మెలానీ లారెంట్ ..ప్రేక్షకలోకం మెచ్చిన అద్భుత నటి. విలక్షణ నటనతో ఫ్రెంచ్ చిత్ర పరిశ్రమతోపాటు హాలీవుడ్లో సైతం ఓ ఊపు ఊపేసిన క్రేజీ కథానాయిక. నటిగా, రైటర్‌గా, దర్శకురాలిగా, గాయనిగా అటు ప్రేక్షకుల్ని ఇటు శ్రోతల్ని విశేషంగా అలరించిన ఆల్‌రౌండర్. అనుకున్న లక్ష్నాన్ని సాధించే క్రమంలో అపజయాల్ని లెక్కచేయకుండా సక్సెస్‌కి కేరాఫ్‌గా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి మెలానీ లారెంట్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
నటిగా అవకాశాన్నిచ్చిన చలాకీతనం
నటిగా గుర్తింపు పొందేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న మెలానీ లారెంట్ ఫ్రాన్స్‌లోని పారిస్‌లో 1983, ఫిబ్రవరి 21న జన్మించారు. తల్లి అనిక్ బెల్లీ డాన్సర్‌గా మంచి పాపులారిటీ సంపాదించారు. తండి పీర్రె లారెంట్ వాయిస్ యాక్టర్. ప్రముఖ ఆర్టిస్టులతోపాటు యానిమేషన్ చిత్రాలకూ ఆయన వాయిస్ అందిస్తుంటారు. తన గ్రాండ్‌పేరెంట్స్ కూడా చిత్ర పరిశ్రమతో సంబంధాలున్నాయి. స్కూల్ టైమ్‌లో లారెంట్ తన స్నేహితులతో కలిసి 'అస్టెరిక్స్ అండ్ ఎబెలిక్స్' చిత్ర షూటింగ్‌కి వెళ్ళారు. ఆ సెట్, షూటింగ్‌ని చూసి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. అంతేకాదు అక్కడ చిత్రీకరణ టైమ్‌లో నటీనటుల హావభావాలను ఇమిటేట్ చేయడం, చురుగ్గా తిరగడాన్ని ప్రముఖ నటుడు, దర్శకుడు గెరార్డ్ డెపార్డీయు గమనించి తన సినిమాలో అవకాశమివ్వాలనుకున్నారు. ఇదే విషయాన్ని లారెంట్కి చెప్పగా ఆమె వెంటనే అంగీకరించారు. లారెంట్కి నటించే అవకాశం వచ్చిందని ఆమె తల్లిదండ్రులు సైతం ఆనందించారు. దీంతో నటిగా తన ఎంట్రీకి రంగం సిద్ధమైంది. అయితే గెరార్డ్ లారెంట్ని ఎలాంటి యాక్టింగ్ క్లాస్‌లు తీసుకోవద్దని సూచించారు. ఎందుకంటే స్వతహాగా లారెంట్‌లోని నట సామర్థ్యాన్ని ఆయన గమనించారు. సహజమైన నటన ఆమెలో దాగుందని తెలుసుకున్నారు. అలా తన 16వ ఏట 'ది బ్రిడ్జ్' చిత్రంలో నటించే అవకాశం కల్పించారు. ఇందులో హీరోకి కూతురి పాత్రలో నటించారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికంటే ముందు 'లెస్ మాల్హెర్స్ డె సోఫియా' అనే టెలివిజన్‌లో చిన్న పాత్రలో లారెంట్ మెరిశారు.
సరైన బ్రేక్ కోసం ఆరేండ్లలో 12 సినిమాలు
గెరార్డ్ దర్శకత్వం వహించిన 'ది బ్రిడ్జ్' చిత్రం మంచి పేరు తెచ్చినా నటిగా తనకు బ్రేక్ రావడానికి దాదాపు ఆరేండ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంతేకాదు 12 సినిమాలు చేయాల్సి వచ్చింది. సాధారణంగా ఇన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రావకపోవడం, అందులో చాలా వరకు పరాజయం చెందడంతో నటిగా కెరీర్ ప్రశ్నార్థకం అవుతుంది. కానీ ఆమె మొక్కవోని దీక్షతో, ఎంతో పట్టుదలతో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటిగా ఎదిగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 'సమ్మర్ థింగ్స్', 'రైస్ రాప్సోడీ', 'ది లాస్ట్ డే', 'ది బీట్ దట్ మై హార్ట్ స్కిప్పిడ్', 'డేస్ ఆఫ్ గ్లోరీ', 'డిక్కినెక్' వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిశారు. 2006లో వచ్చిన 'డోంట్ వర్రీ ఐ యామ్ ఫైన్' చిత్రం నటిగా తనకి తొలి బ్రేక్‌నిచ్చింది. ఫ్రెంచ్ డైరెక్టర్ ఫిలిప్ లియోరెట్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తన నటనకు మోస్ట్ ప్రామిసింగ్ నటిగా సెసర్ అవార్డు వరించింది. ఆమె నటనకు విశేష ప్రశంసలు దక్కాయి. అనేక ఇతర అవార్డులు సొంతం చేసుకున్నారు. దీని తర్వాత 'హిడెన్ లవ్', 'లె టార్', 'రూమ్ ఆఫ్ డెత్', 'పారిస్' వంటి చిత్రాలతో విజయాలని అందుకోవడంతోపాటు అద్భుత నటిగా ఫ్రెంచ్ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఎంట్రీతోనే హాలీవుడ్లో బ్లాక్‌బస్టర్
ఫ్రెంచ్‌లో క్రేజీ స్టార్‌గా వెలుగుతున్న లారెంట్పై హాలీవుడ్ ప్రముఖుల దృష్టి పడింది. వారిలో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్వాంటిన్ టొరంటినో కూడా ఉన్నారు. ఆయన 2009లో రూపొందించిన 'ఇన్గ్లూరియస్ బాస్టర్డ్స్' చిత్రంలో మెయిన్ కథానాయిక పాత్ర కోసం లారెంట్ని ఎంపిక చేశారు. ఇందులో బ్రాడ్ పిట్, డియానె క్రుగర్, క్రిస్టోఫ్ వాల్ట్ వంటి ప్రముఖ టాప్ స్టార్‌తో కలిసి నటించే అవకాశం తొలి హాలీవుడ్ సినిమాతోనే దక్కడం లక్కీ అని చెప్పాలి. అయితే ఇందులో ఆమె ఫ్రెంచ్‌కి చెందిన అమ్మాయి పాత్రలో కనిపించడం విశేషం. ఈ సినిమా కమర్షియల్‌గా, క్రిటికల్‌గా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 321 మిలియన్లని వసూలు చేసింది. ఈ సినిమాకి లారెంట్ హార్ట్ అండ్ సోల్‌గా నిలవడం విశేషం.
ది రౌండప్‌తో స్టార్ హీరోయిన్ స్టేటస్
'ఇన్గ్లూరియస్ బాస్టర్డ్స్'లోని ఆమె నటనకు ఆస్టిన్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు, ఆన్లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులు దక్కాయి. హాలీవుడ్ ఎంట్రీతోనే బ్లాక్ బస్టర్‌ని అందుకుని ప్రముఖుల దృష్టిని లారెంట్ ఆకర్షించారు. హాలీవుడ్లో అగ్ర హీరోయిన్ల సరసన చేరారు. ఆ తర్వాత తమ పార్టనర్ జులియెన్ బోయిస్సెల్లియర్, మారీ డెనార్నాడ్, మెలానీ డాటీ, లూయిస్ మానోట్ వంటి వారంతా కలిసి ఓ లఘు చిత్రంలో నటించారు. 2010లో ఆమె నటించిన 'ది రౌండ్ అప్' సైతం భారీ విజయాన్ని నమోదు చేసుకుని లారెంట్ని స్టార్ హీరోయిన్ని చేసింది. ఇది పారీస్‌లోని నాజీల అరెస్ట్‌ల ఇతివృత్తంగా, ఒక జూవిష్ కుర్రాడి జీవితం ఆధారంగా తెరకెక్కింది. 2011 మైక్ మిల్స్ దర్శకత్వంలో రూపొందిన మరో బ్లాక్ బస్టర్ 'బిగిన్నర్స్'తో లారెంట్ తిరుగులేని స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకోవడం విశేషం. ఇలా వరుసగా 'పొల్లెన్', 'ది డే ఐ సా యువర్ హార్ట్', 'ది అడాప్టెడ్', 'నైట్ ట్రెన్ టు లిస్బన్', 'నౌ యు సీ మీ', 'ఎనిమీ', 'అలోఫ్ట్', 'బూమెరాంగ్', 'బై ది సీ', 'ఎటర్నైట్', 'ఆపరేషన్ ఫైనల్', 'రిటర్న్ ఆఫ్ ది హీరో', 'మియా అండ్ ది వైట్ లయన్' చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ విజయాలను అందుకుని అటు ఫ్రెంచ్ చిత్ర పరిశ్రమలో, ఇటు హాలీవుడ్లో తిరుగులేని కథానాయికగా ఎదిగారు. 'బై ది సీ'లో ఏంజెలినా జోలి, బ్రాడ్ పిట్లతో కలిసి నటించడం విశేషం. అదే సమయంలో 'పారిస్', 'ఎనిమీ' వంటి సమాంతర సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు.
ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకురాలు, రచయిత, గాయని
2008లో లారెంట్ దర్శకురాలిగా మారారు. తొలి ప్రయత్నంగా ఆమె 'డె మోయిన్స్ ఎన్ మోయిన్స్' పేరుతో షార్ట్ ఫిల్మ్‌ని రూపొందించారు. ఇది 61వ కేన్స్ చలనచిత్రోత్సవ వేడుకలో అవార్డు కోసం నామినేట్ కావడం విశేషం. దీంతోపాటు 'ఏ సెస్ పీడ్స్' అనే ఎరోటిక్ లఘు చిత్రాన్ని, 'ఎక్స్ ఫెమ్మెస్' అనే మరో షార్ట్ ఫిల్మ్‌ని రూపొందించారు. దీంతో దర్శకత్వ శాఖపై మంచి అవగాహన పొందారు. 2011లో 'ది అడాప్టెడ్' అనే సినిమాని నటిస్తూ రూపొందించారు. అలాగే 'రెస్పైర్' చిత్రాన్ని తెరకెక్కించి దర్శకురాలిగా సత్తా చాటారు. ఇది అంతర్జాతీయ క్రిటిక్స్ వీక్, 2014 కేన్స్‌లో ప్రదర్శితమై ప్రశంసలందుకుంది. 2015లో డాక్యుమెంట్ 'టుమారో'కి కో డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇది సెసర్ అవార్డుని అందుకుంది. ఫ్రెంచ్ చిత్ర పరిశ్రమలోనే కాదు, హాలీవుడ్‌లోనూ దర్శకురాలిగా నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా గతేడాది 'గాల్వెస్టన్' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో బెన్ పోస్టర్, ఎల్లీ ఫానింగ్ నటించడం విశేషం. ఇవన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. లారెంట్కి రైటింగ్ అంటే ఇష్టం. దాని మూలంగానే దర్శకురాలిగా మారారు. పలు చిత్రాలకు కో రైటర్‌గా వ్యవహరించారు. లారెంట్లో మంచి గాన ప్రతిభ కూడా దాగుంది. దానికి పదును పెడుతూ 2011లో 'ఎన్‌టి అటెండెంట్' అనే ఆల్బమ్‌ని రూపొందించారు. దీంతో గాయని పరిచయం అయ్యారు. ఇందులో 12 పాటలు పాడగా, వాటిలో ఐదు పాటలకు తను కో రైటర్‌గా సాహిత్యం అందించారు. ఈ ఆల్బమ్ విశేష శ్రోతకాదరణ పొందింది.
లారెంట్ ఫ్రెంచ్ నటుడు జులియన్ బోయిస్సెలియర్తో లాంగ్‌టైమ్ రిలేషన్ కొనసాగించారు. 2009లో తమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టారు. ఫ్రెంచ్ చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్‌గా నటిగా రాణించిన లారెంట్కి తాను పుట్టి పెరిగిన ఫ్రెంచ్ భాష అన్నా, అక్కడి ప్రాంతాలన్నా ఎంతో ఇష్టం. అయితే హాలీవుడ్ చిత్రం 'ఇన్గ్లూరియస్ బాస్టర్డ్స్' చిత్రంలో నటించేంత వరకు తనకు కారు లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే లారెంట్ పలు సామాజిక కార్యక్రమాల్లోనూ భాగమయ్యారు. గ్రీన్‌పీస్ యాక్టివిటీలో భాగంగా ఇండోనేషియా రెయిన్‌ఫారెస్ట్‌లో పర్యటించారు. అంతేకాదు కోఫి అన్నన్ గ్లోబల్ హ్యూమనిటేరియన్ ఫోరమ్ నిర్వహించిన 'టిక్ టిక్ టిక్' క్లైమేట్ ప్రొగ్రామ్‌కి అంబాసిడర్‌గానూ వ్యవహరించారు. సముద్రంలో అతిగా చేపలను పట్టకుండా ఉండేందుకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
విలక్షణ నటనకు ప్రతిరూపాలు
లారెంట్ విలక్షణ పాత్రలకు కేరాఫ్. గ్లామరస్ పాత్రలతోనే కాదు, విభిన్న జోనర్ చిత్రాల్లో, భిన్న పాత్రలతోనూ మెప్పించారు. ఇప్పటికీ మెస్మరైజ్ చేస్తున్నారు. ప్రియురాలిగా, అమాయకమైన అమ్మాయిగా, బాధ్యత గల మహిళగా, తల్లిగా, సంఘర్షణ పడే మహిళగా, సాహసోపేతమైన, శక్తివంతమైన పాత్రల్లో నటించి తానేంటో నిరూపించుకున్నారు.
తొలి చిత్రం 'ది బ్రిడ్జ్'లో హీరోకి కూతురి మెరిశారు. ఆ తర్వాత రొమాంటిక్ కామెడీగా విడుదలైన 'సమ్మర్ థింగ్స్'లో కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. జాకీ చాన్ నిర్మించిన కామెడీ డ్రామా చిత్రం 'రైస్ రాప్సోడీ'లో ఫ్రెంచ్ స్టూడెంట్‌గా అల్లరి పాత్రలో ఆకట్టుకున్నారు. ప్రేమ విఫలమైన యువ ఆర్టిస్టు జర్నీ నేపథ్యంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'ది లాస్ట్ డే'లో, ఆద్యంతం నాటకీయంగా వచ్చిన 'ది బీట్ దట్ మై హార్ట్ స్కిప్డ్' చిత్రంలో ప్రియురాలిగా పక్కింటి అమ్మాయి పాత్రలతో మెప్పించారు.
యుద్ధ ప్రధానంగా రూపొందిన 'డేస్ ఆఫ్ గ్లోరీ' చిత్రంలోని కీలక పాత్రతో అలరించారు. కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన 'డిక్కెనెక్'లో హాస్యభరిత పాత్రలో నవ్వించారు. డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన 'డోంట్ వర్రీ, ఐ యామ్ ఫైన్'లో తన కవల సోదరుడిని కోల్పోయి సంఘర్షణ పడే అమ్మాయిగా అద్భుతమైన నటనతో మంత్రముగ్ధుల్ని చేశారు. నటిగా తనలోని విలక్షణ నటనని ఆవిష్కరించారు. మరో ఇటాలియన్, బెల్జీయం డ్రామా 'హిడెన్ లవ్'లో బలమైన పాత్రలో కనువిందు చేశారు. థ్రిల్లర్‌గా రూపొందిన 'ది కిల్లర్' చిత్రంలో గ్లామర్ తరహా పాత్రతో మెస్మరైజ్ చేశారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ 'రూమ్ ఆఫ్ డెత్'లో కంప్యూటర్ ఎక్స్‌పర్ట్‌గా శక్తివంతమైన, సాహసోపేతమైన పాత్రతో ఆకట్టుకుని, తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. రొమాంటిక్ కామెడీ డ్రామా 'పారిస్'లో రొమాంటిక్ పాత్రలో తనదైన అందాలతో మెస్మరైజ్ చేశారు.
హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన తిరుబాటు యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన 'ఇన్గ్లూరియస్ బాస్టర్డ్స్'లో ఫ్రెంచ్‌లోని జూవిష్కి చెందిన సినిమా ప్రొప్రెటర్గా భిన్న పాత్రలో కామెడీని పండిస్తూ అలరించారు. ఈ సినిమాకి తన పాత్రే కీలకం కావడం విశేషం.
కామెడీ డ్రామాగా విడుదలైన 'లి కాన్సెర్ట్'లో తల్లీకూతురిగా ద్విపాత్రాబినయం చేసి అబ్బురపరిచారు. యంగ్ జూవిష్కి చెందిన కుర్రాడి లైఫ్ ఆధారంగా రూపొందిన 'ది రౌండప్'లో న్యాయం కోసం పోరాడే నర్స్‌గా మెరిశారు. రొమాంటిక్ కామెడీ డ్రామా 'బిగిన్నర్స్'లో ఫ్రెంచ్ నటిగా, ప్రముఖ హీరోకి ప్రియురాలిగా అలరించారు. ఫ్యామిలీ డ్రామా 'ది డే ఐ సా యువర్ హార్ట్'లో అనుకోకుండా ప్రెగెన్సీ పొంది ఇబ్బంది పడే ఇన్నోసెంట్ అమ్మాయిగా అద్భుత నటనతో మైమరపించారు. డ్రామా నేపథ్యంలో లారెంట్ దర్శకత్వం వహించిన 'ది అడాప్టెడ్'లో ఓ కీలక పాత్రలో సంఘర్షణ పూరిత మహిళగా ఆకట్టుకున్నారు. అలాగే దర్శకురాలిగా తన విలక్షణ ప్రతిభని చాటారు. మరో ఇంగ్లీష్ డ్రామా 'నైట్ ట్రైన్ టు లిస్బన్'లో ప్రతిఘటన సభ్యులకు సాయం చేస్తూ వారికి అండగా నిలిచే మహిళగా అబ్బురపరిచారు. దొంగతనం ప్రధానంగా వచ్చిన 'నౌ యు సీ మీ'లో ఇంటర్‌పోల్ ఏజెంట్‌గా శక్తివంతమైన, సాహసభరితమైన పాత్రలో మైమరపించారు. కెనడా-స్పానిష్ సైకలాజికల్ థ్రిల్లర్ 'ఎనిమీ'లోని రొమాంటిక్ పాత్రలో మంత్రముగ్ధుల్ని చేశారు. డ్రామాగా రూపొందిన 'ఆలోఫ్ట్'లో జర్నలిస్ట్‌గా, రొమాంటిక్ డ్రామా 'బూమెరాంగ్'లో హీరో భార్యగా గ్లామరస్ పాత్రతో ఆకట్టుకున్నారు.
ఏంజెలినాజోలీ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా 'బై ది సీ'లో, మరో రొమాంటిక్ హిస్టారికల్ డ్రామా 'ఎటర్నిటీ'లో ముఖ్య పాత్రల్లో గ్లామరస్ పాత్రలతో మెరిశారు. హిస్టారికల్ డ్రామా 'ఆపరేషన్ ఫైనల్'లో మెడికల్ డాక్టర్‌గా, హిస్టరీ కామెడీగా వచ్చిన 'రిటర్న్ ఆఫ్ ది హీరో'లో యువరాజు ప్రియురాలిగా, ఫ్యామిలీ అడ్వెంచర్ 'మియా అండ్ ది వైట్ లయన్'లో యంగ్ గర్ల్‌కి తల్లిగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె 'సిక్స్ అండర్ గ్రౌండ్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఎన్నో భిన్న పాత్రలతో ఆకట్టుకున్న లారెంట్కి చెప్పుకోదగ్గ గొప్ప అవార్డులు దక్కకపోయినా విశేష ప్రేక్షకాదరణ ఉండటం విశేషం.
Authorization