రెగ్యులర్ జోనర్ చిత్రాలతో పోలిస్తే భిన్న నేపథ్య థ్రిల్లర్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. ఊహించని రీతిలో జరిగే ఆసక్తికర, భయానక, ఉత్కంఠ భరిత సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆద్యంతం థ్రిల్ చేస్తూ వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఈ చిత్రాల నిర్మాణం వరల్డ్‌వైడ్ ఎక్కువ సంఖ్యలో నిర్మితమవుతున్నాయి. ఇందులో మన టాలీవుడ్ కూడా మినహాయింపు కాదు.
గత ఐదేండ్ల కాలంలో ప్రేక్షకుల్ని ఫుల్ థ్రిల్ చేసిన కొన్ని చిత్రాల గురించి ఈ వారం స్పెషల్ షో..
సెర్చింగ్
తన 16 ఏండ్ల కూతురు అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. దీంతో తండ్రి డేవిడ్ ఆందోళన చెందుతుంటాడు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు డిటెక్టివ్‌ని పంపిస్తారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. పోలీసులు ఆమె కోసం తీవ్రంగా వెతుకుతుంటారు. 37 గంటలు పూర్తయినా ఎలాంటి ఆచూకి దొరక్కపోవడంతో ఆ తండ్రికి ఓ ఐడియా వస్తుంది. కూతురు వాడే ల్యాప్‌ట్యాప్ ద్వారా ఆమెని ట్రేస్ చేయాలని భావిస్తాడు. ఈ ప్రయత్నంతో సక్సెస్ సాధించాడా?, తన కూతురి ఆచూకి దొరికిందా లేదా? అనే ఆసక్తికర, ఉత్కంఠభరిత సన్నివేశాల సమాహారమే ఈ సినిమా. థ్రిల్లర్ ప్రధానంగా దర్శకుడు అనీష్ చాగంటి ఈ సినిమాని గతేడాది రూపొందించారు. తండ్రి పాత్రలో కొరియన్ నటుడు జాన్ ఛో నటించారు. ఈ సినిమా చిన్న బడ్జెట్ చిత్రంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమా మేకింగ్ స్టయిల్‌నే మార్చేసింది. అనీష్ చాగంటి మన తెలుగు కుటుంబానికి చెందిన డైరెక్టర్ కావడం విశేషం.
ది హ్యాండ్ మేడెన్
ఓ అందమైన మహిళని జపనీస్ వారసురాలికి పని మనిషిగా (పరిచారిక) తీసుకుంటారు. కానీ ఆ భవనంలో ఆమెతో తెలియకుండానే పలు నేరాలు చేయిస్తుంటారు. ఈ నేరాల అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. విక్టోరియా రాణి సమయంలో సంచలనం సృష్టించిన 'ఫింగర్ స్మిత్' అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు పార్క్ చాన్ వూక్ ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందించారు. 2016లో విడుదలై మంచి విజయం సాధించింది. కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శితమై ఆర్ట్ విభాగంలో అవార్డునందుకుంది. దీంతోపాటు అనేక పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది. ఈ సౌత్ కొరియన్ చిత్రంలో పరిచారికగా కిమ్ మిన్ హీ నటించి మెస్మరైజ్ చేశారు.
నోక్టర్నల్ ఎనిమల్స్
ఒక సంపన్న ఆర్ట్ గ్యాలరీ మహిళా యజమాని రైటర్ అయిన తన భర్తని వదిలేస్తుంది. కానీ అతను రాసిన ఓ థ్రిల్లర్ నవల మాత్రం తనని వెంటాడు తుంటుంది. కలలో, బయట ఏదో తనని వెంటాడు తున్నట్టు భ్రమకి గురవుతుంటుంది. మరి అందుకు కారణమేంటి?, ఆ నవల్లో ఏముందనేది ఆసక్తికర కథాంశానికి ప్రతిరూపమే ఈ సినిమా. నియో నాయర్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా 2016లో విడుదలైంది. టామ్ ఫోర్డ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 1993కి చెందిన 'టోనీ అండ్ సుసన్' అనే నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఆర్ట్ గ్యాలరీ యజమానిగా అమీ ఆడమ్స్ నటించారు. ఆమె భర్తగా జేక్ గిల్లెన్హాల్ నటించారు. ఇది మంచి విజయం సాధించడంతోపాటు అనేక అవార్డులను కైవసం చేసుకుంది.
గెరాల్డ్స్ గేమ్
పెళ్లైన మధ్య వయస్కులైన జంట అటవి ప్రాంతంలో సింగిల్‌గా ఉండే ఇంట్లో నివసిస్తుంటారు. తమ దాంపత్య బంధాన్ని మరింత రొమాంటిక్‌గా గడపాలని భావిస్తారు. ఈ క్రమంలో బెడ్‌పై తన భార్య రెండు చేతులు కట్టేస్తాడు. ఆమెతో రొమాన్స్ చేసే క్రమంలో అతను గుండెపోటుతో చనిపోతాడు. దీంతో రెండు చేతులు లాక్ చేయడంతో ఆమె వాటిని విడిపించుకోలేక, తన భర్తని కాపాడుకోలేక నరకయాతన పడుతుంటుంది. ఇటువంటి పరిస్థితిలో వాళ్ళ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది?, ఆమెని తన భర్త గతం తాలూకా కలలు వెంటాడటానికి కారణమేంటనే కథాంశంతో ఆద్యంతం థ్రిల్ చేసే రీతిలో ఈ సినిమా రూపొందింది. మైక్ ఫ్లానగన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం 2017లో విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతోపాటు విమర్శకుల ప్రశంసల్ని కూడా సొంతం చేసుకుంది. అలాగే పలు అవార్డులను కూడా దక్కించుకుంది. ఇందులో భార్యాభర్తలుగా నటించిన కార్లో గుగినో, బ్రూస్ గ్రీన్వుడ్ నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
రెడ్ స్పారో
యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఓ మహిళా గూఢచారి జర్నీని తెలుపుతుంది. డోమినికా అనే రష్యన్ ఇంటిలిజెంట్ అధికారిణి అమెరికాకు చెందిన సీఐఏ ఏజెంట్‌గా నియమించబడతారు. రష్యాలో జరిగే సెక్స్‌వల్ రాకెట్‌ని పట్టుకునేందుకు తన బాడీనే వెపన్‌గా మార్చుకుంటారు. ఈ క్రమంలో ఆమె ఏం కనుగొన్నారు?, అమెరికా చేసిన కుట్ర ఏంటనే ఆసక్తికర సన్నివేశాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా దర్శకుడు ఫ్రాన్సిస్ లారెన్స్ రూపొందించారు. సస్పెన్స్‌గా సాగే సన్నివేశాలు ఆడియెన్స్‌ని కట్టిపడేస్తాయి. రష్యన్ స్పైగా జెన్నిఫర్ లారెన్స్ అద్భుతమైన నటనతో మంత్రముగ్ధుల్ని చేశారు. గతేడాది విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
మైల్ 22
పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినప్పటికీ స్మగ్లర్స్‌కి అనుకూలంగా పనిచేస్తూ, అత్యంత విలువైన సమాచారాన్ని ఇండోనేషియాకు చేరవేస్తున్న మిస్టీరియస్ పోలీస్ అధికారిని పట్టుకునేందుకు ఎలైట్ అమెరికన్ ఇంటలిజెన్స్ అధికారి బృందం చేసే సాహసోపేతమైన పోరాట ప్రధాన చిత్రమిది. యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా దర్శకుడు పీటర్ బెర్గ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంటలిజెన్స్ అధికారిగా బెర్గ్ నటించారు. వీరి కాంబినేషన్లో ఇది నాల్గో చిత్రం. గతంలో 'లోన్ సర్వైవర్', 'డీప్‌వాటర్ హరిజోన్', 'పేట్రియాట్స్ డే' చిత్రాలొచ్చి మంచి విజయాలు సాధించాయి. ఇంటిలిజెన్స్ అధికారిగా మార్క్ వెల్బెర్గ్ అద్బుత నటనతో మైమరపించారు. ఇతర ముఖ్యపాత్రల్లో ఇకో ఉవాయిస్, జాన్ మాల్కోవిచ్, లారెన్ కోహెన్ నటించారు.
రిప్లికాస్
ఓ న్యూరోసైంటిస్ట్ కుటుంబం కారు ప్రమాదంలో దారుణంగా చనిపోతుంది. తన కూతురు, భార్య కూడా అందులో ఉంటారు. ఈ ప్రమాదంతో చలించిపోయిన ఆ సైంటిస్ట్ ఓ నిర్ణయానికి వస్తాడు. తాను ఎంతగానో ప్రేమించిన కుటుంబ సభ్యులను తిరిగి బతికించు కోవాలనుకుంటాడు. అందుకోసం సైన్స్‌లోని కొత్త ప్రయోగాలకు తెరలేపుతాడు. మరి తన ఫ్యామిలీని తిరిగి పొందాడా?, ఈ క్రమంలో ఆయన ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడనే అసక్తికర, ఉత్కంఠభరిత థ్రిల్లింగ్ అంశాల సమాహారమే ఈ చిత్రం. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి జెఫ్రే నచ్మనాఫ్ దర్శకత్వం వహించారు. గతేడాది విడుదలైన ఈ సినిమా అనేక విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఇదొక సంచలనాత్మక చిత్రంగా నిలవడం విశేషం. సైంటిస్ట్‌గా కీను రీవెల్ నటించారు.
ది వానిషింగ్
యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రమిది. స్కాట్లాండ్కి సమీపంలో ఉన్న ఫ్లాన్నన్ ఐలాండ్‌లోని లైట్ హౌస్‌లో తరుచూ ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ సెక్యూరిటీ నిర్వహిస్తుంటారు. ప్రతి ఆరు వారాలకు వారిని మార్చడం జరుగుతుంది. ఈ క్రమంలో మంచి అనుభవం ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ థామస్, జేమ్స్, డోనాల్డ్‌లో ఒక్కొరిగా మిస్ అవుతుంటారు. మిస్ అయిన వాళ్ళు తిరిగి కనిపించరు. ఆ మిస్టరీ వెనకాల ఉన్న రహస్యమేంటనే కథాంశంతో 1900లో జరిగిన మిస్టరీ ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. క్రిస్టోఫర్ నైహౌల్మ్ దర్శకత్వం వహించారు. ముగ్గురు సైనికులుగా గెరార్డ్ బట్లర్, పీటర్ ముల్లన్, కాన్నర్ స్విండెల్స్ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇది ఈ ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించింది.
గ్లాస్
ఫిలడెల్ఫియా జూ పార్క్‌లో పనిచేసే మాజీ ఉద్యోగి కెవిన్ సూపర్ నేచురల్ లక్షణాలు కలిగి ఉంటాడు. తాను 24 రూపాలకు మారిపోతుంటాడు. ఇలా మారుతూ వరుసగా హత్యలకు, విధ్వంసాలకు పాల్పడుతుంటాడు. అతన్ని పట్టు కునేందుకు, అతనిలోని మార్పుని గుర్తించేందుకు పోలీసులు మరో సూపర్ నేచురల్ పవర్స్‌ని కలిగిన డేవిడ్‌ని సంప్రదిస్తారు. ఆయన ఎదుటి వారిని టచ్ చేస్తే వాళ్ళు హంతకులా, కాదా?, వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పేయగలరు. ఇతని సహాయంతో కెవిన్ని పట్టుకున్నారా? ఈ క్రమంలో ఏం జరిగిందనే ఉత్కంఠభరిత సన్నివేశాల సమాహారంగా ఈ సినిమా రూపొందింది. సైకలాజికల్ సూపర్ హీరో థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రానికి ఎం.నైట్ శ్యామలన్ దర్శకత్వం వహించారు. ఇది జనవరిలో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో కెవిన్‌గా జేమ్స్ మెక్ అవోరు, మరో ఇంటలిజెంట్ హంతకుడిగా సామ్యూల్ ఎల్ జాక్సన్, సూపర్‌నేచురల్ పవర్స్ కలిగిన డేవిడ్‌గా బ్రూస్ విల్లిస్ నటించారు. ఇందులో జేమ్స్ నటన సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ చిత్రం అందర్నీ ఫిదా చేసింది.
షాట్ కాలర్
రెడ్ సిగల్ పడినా దాటుతూ ఎదురుగా వచ్చిన కారుని ఓ స్టాక్ బ్రోకర్ ఢ కొట్టడంతో ఆ కారులోని వ్యక్తి చనిపోతాడు. దీంతో స్టాక్ బ్రోకర్‌కి జైలు శిక్ష పడుతుంది. జైల్లో ఇతర క్రిమినల్స్‌తో గొడవలు అవుతుంటాయి. ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాక ఇతని గురించి తెలుసుకున్న కాలిఫోర్నియాలోని గ్యాంగ్ అంతా కలిసి ఇతన్ని లీడర్‌గా ఎన్నుకుంటారు. దీంతో తక్కువ కాలంలోనే పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. ఓ సాధారణ మధ్యతరగతి వ్యక్తి గ్యాంగ్‌స్టర్‌గా మారిన వైనం ఇతివృత్తంతో క్రైమ్ డ్రామా థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. దీనికి రిక్ రామన్ వాఫ్ దర్శకత్వం వహించారు. 2017లో విడుదలైన ఈ చిత్రంలో స్టాక్ బ్రోకర్‌గా నికోలజ్ కోస్టర్ నటించి ఆకట్టుకున్నారు.
ది గిఫ్ట్స్
కొత్తగా పెళ్ళి చేసుకున్న జంట హ్యాపీగా తమ వైవాహిక జీవితాన్ని గడుపుతుంటారు. ఈ క్రమంలో వాళ్లకి ఓ గిఫ్ట్ వస్తుంది. ఎవరు పంపించారో, ఎందుకు పంపించారో అర్థం కాదు. ఇలా రోజుకో గిఫ్ట్ వస్తుంటుంది. దీంతో ఆశ్చర్యానికి, ఆందోళనకి గురవుతుంటారు. దాని వెనకాల హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని, అది పంపించింది భర్త క్లాస్మేట్ అని భార్యకి అర్థమవుతుంది. ఈ క్రమంలో గతంలో ఏం జరిగిందనేది ఆసక్తికరం, ఉత్కంఠభరితం. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి జోయిల్ ఎడ్గెర్టన్ దర్శకత్వం వహించారు. ఆద్యంతం సస్పెన్స్‌గా సాగే ఈ సినిమా 2015లో విడుదలై చిన్న బడ్జెట్ చిత్రాల్లో భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. జాసన్ బ్యాట్మన్, రెబెక్కా హాల్ జంట నటన ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుంది.