క్రీడా నేపథ్య చిత్రాలకు సర్వత్రా విశేష ప్రేక్షకాదరణ ఉంది. అంతేకాదు వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాయి. దీంతో సినీ మేకర్లు క్రీడా నేపథ్య చిత్రాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అలాగే భిన్న క్రీడల్లో లెజెండ్స్‌గా నిలిచిన ప్రముఖ క్రీడాకారుల జీవితాలను వెండితెరపై అత్యద్భుతంగా ఆవిష్కరించి విజయాల్ని సాధిస్తున్నారు. నవ్య స్పోర్ట్స్ ప్రధాన చిత్రాలతో చేసిన ప్రయోగాలకూ మంచి ఆదరణ లభించడంతో హాలీవుడ్ దగ్గర్నుంచి టాలీవుడ్ వరకు ఈ తరహా చిత్రాల నిర్మాణంపై ఆసక్తి పెరిగింది. ఈ సందర్భంగా ప్రేక్షకులు విశేషంగా మెచ్చిన కొన్ని క్రీడా నేపథ్య చిత్రాల గురించి అందిస్తున్న స్పెషల్ షో..
రష్
ఇద్దరు అత్యంత తెలివైన, ప్రతిభావంతులైన ఫార్ములా వన్ రేసర్స్ మధ్య వ్యక్తిగతంగా, వృత్తిగతంగా జరిగే పోటీ నేపథ్యంలో సాగే చిత్రమిది. 1971లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందింది. ఇంగ్లీష్ ప్లేబారు జేమ్స్ హంట్, ఆస్ట్రేలియన్ డ్రైవర్ నికీి లాడా ఫార్ములా వన్ రేసింగ్‌లో పాల్గొంటారు. అందులో చాలా రిస్క్ ఉంటుంది. ఆటలో ఏమాత్రం మిస్టేక్ చేసినా అది లైఫ్‌కే ప్రమాదం. అలాంటి పరిస్థితుల్లో వీరి మధ్య జరిగిన పెద్ద పోటీలో విజేతలెవరు?, ఇందులో ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఆసక్తికరం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ చిత్రమిది. జేమ్స్ పాత్రలో క్రిస్ హెమ్స్‌వర్త్, నికీ పాత్రలో డానియెల్ బ్రూల్ నటించారు. 2013లో విడుదలైన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 'అపోలో 13', 'ఏ బ్యూటిఫుల్ మైండ్', 'సోలో: ఏ స్టార్ వార్స్ స్టోరీ' చిత్రాలను రూపొందించిన దర్శకుడు రోనాల్డ్ విలియమ్స్ హౌవార్డ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.
వారియర్
మిక్స్డ్ మార్షియల్ ఆర్ట్స్(బాక్సింగ్)లో ఇద్దరు అన్నదమ్ములు తలపడటం ప్రధానంగా సాగే చిత్రమిది. టామీ, బ్రెండన్ అన్నదమ్ములు. వాళ్ళ నాన్న పాడీ మాజీ బాక్సర్. బాక్సింగ్ కోచ్ కూడా. తన కుటుంబంలో జరిగిన ట్రాజెడీ వల్ల మత్తుకి బానిసవుతాడు. పెద్దబ్బాయి బ్రెండన్ కుటుంబ సమస్యల వల్ల ఇబ్బందులు పడుతుంటాడు. జాబ్ కూడా పోతుంది. చిన్నబ్బాయి టామీ మంచి బాక్సర్‌గా రాణిస్తుంటాడు. ఈ నేపథ్యంలో కుటుంబాన్ని సెట్ చేయాలని, మళ్ళీ తన పెద్దబ్బాయిని బాక్సర్‌గా తీర్చిదిద్దాలని తండ్రి భావిస్తాడు. ఈ క్రమంలో ఇద్దరబ్బాయిలు బాక్సింగ్ పోటీలో తలపడాల్సి వస్తే ఏం జరిగింది?, ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. గెవిన్ ఓ కన్నర్ దర్శకత్వం వహించిన ఈ క్రీడా ప్రధాన చిత్రం 2011లో విడుదలై ఆకట్టుకుంది. అలాగే క్రిటికల్‌గానూ మంచి ప్రశంసలు అందుకుంది. ఇందులో పెద్దబ్బాయిగా జోయిల్ ఎడ్గర్టన్, చిన్నబ్బాయిగా టామ్ హార్డీ అద్భుత నటనతో మెప్పించారు. గ్రిప్పింగ్ యాక్షన్, నటీనటుల అద్భుత నటన సినిమాలో హైలైట్‌గా నిలిచాయి. దీన్ని బాలీవుడ్లో 'బ్రదర్స్' పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడ యావరేజ్‌గా నిలిచింది.
ఫైటింగ్ విత్ మై ఫ్యామిలీ
బయోగ్రాఫికల్ స్పోర్స్ కామెడీ డ్రామా చిత్రమిది. మాజీ రెజ్లర్ కుటుంబం అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. చిన్నప్పట్నుంచే పిల్లలు గొడవ పడుతుంటారు. ఆ గొడవని రెజ్లింగ్‌గా మార్చి వాళ్ళని రెజ్లర్లుగా తీర్చిదిద్దాలను కుంటాడు. ఈ క్రమంలో తన కూతురిని రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్స్ ఛానెల్ నిర్వహించే రెజ్లింగ్ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిపేందుకు చేసే ప్రయత్నం ప్రధానంగా ఆద్యంతం హాస్యభరితంగా రూపొందిన చిత్రమిది. స్టీఫెన్ మర్చెంట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో డ్వానే జాన్సన్ ఈ చిత్రాన్ని నిర్మించడంతోపాటు ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించారు. మహిళా రెజ్లర్‌గా ఫ్లోరెన్స్ ఫాగ్ నటన ప్రేక్షకుల్ని ఫిదా చేస్తుంది.
ఐ, టోన్యా
పాపులర్ అమెరికన్ ఫిగర్ స్కాటర్ టోన్యా హార్డింగ్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. క్రాగ్ గిల్లెస్పీ దర్శకత్వం వహించారు. 1994లో టోన్యాపై ప్రత్యర్థి నాన్సీ కెర్రిగన్ చేసిన ఆరోపణలు, దాడుల నేపథ్యంలో తనదైన అద్భుతమైన ఆటతో ప్రేక్షకులను ఆద్యంతం రక్తికట్టించిన టోన్యా జీవితం తెరవెనక ఎంత ఒడిదుడుకులతో సాగింది. తనపై వచ్చిన ఆరోపణలు, తన మాజీ భర్తతో ఎదురైన ఇబ్బందులను ఎలా ఎదుర్కొందనే కథాంశంతో దర్శకుడు క్రాగ్ గిల్లెస్పీ సినిమాని ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. 2017లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా యావరేజ్‌గా నిలిచినా క్రిటికల్‌గా మంచి ప్రశంసలందుకుంది. ఇందులో టోన్యా పాత్రలో మార్గోట్ రాబీ నటిస్తూ నిర్మించారు. ఆమెకి కోచ్‌గా, సపోర్టింగ్ రోల్లో నటించిన అల్లీసన్ జెన్నీ సహాయనటిగా ఆస్కార్ అందుకుంది. దీంతోపాటు ఈ సినిమా అనేక అవార్డుల్ని సొంతం చేసుకుంది.
మనీ బాల్
2002లో జరిగిన యదార్థ సంఘటనల నేపథ్యంలో ఆక్లాండ్ అథ్లెటిక్ బేస్ బాల్ టీమ్ జనరల్ మేనేజర్ బిల్లీ బియన్స్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందిన క్రీడా ప్రధాన చిత్రమిది. జనరల్ మేనేజర్ బియన్స్ బేస్‌బాల్ టీమ్‌ని ఎంపిక చేయడం, ఎన్నో అవంతరాల మధ్య తమ టీమ్‌ని విజేతగా నిలపడంలో చేసిన విశేష కృషి ప్రధానంగా, ఆద్యంతం స్పోర్ట్స్ డ్రామాగా రూపొందింది. బెన్నెట్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2011లో విడుదలైంది. ఇందులో బియన్స్గా బ్రాడ్‌పిట్ నటన ఆద్యంతం మ్యాజిక్ చేస్తుంది. క్రిటికల్‌గా, కమర్షియల్‌గా సినిమా ప్రపంచ ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఆరు విభాగాల్లో ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది.
పీలేె: బర్త్ ఆఫ్ ఏ లెజెండ్
బ్రెజిల్ ఫుట్‌బాల్ ఛాంపియన్ ఎడ్సన్ అరంటెస్ డు నాస్కిమెంటో(పీలే) జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. బ్రెజిల్‌కి చెందిన ఈ ఫుట్‌బాల్ ప్లేయర్ తన 15వ ఏట ఫుట్‌బాల్ క్రీడలోకి అడుగుపెట్టి, 16వ ఏట జాతీయ స్థాయి టీమ్‌కి ఎంపికయ్యారు. తన 17వ ఏటనే ఫిఫా వరల్ట్ కప్ విజేతగా నిలిచారు. బ్రెజిల్ టీమ్‌ని తిరుగులేని జట్టుగా నిలిపారు. అప్పట్లో అదో సంచలనం. అందుకే ఆయన్ని పుట్టుకతోనే లెజెండ్‌గా ప్రపంచ మీడియా అభివర్ణించింది. దీంతోపాటు తన సారథ్యంలో 1958, 62, 70 సంవత్సరాలలో బ్రెజిల్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక భూమిక పోషించారు. ఈ విజయం వెనకాల ఆయన ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఆధారంగా చేసుకుని, విజయపరంపర ప్రధానంగా ఆద్యంతం రక్తికట్టించేలా దర్శకుడు జెఫ్ జింబాలిస్ట్ ఈ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామాని రూపొందించారు. 2016లో విడుదలైన ఈ చిత్రంలోని పీలే పాత్రలో కెవిన్ డె పాలా అద్భుత నటనతో మెప్పించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించడం ఓ విశేషమైతే, ఆయన ఆస్కార్‌కి నామినేట్ కావడం మరో విశేషం.
మిలియన్ డాలర్ ఆర్మ్
జె.బి.బెర్నస్టీన్ అనే స్పోర్ట్స్ ఏజెంట్ బేస్‌బాల్ టీమ్‌ని ఎంపిక చేసేందుకు విభిన్నమైన దారిని వెతుకుతాడు. ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్‌లో ప్రతిభావంతులను కనిపెట్టాలని భావించి ఇండియా వచ్చిన ఆయన మట్టిలో మాణిక్యం లాంటి కొంత మంది ప్లేయర్స్‌ని తయారు చేసి, ట్రైన్ చేసి బేస్‌బాల్ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిపేందుకు చేసిన కృషి ప్రధానంగా బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. క్రెగ్ గిల్లెస్పీ దర్శకత్వం వహించారు. స్పోర్ట్స్ ఏజెంట్‌గా జాన్ హమ్ నటించారు. బేస్‌బాల్ ప్లేయర్స్‌గా మన దేశానికి చెందిన, 'లైఫ్ ఆఫ్ పై' నటుడు సురజ్ శర్మ, మధుర్ మిట్టల్, టామ్ హౌస్ నటించారు. ఈ సినిమాకి రెహ్మాన్ సంగీతం అందించడం విశేషం. 2014లో విడుదలై ఈ చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణతో ఘన విజయం సాధించింది.
గ్రడ్గ్ మ్యాచ్
వృద్ధులైన మాజీ బాక్సర్స్ మధ్య బాక్సింగ్ పోటీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ముప్పై ఏండ్ల క్రితం రాబర్ట్ డీ నిరో, సిల్వెస్టర్ స్టాలోన్ వరల్డ్ ఛాంపియన్ బాక్సర్స్. ముప్పై ఏండ్ల తర్వాత దాదాపు వృద్ధులుగా మారతారు. అలాంటి టైమ్‌లో వీరిద్దరు బాక్సింగ్ పోటీలో పాల్గొనాల్సి వస్తుంది. అందుకు దారి తీసిన కారణాలేంటి?, అరవై ఏండ్లకు పై పడిన ఈ ఇద్దరూ మళ్ళీ తమని తాము నిరూపించు కునేందుకు ఎలాంటి స్ట్రగుల్ పడ్డారనే కథాంశంతో ఆద్యంతం సంచలనం సృష్టించే గేమ్ ప్రధానంగా సాగిన ఈ సినిమాకి పీటర్ సెగల్ దర్శకత్వం వహించారు.
42
1946 అమెరికాలో నల్ల జాతీయులపై జాత్యహంకారం చూపిస్తున్న రోజులవి. అమెరికన్ బేస్‌బాల్ టీమ్‌లో 42వ జెర్సీ గల ఓ నల్లజాతీయుడు జాకీ రాబిన్సన్పై తెల్లజాతి ఆటగాళ్ళ వేధింపులు ఎక్కువవుతాయి. అతన్ని చాలా చులకనగా చూస్తూ హేళన చేస్తుంటారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొని తనని తాను మార్చుకుని, టీమ్‌లో తనకు సహాయంగా వచ్చిన వన్ నెంబర్ జెర్సీ ఆటగాడితో కలిసి టీమ్‌ని విన్నర్‌గా నిలపడం, అత్యధికంగా పాయింట్స్ చేసి సంచలనం సృష్టించడం ప్రధానంగా రూపొందిన స్ఫూర్తివంతమైన బయోగ్రాఫికల్ క్రీడా చిత్రమిది. బ్రియాన్ హెల్గ్లాండ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2013లో విడుదలై సంచలన విజయం సాధించింది. జాకీ రాబిన్సన్ పాత్రలో చాడ్విక్ బోస్‌మ్యాన్ నటించారు. ఆయనకు కోచ్‌గా హర్రీసన్ ఫోర్ట్ నటించడం విశేషం.
గూన్
ఐస్ హాకీ ప్రధానంగా సాగే కెనడియన్ హాస్యభరిత క్రీడా చిత్రమిది. డాగ్ గ్లాట్కి తెలివితక్కువ తనం తన సొంతం. ఐస్ హాకీకి తను ఫిట్ కాదు. కానీ తనే టీమ్‌ని లీడ్ చేయాల్సి వస్తుంది. అనేకసార్లు ఫెయిల్ అయి తోటి క్రీడాకారులతో హేళనకు గురైన డాగ్ ఎట్టకేలకు తనలో కూడా శక్తి సామర్థ్యాలున్నాయని గ్రహిస్తాడు. దీంతో శ్రమించి మంచి ఆటగాడిగా తయారవుతాడు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి టీమ్ తనకంటే బలమైన, క్రూరమైన ఆటగాడిని రంగంలోకి దించుతుంది. అతని దాడిని ఎదుర్కొని ఐస్ హాకీలో విజేతగా ఎలా నిలిచాడు?, ఈ క్రమంలో చోటు చేసుకున్న హాస్యభరిత, నాటకీయ పరిణామాల, భావోద్వేగభరిత సన్నివేశాల సమాహారమే ఈ సినిమా. మైఖేల్ డైసీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2011లో విడుదలై క్రిటికల్‌గా మంచి ప్రశంసలందుకుంది. డాగ్ పాత్రలో సియాన్ విలియమ్ స్కాట్ నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
క్రీడ్ సిరీస్
ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన చిత్రం 'క్రీడ్'. ఆయన్ని హాలీవుడ్లో అగ్ర హీరోగా నిలబెట్టిన 'రాకీ' సిరీస్‌లో భాగంగా వచ్చిన సబ్ సిరీస్ 'క్రీడ్'. బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్ డ్రామాగా 'క్రీడ్'కి ర్యాక్ కూగ్లర్ దర్శకత్వం వహించారు. మాజీ ఛాంపియన్ బాక్సర్ సిల్వెస్టర్ స్టలోన్ ఒకసారి విఫలమైన యువ బాక్సర్‌ని తిరిగి ఛాంపియన్‌గా తీర్చిదిద్దడం, ఈ క్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర, భావోద్వేగ భరిత సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. 2015లో విడులైన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీనికి సీక్వెల్‌గా 2018లో 'క్రీడ్ 2' విడుదలైంది. స్టీవెన్ కాపుల్ జూనియర్ దర్శకత్వం వహించగా, దీన్ని సిల్వెస్టర్ స్టాలోన్ నిర్మించడం విశేషం. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రపంచ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ సినిమాకి ఏ ప్లస్ రేటింగ్ రావడం విశేషం.
Authorization