళా ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా చిన్న బడ్జెట్ చిత్రాల్లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సహాయనటిగా యంగ్ ఆర్టిస్ట్ అవార్డుని అందుకున్నారు. దీంతో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఇదే ఏడాది వచ్చిన 'నాన్సీ డ్య్రూ'లో లీడ్ రోల్ పోషించారు. ఇది సైతం భారీ విజయాన్ని సాధించింది. ఇక వరుసగా ఏడాదికి రెండు కంటే ఎక్కువ సినిమాల్లో నటిస్తూ తనని తాను మెరుగు పర్చుకుంటూ ఫ్యామిలీ కామెడీ 'హోటల్ ఫర్ డాగ్స్' చిత్రంతో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. వరుసగా 'వైల్డ్ చైల్డ్', 'హోటల్ ఫర్ డాగ్స్', 'వాలెంటైన్స్ డే', 'ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఫన్నీ స్టోరీ', 'ది ఆర్ట్స్ ఆఫ్ గెట్టింగ్ బై', 'లైమ్లైఫ్', '4,3,2,1', 'స్క్రీమ్ 4', 'అడల్ట్ వరల్డ్', 'విరు ఆర్ ది మిల్లర్స్', 'పాలో ఆల్టో', 'ది బ్లాక్ కోట్స్ డాటర్స్', 'నెర్వ్' చిత్రాలతో హాలీవుడ్లో క్రేజీ స్టార్ హీరోయిన్గా,యూత్ ఐకాన్‌గా ఎదిగారు.
వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్..
2010లో ఏకంగా ఆరు సినిమాల్లో నటించడం విశేషం. అవన్నీ దాదాపు విజయం సాధించాయి. 2013లో నాలుగు సినిమాలతో మెరిశారు. 2015, 2018లో మూడేసి సినిమాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. 'లైమ్లైఫ్', 'ది బ్లాక్కోట్స్ డాటర్స్' సినిమాలు టొరంటో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై అవార్డులనందుకున్నాయి. 'అమెరికాస్ స్వీట్‌హార్ట్స్' తర్వాత చాలా గ్యాప్‌తో తన మేనత్త జూలియా రాబర్ట్‌తో కలిసి నటించిన 'వాలెంటైన్స్ డే'తో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకుని తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. పై వాటిలో 'పాలో ఆల్టో' చిత్రం నటిగా తనకి విశేష ప్రశంసలు దక్కేలా చేసింది. హార్ట్ బ్రేకింగ్ నటనగా హాలీవుడ్ ప్రముఖులు, వార్తాపత్రికలు ప్రశంసించాయి. వీటితోపాటు 'స్పైమేట్', 'ట్వెల్వ్', 'మెమరీస్ ఆఫ్ ఏ టీనేజ్ అమ్నెసియాక్', 'ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఫన్నీ స్టోరీ', 'వర్జినియా', 'కెలస్టె అండ్ జెస్సీ ఫరెవర్', 'ఎంపైర్ స్టేట్', 'ఐ యామ్ మైఖేల్', 'ఆష్బై', 'హు వి ఆర్ నౌ', 'ఇన్ ఏ రిలేషన్షిప్', 'బిలియనీర్ బార్సు కల్బ్', 'లిటిల్ ఇటలీ', 'పారడైజ్ హిల్స్' వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం 'ది హంట్', 'హోలీడేట్'లో కథానాయికగా నటిస్తున్నారు. 2004లో వచ్చిన టెలివిజన్ 'అన్ఫేబులస్'తోనే నటిగా పాపులర్ అయిన విషయం విదితమే. సినిమాలకు దీటుగా సీరియల్స్‌తోనూ రాణించారు.
అద్భుతమైన నటనతో, అందచందాలతో బుల్లితెర ఆడియెన్స్‌ని ఫిదా చేశారు. అలాగే గాయనిగా 'అనఫేబులస్ అండ్ మోర్' ఆల్బమ్‌లో రెండు పాటలు 'ఐ వన్నా బీ', 'డబ్మీ' పాటలు ఆలపించారు. ఇందులోని 'ఐ యావ్ ఎరైవ్డ్', 'దిస్ ఈజ్ మీ' పాటలకు తనూ ఓ రైటర్‌గా వర్క్ చేయడం విశేషం. ఇవన్నీ మంచి శ్రోతకాదరణ పొందాయి. దీంతోపాటు ఇతర ఆల్బమ్స్ అయిన ఐస్ ప్రిన్సెస్ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్‌లో 'ఇఫ్ ఐ యాడ్ ఇట్ మై వే', 'అక్వామెరైన్' ఆల్బమ్‌లో 'ఐలాండ్ ఇన్ ది సన్', '4321' ఆల్బమ్‌లో 'స్ట్రేంజ్లీ సెక్సీ టఫ్'తోపాటు 'డు ఇట్ ఆన్ మై ఫేస్' వంటి సింగిల్స్‌లో, 'ఐ వన్నా బీ', 'డమ్మీ' మ్యూజిక్ వీడియోస్‌లో పాడటంతోపాటు వాటిలో మెరిసి అందరినీ అలరించారు.
అందరినీ ఫిదా చేసిన విలక్షణ పాత్రలు
కుర్రకారు కలల రాణిగా గ్లామర్‌తోపాటు అభినయంతో ఎమ్మా రాబర్ట్స్ మాయ చేసింది. నటించిన తొలి సినిమా 'బ్లో'. కొకైన్ స్మగ్లర్ జార్జ్ జంగ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామాలో జార్జ్ పాత్రలో నటించిన జానీ డెప్ కూతురిగా అల్లరి చిల్లర పాత్రలో ఎమ్మా మెరిసింది.
ఓ కుర్రాడు హాకీలో ఛాంపియన్‌గా నిలిచే కథాంశంతో వచ్చిన బాలల చిత్రం 'గ్రాండ్ ఛాంపియన్'తోపాటు బెస్ట్ గూఢచారులైన చింపాంజీ ఆకారంలో ఉన్న వ్యక్తి, అతని ఫ్రెండ్ మైక్‌ల జర్నీ తెలిపే అడ్వెంచరస్ కామెడీ 'స్పైమేట్'లో మైక్ కూతురిగా, యువ సైంటిస్ట్‌గా నటించి ఆకట్టుకున్నారు. ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమకు సమీపంలో ఉన్న బీచ్‌లో ఉన్న మత్య్స కన్యని కనిపెట్టాలని ప్రయత్నిస్తారు.
ఈ క్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర సన్నివేశాల సమాహారంగా ఫ్యామిలీ ఫాంటసీ కామెడీగా రూపొందిన 'ఆక్వామెరైన్' చిత్రంలో టీనేజ్ అమ్మాయిగా అల్లరి పాత్రలో మాయ చేశారు. నాన్సీ, తన తండ్రి వ్యాపార పనిమీద లాస్ ఏంజెల్స్‌కి వెళతారు. అక్కడ ఓ ప్రముఖ సినీ స్టార్ హత్య కేసుని పరిష్కరించడానికి నాన్సీ కారణమవుతుంది. ఈ కథాంశంతో వచ్చిన మిస్టరీ కామెడీ 'నాన్సీ డ్య్రూ'లోని నాన్సీ పాత్రలో ఎమ్మా చూపించిన తెగువ, ధైర్య సాహసాలు, అద్భుత నటన అందరినీ ఫిదా చేసింది. టీనేజ్ కామెడీగా రూపొందిన 'వైల్డ్ చైల్డ్'లో సంపన్న కుటుంబానికి చెందిన విచ్చలవిడిగా తిరిగే అమ్మాయిగా, అన్ని రకాలుగా ఇబ్బందులో, ఫ్యామిలీ లైఫ్ విఫలమైన ఓ కుటుంబం జర్నీని తెలిపే కామెడీ డ్రామా 'లైమ్లైఫ్'లో అమాయకమైన ప్రేమికురాలిగా, తెలియని తనంతో చెడు అలవాట్లకు బానిసైన అమ్మాయిగా ఎమ్మా అద్భుతంగా నటించింది. సంపన్న కుటుంబానికి చెందిన టీనేజర్స్ చెడు అలవాట్లు, డ్రగ్స్‌కి బానిసవడం, హింస, సెక్స్ వంటి అంశాల ప్రధానంగా టీనేజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన 'ట్వెల్వ్'లో సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిగా విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. రొమాంటిక్ కామెడీ 'వాలెంటైన్స్ డే'లో అమాయకమైన టీనేజర్‌గా మెస్మరైజ్ చేశారు. ఓ దొంగతనంలో ఇరుక్కున్న నలుగురు అమ్మాయిలు మూడు రోజులు రెండు నగరాల్లో తమ జీవితం కోసం చేసే పోరాటం నేపథ్యంలో బ్రిటీష్
అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్‌గా విడుదలైన '4.3.2.1'లో నలుగురిలో ఓ అమ్మాయిగా చలాకీ తనంతో కూడిన నటనతో ఆకట్టుకున్నారు. కామెడీ డ్రామా 'ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఫన్నీ స్టోరీ'లో ప్రేమ కోసం తననితాను గాయపర్చుకున్న అమ్మాయిగా అలరించారు. అక్రమ సంబంధాల ప్రధానంగా వచ్చిన 'వర్జీనియా'లో ఓ ప్లేబారుకి ఆకర్షితురాలైన అమ్మాయిగా కనిపించారు. హర్రర్ మిస్టరీ ప్రధానంగా వచ్చిన 'స్క్రీమ్ 4'లో ఘోస్ట్ రైటర్‌గా, కామెడీ డ్రామా 'అడల్ట్ వరల్డ్'లో పోయెట్ కావాలనుకునే అమ్మాయిగా అకట్టుకున్నారు. ఓ వ్యాపారవేత్త తన అక్రమ వ్యాపారం కోసం ఓ ఫేక్ ఫ్యామిలీని క్రియేట్ చేయడం నేపథ్యంలో కామెడీ ప్రధానంగా వచ్చిన 'వియ్ ఆర్ మిల్లర్స్'లో తల్లిదండ్రుల వల్ల నిర్లక్ష్యానికి గురైన అమ్మాయిగా నటించి మెప్పించారు. ఆద్యంతం నాటకీయభరితంగా రూపొందిన 'పాలో ఆల్టో'లో ఫుట్‌బాల్‌లో రాణించాలనుకునే క్రీడాకారిణిగా, కోచ్‌తో ఎఫైర్ కొనసాగించే అమ్మాయిగా నటించి అలరించారు. యదార్థ సంఘటనల ఆధారంగా భారీ ఆయుధాల చోరీ ప్రధానంగా రూపొందిన క్రైమ్ డ్రామా 'ఎంపైర్ స్టేట్'లో కన్నింగ్ అమ్మాయిగా మాఫియాలో ఒకరిగా నటించారు. సూపర్ నేచురల్ సైకలాజికల్ హర్రర్ చిత్రం 'ది బ్లాక్కోట్స్ డాటర్'లో స్కూల్ విద్యార్థినిగా, నన్స్‌కి లొంగిపోయిన అమ్మాయిగా ఆకట్టుకున్నారు. టెక్నో థ్రిల్లర్ అడ్వెంచర్ 'నెర్వ్'లో భయంకరమైన వీడియో గేమ్ నెర్వ్ ప్లేయర్‌గా తనలోని విలక్షణ నటనని ప్రదర్శించారు. ఆద్యంతం నాటకీయభరితంగా రూపొందిన 'హూ వి ఆర్ నౌ', రొమాంటిక్ డ్రామా 'ఇన్ ఏ రిలేషన్షిప్'లో రొమాంటిక్ గర్ల్‌గా, బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా 'బిలియనీర్ బార్సు క్లబ్'లో ప్రియురాలిగా, మరో బయోగ్రాఫికల్ డ్రామా 'ఐ యామ్ మైఖేల్'లో హోమో సెక్సువల్ లక్షణాలున్న అబ్బాయిని ప్రేమలో పడేసే అమ్మాయిగా, రొమాంటిక్ కామెడీ 'లిటిల్ ఇటలీ'లో స్ట్రగులింగ్ చెఫ్‌గా నటించారు. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన 'పారడైజ్ హిల్స్'లో ఓ మాయాలోకంలోకి ఎంటరై అందులో సంఘర్షణపడే అమ్మాయిగా అద్భుత నటనతో మెస్మరైజ్ చేశారు. ఇలా విభిన్న పాత్రల్లో అద్భుతమైన నటనతో అంతే అద్భుతమైన అందంతో మాయ చేసి కుర్రకారు హృదయాల్ని దోచేసిన ఎమ్మా రాబర్ట్స్‌కి చెప్పుకోదగ్గ గొప్ప అవార్డులేవి రాకపోవడం గమనార్హం.