క్యూబాలో చిత్ర పరిశ్రమ 20వ శతాబ్దంలోనే ఊపిరి పోసుకుంది. క్యూబా తిరుగుబాటు (1958)కి ముందు కేవలం 80 సినిమాలు మాత్రమే రూపొందాయి. 1959 ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్ర పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి జరిగింది. క్యూబాలో సహజత్వానికి దగ్గరగా, అక్కడి ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబించే సినిమాలే అధికంగా వచ్చాయి.. వస్తున్నాయి కూడా. ఎలాంటి వాణిజ్యపరమైన మసాలాలు లేకపోయినప్పటికీ వాటిని ప్రేక్షకులు ఆదరించడం విశేషం. భిన్న నేపథ్యాలతో క్యూబాలోని వాస్తవిక పరిస్థితులకు, కుటుంబ అనుబంధాలకు అద్దం పట్టి ఉత్తమ సినిమాలుగా నిలిచిన కొన్ని క్యూబా చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
సూట్ హబానా
ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో సాగే డాక్యుమెంటరీ చిత్రమిది.
ప్రముఖ దర్శకుడు ఫెర్నాండో పెరెజ్ అన్నీ తానై రూపొందించారు.
డౌన్ సిండ్రోమ్ వంటి పలు వ్యాధులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న 13 మంది క్యూబన్ ప్రజల జీవన విధానం, వారి ఎమోషనల్ జర్నీని, తెలిపే చిత్రమిది. డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నటీనటుల హావభావాలు, వారి భావోద్వేగాలను ఏడు కథలుగా, ఓ అసాధారణ ప్రయోగంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ఫ్రాన్కిస్వ్కెటో కార్డెట్, ఫ్రాన్సిస్కో కార్డెట్, నోర్మా పీరెజ్, వాల్డో మోరేల్స్, ఇవాన్ కార్బోనెల్, రాక్వెల్ నోడల్ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. ఇది 2003లో విడుదలైంది. ఆ దశాబ్దంలో వచ్చిన బెస్ట్ క్యూబన్ చిత్రంగా విశ్లేషకులు అభివర్ణించారు. ఇది జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై పలు అవార్డులను అందుకుంది.
జాన్ ఆఫ్ ది డెడ్
క్యూబాలో వచ్చిన తొలి హర్రర్ చిత్రమిది. జాంబీ కామెడీ ప్రధానంగా దర్శకుడు అలెజాండ్రో బ్రూగ్వెస్ ఈ చిత్రాన్ని రూపొందించారు. కొంత మంది కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తులు కలిసి తమ ప్రజలపై దాడి చేసి సర్వనాశనం చేస్తున్న జాంబీ రాక్షసులను అంతం చేసేందుకు చేసే పోరాటం నేపథ్యంలో సినిమా సాగుతుంది. క్యూబా ప్రజలపై అమెరికా చేసిన జాంబీ ప్రయోగాన్ని ప్రతిబింబించేలా, క్యూబన్ ప్రజలు చేగువేరా అందించిన చైతన్యంతో చేసే పోరాటాన్ని తలపించే ఈ చిత్రం 2011లో విడుదలైంది. ఇందులో ప్రధానంగా అలెక్సిస్ డియాజ్ డెవిల్లెగాస్ పోరాటానికి నాయకత్వం వహించే పాత్రలో అద్బుతమైన నటనతో మెప్పించారు. సినిమా మంచి విజయం సాధించడంతోపాటు పలు అవార్డులను కూడా గెల్చుకోవడం విశేషం.
నథింగ్ మోర్
హవానా నగరంలోని పోస్ట్ ఆఫీసులో కార్లా పెరేజ్ ఉద్యోగినిగా పనిచేస్తుంటారు. అక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు చాలా సమర్థవంతంగా నిర్వహించబడుతుంటాయి. అలాంటి ప్లేస్‌లో పనిచేస్తున్న కార్లా బోరింగ్‌గా ఫీలై లెటర్స్ రాయడం ప్రారంభిస్తుంది. తన లాగే బోరింగ్ ఫీలయ్యే వాళ్ళకి ప్రేమని పంచుతూ, వాళ్ళని సంతోషంగా ఉంచాలని నిర్ణయించుకుంటుంది. అందుకు వరుసగా లెటర్స్ రాస్తుంది. ఈ క్రమంలో తనకు తెలియకుండానే తమ తల్లిదండ్రుల కారణంగా ఆమెకి అమెరికాకు వెళ్లేందుకుగానూ గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ వస్తుంది. మరి ఆమె వెళ్ళిందా, అక్కడే ఉందా అన్నది సస్పెన్స్. రొమాంటిక్ కామెడీగా దర్శకుడు జ్వాన్ కార్లోస్ క్రెమాట మాల్బెర్టీ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇది 2001లో విడుదలై సక్సెస్ సాధించింది. ఇందులో కార్లాగా థైస్ వాల్డెస్ నటన కట్టిపడేస్తుంది.
బర్రియో క్యూబా
క్యూబాలోని మూడు కుటుంబాలకు సంబంధించిన కొన్ని ఏండ్లపాటు జరిగిన జర్నీని, వారి ఎమోషన్స్‌ని తెలిపే చిత్రమిది. మాగాలిస్ అనే నర్స్పై ఇగ్నాసియో అనే పెద్ద వయస్కుడు మనసు పడతాడు. ఆమె తండ్రి, సోదరులు అవారాగా తిరుగుతూ అమ్మాయిలకు బానిసలవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె క్యూబాని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటుంది. మరోవైపు సాంటో భార్య మారియా తల్లి కావాలని ఆరాటపడుతుంది. ఓ ట్రాజెడీ స్ట్రైక్ కారణంగా సాంటో అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక వివియన్, చినో అనే జంట గాఢమైన ప్రేమలో మునిగిపోతారు. కాలానుగుణంగా ఈ మూడు కుటుంబాలకు చెందిన ప్రయాణం ఎలాంటి భావోద్వేగభరిత పరిణామాలకు దారి తీసిందనే కథాంశంతో దర్శకుడు హంబర్టో సోలాస్ ఈ చిత్రాన్ని రూపొందించారు. జోర్గె పెరుగోరియా, ఇసాబెల్ సాంటోస్, మారియో లిమోంటా, అడెలా లెగ్రా, ల్యూసా మారియా జిమెనెజ్, రఫియల్ లహెరా ప్రధాన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రం 2005లో విడుదలై మంచి ప్రశంసలందుకుంది.
రెడ్ కాక్రోచెస్
ఓ యువకుడిని ఓ మిస్టీరియస్ యంగ్ ఉమెన్ వెంటాడుతుంటుంది. ఆమెతో రొమాంటిగ్గా దగ్గరవుతాడు. ఆమె గురించి కనుగొనే క్రమంలో ఓ భయంకరమైన వాస్తవం వెలుగులోకి వస్తుంది. తను మరెవరో కాదు, చిన్నప్పుడు తప్పిపోయిన తన చెల్లెలు అని. మరి ఆమెలో మిస్టీరియస్ అంశమేంటి? ఎందుకు తను అలా మారిందనే ఆసక్తికర, భయానక అంశాల సమాహారమే ఈ చిత్రం. సైన్స్ ఫిక్షన్ బ్లాక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ప్రధానంగా సైన్స్‌లోని లోపాలను, ఆధివాస్తవికతను, అశ్లీలతను తెలియజేసింది. మిగ్వెల్ కోయులా తొలి ప్రయత్నంగా అన్నీ తానై ఓ ప్రయోగాత్మకంగా దీన్ని రూపొందించారు. 2003లో విడుదలై భారీ విజయం సాధించడంతోపాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ప్రధాన పాత్రల్లో ఆడమ్ ఫోట్చ్, టలియా రుబెల్ నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది.
డర్టీ డాన్సింగ్: హవావా నైట్స్
అది 1958, క్యూబాలో తిరుగుబాటు జరుగుతున్న రోజులు. కేటీ మిల్లర్ అనే అందమైన అమ్మాయి తండ్రి ఫోర్డ్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తుంటాడు. ఫోర్డ్ ప్రమోషనల్ రీత్యా క్యూబా వెళతాడు. అక్కడ కేటీకి ఓ వెయిటర్‌తో పరిచయం ఏర్పడుతుంది. అతని ద్వారా సెన్స్వల్ క్యూబన్ మ్యూజిక్, డాన్స్‌ని నేర్చుకుంటుంది. వీరిద్దరు కలిసి ఏకంగా డాన్స్ కాంపిటీషన్లో విన్నర్‌గానూ నిలుస్తారు. మరి వీరిద్దరి మధ్య పుట్టిన ప్రేమ ఏ తీరం చేరిందనేది సినిమా. గారు ఫెర్లాండ్ దర్శకత్వం వహించిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా చిత్రం 2004లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కేటీ మిల్లర్‌గా రోమోలా గరై, వెయిటర్‌గా డీగో లునా అద్భుత నటనతో ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు. ఇది విమర్శకుల ప్రశంసలతోపాటు అవార్డుల్ని సైతం కైవసం చేసుకుంది.
ఒరిజినల్ సిన్
క్యూబాలో స్పానిష్ రూల్స్ సాగుతున్న టైమ్ అది. క్యూబాకి చెందిన ఓ సంపన్న వ్యక్తి పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. మెయిల్ ద్వారా ఓ అమ్మాయిని ఎంపిక చేసుకుంటాడు. ఆమె కాన్ ఆర్టిస్టు, వ్యభిచారి, నటి కూడా. ఎంతో అందంగా, మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటుంది. ఆమె ప్రేమలో పడి పెళ్ళి చేసుకుంటాడు. ఆమె కూడా అతన్ని గాఢంగా ప్రేమిస్తుంది. తనపై నమ్మకాన్ని ఏర్పర్చుకుంటుంది. ఆ ఇంటికి సంబంధించిన అన్ని హక్కులను పొందుతుంది. చివరికి అతన్ని దారుణంగా మోసం చేసి ఆస్తినంతా కాజేస్తుంది. ఇంతటి మోసాన్ని చూసి షాక్‌కి గురైనా ఆ సంపన్న వ్యక్తి ఆమెని కనిపెట్టి రివేంజ్ తీర్చుకునేందుకు ఏం చేశాడనేది సినిమా. మైఖేల్ క్రిస్టోఫర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2001లో విడుదలై ప్రశంసలందుకుంది. ఇందులో సంపన్న వ్యక్తిగా ఆంటోనియా బండారస్, కాన్ ఆర్టిస్టుగా ఏంజెలినా జోలీ నటించారు.
చే: ఏ రివల్యూషనరీ లైఫ్
'చే' చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించాయి. ప్రపంచ సినీ ప్రేక్షకులకు చే గువేరా పోరాట స్ఫూర్తిని పరిచయం చేశాయి. దర్శకుడు స్టీవెన్ స్టోడర్బర్గ్ చే జీవితంపై 'చే పార్ట్ 1:బే రివల్యూషనరీ లైఫ'్, 'చే పార్ట్ 2: ఏ రివల్యూషనరీ లైఫ్' పేరుతో 2008లో రెండు సినిమాలను రూపొందించారు. మొదటి చిత్రంలో చే గువేరా పుట్టుక, అనారోగ్యం, వైద్య చదువు, అటు నుంచి మార్క్సిస్టు భావాలకు ఆకర్షితుడై క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో చేసిన విప్లవ ఉద్యమంలో కీలకంగా మారి అమెరికా ఆధిపత్యంలో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్న క్యూబా విప్లవం విజయవంతమయ్యేంత వరకు చూపించగా, రెండవ భాగంలో గెరిల్లా దళానికి నాయకత్వం నుంచి బొలీవియాలో సైన్యానికి వ్యతిరేకంగా పోరాడటం, ఆయన అనుసరించిన పలు ఉద్యమాలు విఫలమవ్వడం, చివరికి సైన్యానికి దొరికిపోయి, వారి చేతుల్లో చనిపోవడం, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలను రెండో భాగంలో అద్భుతంగా చూపించారు. ఈ చిత్రాలు అప్పటి ఆయా దేశాల ప్రజల స్థితిగతులను చెబుతూనే, చే చేసిన పోరాటం, ఆయన అనుసరించిన వ్యూహాలు ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్‌ని ప్రేక్షకులకు కల్గిస్తాయి. ఇందులో చే పాత్రలో నటుడు బెనిసియో డెల్ టోరో లీనమై నటించారు. చే అంటే ఇలానే ఉంటాడేమో అనే అనుభూతి కలిగించడం విశేషం. ఈ చిత్రాలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్తోపాటు పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై పలు అవార్డుల్ని పొందాయి.
కండక్టా
క్యూబాలో ఓ వీధిలో పేద విద్యార్థులకు కార్మెల్లా అనే వృద్ధురాలైన టీచర్ చదువు చెబుతుంటుంది. చలా అనే 12 ఏండ్ల కుర్రాడు, యెని అనే అమ్మాయి కూడా ఆ స్కూల్లో చదువుకుంటారు. వీరిద్దరి కుటుంబాలు అనేక సమస్యల్లో చిక్కుకుని ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ప్రేమలో పడతారు. ఆర్థిక ఇబ్బందుల్లో దీనమైన స్థితిల్లో ఉన్న ఈ జంట ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది?, రిటైర్మెంట్ తీసుకోవాల్సిన టైమ్‌లో ఆ టీచర్ ఏం చేసిందనే ఆసక్తికర అంశాల సమాహారమే ఈ చిత్రం. ఆద్యంతం ఎమోషనల్ డ్రామాగా దర్శకుడు ఎర్నెస్టో డారానాస్ అత్యద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో కుర్రాడు చలా పాత్రలో ఆర్మాండో వల్డెస్ ఫ్రీర్, టీచర్‌గా అలినా రోడ్రిగ్వెజ్, యెనిగా అమలి జుంకో నటించారు. 2014లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పలు అంతర్జాతీయ పురస్కారాలతోపాటు ఆస్కార్ నామినేషన్ ఆర్హత కోసం ఎంపికైంది.
సన్స్ ఆఫ్ క్యూబా
క్యూబాలోని హవానా బాక్సింగ్ అకాడమీలో 9ఏండ్ల క్యూబన్ బోర్డింగ్ స్కూల్ విద్యార్థి శిక్షణ తీసుకుంటాడు. అతనితోపాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎనిమిది నెలలపాటు వీరి శిక్షణ ఎలా సాగింది?, ఎలాంటి నాటకీయ పరిణమాలు చోటు చేసుకున్నాయి. అందులో ఓ కుర్రాడు అతి చిన్న వయసులో, అతి తక్కువ సమయంలో ప్రపంచంలోనే బెస్ట్ బాక్సర్‌గా ఎలా ఎదిగాడనే కథాంశంతో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు. ఈ జర్నీలో వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళని కళ్ళకి కట్టినట్టు చూపించిన ఈ చిత్రానికి ఆండ్రూ లాంగ్ దర్శకత్వం వహించారు. 2009లో విడుదలై మంచి ప్రశంసలతోపాటు అవార్డులనూ గెలుచుకుంది. బాక్సర్‌గా క్రిస్టియన్ మార్టినెజ్ నటించారు.
హవానా
అవి క్యూబా తిరుగుబాటు జరుగుతున్న రోజులు. ప్రముఖ జూదగాడు జాక్ హవానాకి వచ్చి అక్కడ పోకర్ గేమ్‌ని ఆర్గనైజ్ చేస్తాడు. ఓ షిప్లో అతను రాబర్టా అనే మహిళతో ప్రేమలో పడతాడు. ఆమెకి భర్త ఓ విప్లవ నాయకుడు. అతన్ని, ఆమెని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దాన్నుంచి ఎస్కేప్ అయ్యేలా జూదగాడు జాక్ సహకరిస్తాడు. వారి పోరాటానికి సపోర్ట్‌గా నిలుస్తాడు. అనంతరం వీరి జర్నీ ఎలాంటి మలుపులు తిరిగిందనేది సినిమా. ప్రముఖ దర్శకుడు సిడ్నీ పొల్లాక్ దర్శకత్వం వహించారు. 1990లో విడుదలైన ఈ చిత్రం మంచి ప్రశంసలందుకుంది. ఇందులో జూదగాడుగా రాబర్ట్ రెడ్ఫోర్డ్, రాబర్టాగా లినా ఓలినా, ఆమె భర్తగా అలన్ ఆర్కిన్ నటించారు.
బిఫోర్ నైట్ ఫాల్స్
క్యూబాకి చెందిన పోయెట్, నవలా రచయిత రీనాల్డో అరెనాస్ జీవితాన్ని తెలిపే చిత్రమిది. క్యూబాలో పుట్టి పెరిగిన రీనాల్డో క్యూబా తిరుగుబాటు సమయంలో క్యాస్ట్రోతో కలిసి పనిచేశారు. స్వాతంత్య్రం వచ్చాక హవానాలో తన రచనలు కొనసాగించి, పాపులర్ రైటర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈ క్రమంలో ఓ సంపన్న మహిళతో ఆయన ప్రేమలో పడతాడు. అయితే వీరి ప్రేమ బెడిసికొడుతుంది. ఇతను హోమో సెక్స్వాలిటీని ఇష్టపడతాడు. తర్వాత తప్పుడు మార్గంలో ప్రయాణించి జైలు శిక్ష అనుభవిస్తాడు. తదనంతరం ఆయన జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనే ఆసక్తికర కథాంశంతో జూలియన్ స్క్నాబెల్ ఈ చిత్రాన్ని రూపొందించారు. రీనాల్డో పాత్రలో జేవీర్ బార్డెమ్ నటించగా ఇది 2000లో విడుదలై ఆకట్టుకుంది. ఉత్తమ నటుడి విభాగంలో జేవీర్ బార్డెమ్ ఆస్కార్‌కి నామినేట్ అవ్వడం విశేషం.
వీటితోపాటు 'ఫిడెల్', 'మెమరీస్ ఆఫ్ అండర్డెవల్మెంట్', 'బ్లేమ్ ఇట్ ఆన్ ఫిడెల్', 'ది మాంబో కింగ్స్', 'ది లాస్ట్ సిటీ', 'చికో అండ్ రీటా', 'అమోర్ క్రోనికా', 'ఏ సక్సెస్ఫుల్ మ్యాన్', 'లవ్ బై మిస్టేక్', 'ది వెయిటింగ్ లిస్ట్' సినిమాలు గొప్ప క్యూబన్ చిత్రాలుగా నిలిచాయి.
Authorization