ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ ఎంటర్ టైనర్స్ విశేష ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అంతేకాదు కలెక్షన్ల సునామీతో వరల్డ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాయి. ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లతో సిల్వర్ స్క్రిన్‌పై నాయకానాయికలు ప్రత్యర్థులతో చేసే అత్యద్భుత సాహస భరిత విన్యాసాలకు పిల్లల దగ్గర్నుంచి పెద్దలు సైతం ఫిదా అవుతున్నారు. దీంతో ఈ చిత్రాలకు సర్వత్రా డిమాండ్ పెరిగింది. విమర్శకుల ప్రశంసలతోపాటు కాసుల వర్షం కురిపించిన కొన్ని యాక్షన్ సిరీస్‌ల గురించి ఈ వారం స్పెషల్ షో..
అవెంజర్స్
'అవెంజర్స్' ఇప్పుడు ప్రపంచ బాక్సాఫీసుని షేక్ చేస్తున్న సినిమా సిరీస్. ఇటీవల విడుదలైన సిరీస్‌లోని చివరి చిత్రం 'అవెంజర్స్: ఎండ్ గేమ్' సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా నిలిచిన 'అవతార్'ని దాటేసి మొదటి స్థానంలో నిలిచింది. ఒక స్టార్ హీరో తెరపై కనిపిస్తేనే ఊగిపోతాం. అదే ఇద్దరు స్టార్స్ ఒకే తెరపై సందడి చేస్తే చూసేందుకు రెండు కళ్ళు చాలవు. మరి ఏకంగా ఆరుగురు సూపర్ హీరోలు ఒకేసారి నట విశ్వరూపం చూపిస్తే ఆ అద్భుతాన్ని మాటల్లో వర్ణించలేం. అదే 'అవెంజర్స్' సిరీస్ ప్రత్యేకత. 'అవెంజర్స్' సిరీస్‌కి రూపకర్త మార్వెల్ స్టూడియో. సూపర్ హీరోలను సృష్టించిన మార్వెల్ తొలి ప్రయత్నంగా 2008లో 'ఐరన్ మ్యాన్'ని అనే సూపర్ హీరో చిత్రాన్ని రూపొందించారు. అనంతరం 2012లో 'ది అవెంజర్స్' సిరీస్‌ని ప్రారంభించారు. 2012 తొలి చిత్రం విడుదలైంది. ఇది 220 మిలియన్ డాలర్లతో రూపొంది ఏకంగా 1.519 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీనికి సీక్వెల్‌గా 2015లో వచ్చిన 'అవెంజర్స్: ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్' 450 మిలియన్ డాలర్లతో రూపొంది 1.4మిలియన్ డాలర్లని వసూలు చేసింది. 2018లో వచ్చిన 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్' 400 మిలియన్ డాలర్లతో రూపొంది రెండు బిలియన్ డాలర్లు కలెక్ట్ చేయగా, చివరి చిత్రం 'అవెంజర్స్ : ఎండ్‌గేమ్' ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై 2.796 బిలియన్ డాలర్లని వసూలు అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాగా నిలిచింది.
థోర్
మార్వెల్ స్టూడియోస్ నుంచి రూపొందిన మరో సిరీస్ ఇది. మొదటి చిత్రం 2011లో విడుదలైంది. కెన్నెత్ బ్రానగ్ దర్శకత్వం వహించారు. థోర్‌గా క్రిస్ హెమ్స్‌వర్త్ నటించారు. యుద్ధవీరుడు, యువ రాజైనా థోర్ పాత్ర ప్రధానంగా సాగుతుంది. తన రాజ్యంపై శత్రువులు దాడి చేస్తుంటారు. దీంతో థోర్కి తానేంటో నిరూపించుకునే టైమ్ వస్తుంది. శత్రువులతో పోరాడి రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు? తన స్థానాన్ని తిరిగి ఎలా పొందాడనేది ఈ సిరీస్ కథ. ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధానంగా సినిమాలు సాగుతాయి. తొలి చిత్రం 150 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 450 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. దీనికి సీక్వెల్‌గా 2013లో అలన్ టేలర్ దర్శకత్వంలో 'థోర్: ది డార్క్ వరల్డ్' సినిమా విడుదలై 645 మిలియన్ డాలర్ల కలెక్షన్లను రాబట్టింది. 'థోర్' సిరీస్‌లో భాగంగా 2017లో 'రగ్నారాక్' విడుదలైంది. దీనికి టైకా వైటిటి దర్శకత్వం వహించగా, 180 మిలియన్ డాలర్లతో రూపొంది 854మిలియన్ డాలర్లని వసూలు చేసింది. దీనికి మరో సీక్వెల్‌గా రూపొందుతున్న 'థోర్: లవ్ అండ్ థండర్' 2021లో ప్రేక్షకుల ముందుకి రానుంది.
కెప్టెన్ అమెరికా
ఇది కూడా మార్వెల్ స్టూడియోస్‌లో నిర్మితమైన చిత్ర సిరీస్. స్టీవ్ రోగర్స్ బలహీనంగా ఉండే వ్యక్తి. సైనికుడిగా రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొని, సేవలందించాలన్నది అతడి ఆశయం. చాలా సార్లు పోలీస్ డిపార్ట్మెంట్ సెలక్షన్స్‌లో తిరస్కరించ బడతాడు. దీంతో సూపర్ సోల్జర్‌గా మారాలని నిర్ణయించుకుంటాడు. ఈ ప్రయత్నంలో భాగంగా సాంకేతిక, రసాయనిక ప్రయోగాల ఫలితంగా సూపర్ సోల్జర్‌గా మారి కెప్టెన్ అమెరికా అవుతాడు. సూపర్ సోల్జర్‌గా శత్రు సైన్యాలను ఎదిరించడమనే ఇతివృత్తంతో ఈ సిరీస్ రూపొందింది. తొలి చిత్రం 'కెప్టెన్ అమెరికా: ది ఫస్ట్ ఎవెంజర్స్' 2011లో విడుదలైంది. ఈ చిత్రాన్ని దర్శకుడు జియో జానస్టన్ రూపొందించారు. కెప్టెన్ అమెరికాగా క్రిస్ ఇవాన్స్ నటించారు. 140 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ చిత్రం 370 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. దీనికి సీక్వెల్‌గా 2014లో 'కెప్టెన్ అమెరికా: ది వింటర్ సోల్జర్' విడుదలైంది. ఆంథోని రూస్సో దర్శకత్వం వహించగా, ఇది 170 మిలియన్ డాలర్లతో రూపొంది,
714 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. మరో సీక్వెల్ 'కెప్టెన్ అమెరికా: సివిల్ వార్' 2016లో వచ్చింది. ఇది 250 మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 1.153 బిలియన్ డాలర్లని కలెక్ట్ చేసింది.
ఐరన్ మ్యాన్
మార్వెల్ స్టూడియో సృష్టించిన అద్భుతం 'ఐరన్ మ్యాన్'. ఈ సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రమిదే కావడం విశేషం. జోన్ ఫేవ్రియూ దర్శకత్వంలో సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. 'ఐరన్ మ్యాన్' పేరుతో వచ్చిన పుస్తకంలో పాత్ర ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించారు. టోని స్టార్క్ ఓ బడా ఆయుధాల వ్యాపారికి కుమారుడు. అఫ్గానిస్తాన్‌తో యుద్ధ సమయంలో ఇరాక్ సేనలకు
ఆయుధాలు ఇచ్చేందుకు టోని సైనికులతో బయలుదేరుతాడు. మార్గమధ్యలో శత్రువులు వీరిపై దాడి చేస్తారు. శత్రువుల నుంచి తప్పించుకుని తనని ఒక మెషిన్లా తయారు చేసుకుంటాడు. సైంటిస్టులు, ఇంజనీర్ల సహాయంతో గుండెకు కార్ బ్యాటరీని, శరీరం మొత్తం ఐరన్ ప్లేట్స్ అమర్చుకుంటూ ఐరన్మ్యాన్లా తయారై శత్రువులను ఎలా మట్టుపెట్టాడనేది కథ. టోనీ స్టార్క్, ఐరన్ మ్యాన్ పాత్రల్లో రాబర్ట్ డౌనీ జూనియర్ నటించారు. విజువల్ వండర్‌గా 2008లో విడుదలైన తొలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందడంతోపాటు 140మిలియన్ డాలర్లతో తెరకెక్కి 586 మిలియన్ డాలర్లలను వసూలు చేసింది. దీనికి సీక్వెల్‌గా 2010లో 'ఐరన్ మ్యాన్ 2'ని రూపొందించారు. 200మిలియన్ డాలర్లతో తెరకెక్కి 624 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. మరో సీక్వెల్ 'ఐరన్ మ్యాన్ 3' 2013లో విడుదలైంది. ఇది 200మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 1.22బిలియన్ డాలర్లను వసూలు చేసింది.
స్పైడర్ మ్యాన్
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన సూపర్ హీరో సిరీస్‌లో ఇదొకటి. చిత్రమైన సాలీడు వేష ధారణ, మానవాతీత శక్తులు, అత్యద్భుత సాహసోపేత విన్యాసాలు వెరసీ.. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు 'స్పైడర్‌మ్యాన్'కి అభిమానులుగా మారిపోయారు. దీని సృష్టికర్తలు స్టాన్ లీ, స్టీవ్ డిట్కో అనే అమెరికన్ రచయితలు. 'సూపర్ హీరో' పుస్తకం ప్రకారం స్పైడర్ మ్యాన్ అద్భుతమైన ప్రతిభ, మానవాతీ శక్తులు కలిగి ఉంటాడు. నైతిక విలువలను పాటిస్తూనే ప్రజల రక్షణ కోసం పని చేస్తుంటాడు. అంతేకాదు తనొక సైంటిస్ట్. జన్యుపరంగా విభిన్నత కలిగి ఉండటం స్పైడర్ మ్యాన్ ప్రత్యేకత. ఈ సిరీస్ మొదట 1977లో ప్రారంభమైంది. తొలి విడతగా 'స్పైడర్ మ్యాన్', 'స్పైడర్ మ్యాన్ స్ట్రైక్స్ బ్యాక్', 'స్పైడర్ మ్యాన్: ది డ్రాగాన్ ఛాలెంజ్' చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత 2002లో మళ్ళీ ప్రారంభమైంది. 2004లో 'స్పైడర్ మ్యాన్ 2', 2007లో 'స్పైడర్ మ్యాన్3', 2012లో 'ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్', 2014లో 'ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2' చిత్రాలొచ్చాయి. దాదాపు బిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఐదు సినిమాలు సుమారుగా 4 బిలియన్ డాలర్లను రాబట్టి ప్రపంచంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఆరవ చిత్ర సిరీస్‌గా నిలిచింది.
Authorization