స్నేహితుడు లేని మనిషి ఉండంటే అతిశయోక్తి లేదు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ కీలక పాత్ర పోషించే స్నేహం ప్రధానంగా ఎన్నో సినిమాలు రూపొంది విశేష ప్రేక్షకాదరణ పొందాయి. స్వచ్ఛమైన స్నేహానికి సరికొత్త అర్థాన్నిస్తూ తెరకెక్కిన కొన్ని ఫ్రెండ్షిప్ బేస్డ్ సినిమాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
ది పెర్క్స్ ఆఫ్ బీయింగ్ ఏ వాల్ఫ్లవర్
స్నేహం ఓ వ్యక్తిని మార్చిన కథాంశంతో సాగే చిత్రమిది. 1999లో ఇదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా దర్శకుడు స్టెఫెన్ చోస్కీ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఛార్లీ అనే టీనేజ్ కుర్రాడు మానసిక వ్యాధితో బాధపడుతుంటాడు. ఆత్మహత్య వరకు వెళతాడు. ఈ క్రమంలో అతను కొత్త స్కూల్లో జాయిన్ అవుతాడు. అక్కడ సామ్, ప్యాట్రిక్ అనే ఇద్దరు విద్యార్థులు పరిచయం అవుతారు. వాళ్ళిద్దరు నిత్యం ఎనర్జిటిక్‌గా ఉంటూ సందడి చేస్తుంటారు. వారితో తిరిగే క్రమంలో ఛార్లీ కొత్త ప్రపంచాన్ని చూస్తాడు. తనలోని మానసిక వ్యాధి మటుమాయం కావడమే కాదు, హుషారుగానూ మారతాడు. కొత్త అనుభూతులు పొందుతుంటాడు. అనంతరం చోటు చేసుకున్న ఆసక్తికర సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. మంచి వ్యక్తుల స్నేహం ఓ వ్యక్తిని ఎంతగా మార్చిందనే దానికి నిదర్శనంగా నిలిచిందీ చిత్రం. 2012లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. టొరంటో వంటి ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో ఛార్లీగా లోగన్ లెర్మన్, సామ్‌గా ఎమ్మా వాట్సన్, ప్యాట్రిక్గా ఎజ్రా మిల్లర్ అద్భుత నటనతో ఆడియెన్స్‌ని హుషారెత్తించారు.
టెడ్
ఓ వ్యక్తికి టెడ్డీ బేర్‌తో ఉన్న స్నేహబంధాన్ని తెలిపే చిత్రమిది. సెథ్ మ్యాక్ ఫార్లెన్ దీనికి దర్శకత్వం వహించారు. జాన్ బెన్నెట్ ఎనిమిదేండ్ల నుంచి ఒంటరిగా మసాచుసెట్స్‌లో నివసిస్తుంటాడు. క్రిస్మస్ పండుగ సందర్భంగా జంబో అనే టెడ్డీ బేర్ గిఫ్ట్‌గా తన జీవితంలోకి వస్తుంది. అది మాట్లాడుతుంది. అన్ని పనులు చేస్తుంది. దానితో జాన్‌కి మంచి స్నేహం ఏర్పడుతుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలు దానితో షేర్ చేసుకుంటాడు. జాన్‌కి, టెడ్డీల మధ్య స్నేహం మరింత బలపడుతుంది. ఇంతలో జాన్ జీవితంలోకి ప్రియురాలు వస్తుంది. మొదట టెడ్డీని సరదాగా తీసుకున్నా, ఆ తర్వాత జాన్‌కి ఒకానొక టైమ్‌లో చిన్నప్పట్నుంచి తనతో ఉన్న టెడ్డీనా? ప్రియురాలా? అనేది తేల్చుకునే పరిస్థితి వస్తుంది. మరి జాన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది మిగిలిన సినిమా. 2012లో కేవలం 50 మిలియన్ డాలర్లతో ఆద్యంతం కామెడీ ఎంటర్టైనర్గా రూపొంది ఏకంగా 550 మిలియన్ డాలర్లని వసూలు చేసి సంచలనం సృష్టించిందీ చిత్రం. అయితే ఇందులో ప్రముఖ స్టార్ మార్క్ వాల్బెర్గ్ నటించడం విశేషం. ఆయన ప్రియురాలిగా మిలా కునిస్ ఆకట్టుకున్నారు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఇది ఆస్కార్‌కి నామినేట్ అవ్వడం మరో విశేషం.
ప్రాజెక్ట్ ఎక్స్
ముగ్గురు స్నేహితులు చేసే అల్లరి ఎలాంటి పరిణామాలకు దారి తీసిందని తెలిపే చిత్రమిది. డార్క్ టీన్ కామెడీగా రూపొందిన ఈ చిత్రానికి నిమా నౌరిజాదెహ్ దర్శకత్వం వహించారు. థామస్, కోస్టా, జె.బి ముగ్గురు మంచి స్నేహితులు. ఏది చేసినా ముగ్గురు కలిసే చేస్తారు. తమ కంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తారు. థామస్ పుట్టిన రోజు సందర్భంగా తన మిగతా స్నేహితులందరికీ కలిసి ఓ పార్టీ ఇస్తారు. అందులో తమ గుర్తింపు కోసం ఓ ప్లాన్ చేస్తారు. కానీ ఆ ప్లాన్ తమ నియంత్రణ తప్పుతుంది. దీంతో అదెలాంటి పరిణామాలకు దారి తీసింది. ఈ ముగ్గురు స్నేహితులు చేసిన ఆ ప్లాన్ ఏంటీ? చివరికి ఈ ముగ్గురు స్నేహితులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే ఆసక్తికర అంశాలకు ప్రతిబింబం ఈ చిత్రం. ఆద్యంతం కామెడీ ఎంటర్టైనర్గా సాగే ఈ సినిమా 2012లో విడుదలైంది. కేవలం 12 మిలియన్ డాలర్లతో రూపొంది ఏకంగా వంద మిలియన్ డాలర్లని వసూలు చేసింది. ఇందులో థామస్‌గా థామస్ మన్న్, కోస్టాగా ఎలివర్ కూపర్, జె.బిగా జెనాథన్ డానియల్ బ్రౌన్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. వీరి ఇబ్బందులు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి.
ఏ సింపుల్ లైఫ్
రిటైర్మెంట్ వయసున్న ఓ మహిళ తన పాత స్నేహితులతో కలిసి పొందిన అనుభూతిని తెలిపే చిత్రమిది. ఆద్యంతం నాటకీయంగా సాగే ఈ చిత్రానికి అన్న్ హుయి దర్శకత్వం వహించారు. చుంగ్ అనే మహిళా పనిమనిషి హాంకాంగ్‌కి చెందిన మిడిల్ ఏజ్ సినీ నిర్మాత రోగర్తో కలిసి ఉంటూ ఆయనకు అని పనులు చేసి పెడుతుంది. వారిద్దరి మధ్య స్థాయిలకు అతీతంగా మంచి స్నేహం ఏర్పడుతుంది. రోగర్ తన బిజినెస్ ట్రిప్ పనిమీద బయటకు వెళ్ళినప్పుడు చుంగ్ హార్ట్ స్ట్రోక్‌కి గురవుతుంది. దాన్నుంచి కోలుకున్నాక, తన స్నేహితురాలు స్థాపించిన పునరావాస కేంద్రానికి వెళ్తుంది. అక్కడి వారితో తాను కొనసాగించిన స్నేహబంధం ప్రధానంగా ఈ చిత్రం సాగుతుంది. ఆద్యంతం కొత్త తరహా స్నేహానికి కొత్త అర్థాన్ని చెప్పిన ఈ చిత్రం 2011లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇందులో రోగర్గా ఆండీ లాయి, చుంగ్గా డీనీ ఐపీ తమ అద్బుత నటనతో మెప్పించారు. ఇది ఆస్కార్‌కి కూడా నామినేట్ కావడం చెప్పుకోదగ్గ విశేషం.
హౌజ్ ఆఫ్ టోలరెన్స్
సంపన్న వేశ్యల మధ్య స్నేహాన్ని తెలిపే చిత్రమిది. ఈ ఫ్రెంచ్ చిత్రానికి బెట్రాండ్ బోనెల్లో దర్శకత్వం వహించారు. పర్షియన్‌కి చెందిన లగ్జరీ వేశ్యల బృందం అందరు కలిసి ఉంటారు. ప్రారంభంలో వారి మధ్య విభేదాలున్నా తర్వాత కాలంలో మంచి స్నేహం ఏర్పడుతుంది. తమ జీవనం సాగే క్రమంలో వారి ఆశలు, బాధలు, భయాలు, ఆనందాలను షేర్ చేసుకుంటూ ముందుకు సాగడం, ఒకరికొకరు అండగా నిలవడం ప్రధానంగా సాగే ఈ నాటకీయ భరిత చిత్రం 2011లో విడుదలై విశేష ప్రశంసలందుకుంది. ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. అలాగే విమర్శకుల ప్రశంసల్ని సైతం సొంతం చేసుకుంది. కేన్స్‌లోనూ ప్రదర్శితమై మంచి ప్రశంసలందుకుంది. ఇందులో ప్రధాన పాత్రల్లో సెలైన్ సాల్లెట్టె, హఫ్సియా, జాస్మిన్ ట్రిన్కా, అడెల్ హీనెల్, అలైస్ బోన్రోల్ ప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షక హృదయాలను దోచుకున్నారు.
మీ అండ్ ఎర్ల్ అండ్ ది డైయింగ్ గర్ల్
పేరడీలు చేసే వ్యక్తి బలవంతమైన స్నేహాన్ని తెలిపే కామెడీ డ్రామా చిత్రమిది. ఆల్ఫోన్సో గోమేజ్ రెజాన్ దర్శకత్వం వహించారు. 17 ఏండ్ల వయసున్న గ్రెగ్ గెయిన్స్ హైస్కూల్ స్టూడెంట్. ఎక్కువగా సినిమాలు చూస్తూ అందులోని పాత్రలతో పేరడీలు చేస్తుంటాడు. విభిన్న నేపథ్యాలకు చెందిన తోటి విద్యార్థులతో మంచి స్నేహంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి తల్లి కోరిక మేరకు ఓ అమ్మాయితో తప్పనిసరి పరిస్థితుల్లో స్నేహం చేయాల్సి వస్తుంది. అందుకు కారణం ఆమె క్యాన్సర్‌తో బాధపడుతుండటం. మరి ఆ విషయం తెలిసి ఆయన ఎలా స్పందించారు. గ్రెగ్ స్నేహం ఆమెకి ఎలాంటి రిజల్ట్నిచ్చిందనే ఆసక్తికర, భావోద్వేగభరిత అంశాల సమాహారంగా ఈ సినిమా రూపొందింది. 2015లో విడుదలై మంచి ఆదరణతోపాటు ప్రశంసలను అందుకుంది. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శించబడింది. ఇందులో థామస్ పాత్రలో మన్న్ నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది. క్యాన్సర్ బాధితురాలిగా ఒలివియా కూక్ నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
ది హెల్ప్
తెల్లజాతికి చెందిన రచయిత్రికి, నల్లజాతి పని మనుషులకు మధ్య స్నేహాన్ని ప్రతిబింబించే చిత్రమిది. టేట్ టైలర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పీరియడ్ డ్రామాగా రూపొందింది. స్కీటర్ అనే రచయిత్రి తెల్లజాతీయురాలు. జర్నలిస్ట్‌గా రాణిస్తూ భవిష్యత్‌లో పెద్ద రైటర్‌గా ఎదగాలనుకుంటుంది. ఆమె ఉండే సమీపంలో ఇద్దరు నల్లజాతీయులు పనిచేస్తుంటారు. వారితో స్నేహాన్ని ఏర్పర్చుకుంటుంది. వారి మధ్య అనుబంధం బలపడుతుంది. తెల్లజాతీయుల వల్ల నల్లజాతీయులు, ఆ పనిమనుషులు ఎదుర్కొంటున్న వివక్ష, అవమానాలు, దాడుల ప్రధానంగా పుస్తకం రాయడం ప్రారంభిస్తుంది. అలా తెలియకుండా నల్లజాతీయుల జీవితాలను ప్రతిబింబించి, వారిపై జరుగుతున్న వివక్షని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. ఆద్యంతం సంచలన సృష్టించి అదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. 1960నాటి అమెరికా సామాజిక పరిస్థితులకు అద్దం పట్టిన ఈ చిత్రం 2011లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కేవలం 25 మిలియన్ డాలర్లతో రూపొంది ఏకంగా 216 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. రైటర్‌గా ఎమ్మా స్టోన్, నల్లజాతీయులుగా వియోలా డేవిస్, ఓక్టావియా స్పెన్సర్ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇది ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి విభాగాల్లో ఆస్కార్‌కి నామినేటై సహాయ నటిగా ఓక్టావియా స్పెన్సర్ ఆస్కార్‌ని సొంతం చేసుకుంది.
గ్రోన్ అప్
మూడు దశాబ్దాల తర్వాత కలిసిన ఐదుగురు స్నేహితుల జర్నీని తెలిపే ఈ కామెడీ డ్రామా చిత్రానికి డెన్నిస్ డుగన్ దర్శకత్వం వహించారు. లెన్నీ ఫెడర్, ఎరిక్, కర్ట్, మార్కస్, రాబ్ అనే విద్యార్థులు హైస్కూల్ వరకు క్లోజ్ ఫ్రెండ్స్. ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు. అంతేకాదు చాలా చురుకైన వాళ్ళు కూడా. హైస్కూల్లో బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌గానూ నిలుస్తారు. ఆ తర్వాత విడిపోయి ఎవరికివాళ్ళు సెటిల్ అవుతారు. ముప్పై ఏండ్ల తర్వాత తమ కోచ్ చనిపోయినప్పుడు తిరిగి కలుస్తారు. చాలా గ్యాప్‌తో కలిసి చేసిన వీరంతా చేసే సందడి ప్రధానంగా, కాలం మారినా స్నేహం మారదని తెలిపే ఈ చిత్రం 2010లో 80మిలియన్ డాలర్లతో రూపొంది 272 మిలియన్ డాలర్లని వసూలు చేసి భారీ విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్‌గా స్నేహం ప్రధానంగా 'గ్రోన్ అప్స్ 2' రూపొంది పెద్ద విజయం సాధించింది. ఇందులో ఆడమ్ సాండ్లర్, కెవిన్ జేమ్స్, క్రిస్ రాక్, డేవిడ్ స్పేడ్, రాబ్ స్కీడర్ ప్రధాన పాత్రల్లో నటించి తమదైన నటనతో కడుపుబ్బ నవ్వించారు.
ది వే హి లుక్స్
ఓ అంధుడికి, అతని స్నేహితుడికి మధ్య అనుబంధాన్ని తెలిపే చిత్రమిది.
డానియెల్ రిబీరో దర్శకత్వం వహించారు. లియోనార్డో అనే కుర్రాడికి కళ్లు కనిపించవు. అందరితో కలవలేకపోవడంతో ఒంటరిగా ఇబ్బంది పడుతుంటాడు. అతనికి గోవానా అనే విద్యార్థి పరిచయం అవుతాడు.
వీరి స్నేహం బలపడే క్రమంలో అంధుడైన లియోనార్డోని తన వెంట బయటకు తీసుకెళ్ళి అతనికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు గోవానా. చూడలేని స్థితి నుంచి తన మాటలతో ప్రపంచంలోని రంగులను, మనుషులను, ప్రాంతాలను, జీవులను, ప్రకృతిని పరిచయం చేస్తాడు. కళ్లు లేకపోయినా అన్ని అనుభూతులు పొందేలా చేయడం ప్రధానంగా స్వచ్ఛమైన స్నేహాన్ని, ఆ స్నేహంలోని గొప్పతనాన్ని ప్రతిబింబించిందీ చిత్రం. 2014లో విడుదలై కమర్షియల్‌గా ఆకట్టుకోలేక పోయినప్పటికీ క్రిటికల్‌గా విశేష ప్రశంసలందుకుంది. ప్రేక్షక హృదయాలను కదిలించింది. లియోనార్డోగా ఘిల్హెర్మె లోబో, గోవానాగా టెస్ అమోరిమ్ల నటన ఆకట్టుకుంటుంది. వీటితోపాటు ఓ ప్రమాదంలో కాళ్లు పడిపోయిన సంపన్న వ్యక్తికి, అతనికి సేవకుడిగా వచ్చిన అల్లరి చిల్లరగా తిరిగే పేద కుర్రాడి మధ్య స్నేహం ప్రధానంగా ఎమోషనల్ కామెడీ డ్రామాగా 'ది అన్‌టచబుల్స్' చిత్రం రూపొందింది. ఇది తెలుగులో 'ఊపిరి'గా రీమేక్ అయిన విషయం విదితమే. అలాగే రొమాంటిక్ కామెడీగా 'బ్రైడ్స్ మెయిడ్స్', రొమాంటిక్ కామెడీ డ్రామా 'మిస్ యు ఆల్రెడీ', డ్రామా చిత్రం 'యు ఆర్ నాట్ యు', రొమాంటిక్ కామెడీ డ్రామా 'ఫ్లిప్పిడ్', యాక్షన్ అడ్వెంచర్ కామెడీ 'వైల్డ్ ఓట్స్', 'ది అదర్ గార్సు', 'దిహ్యాంగోవర్' చిత్రాలు స్నేహం ప్రధానంగా రూపొంది, స్నేహం గొప్పతనాన్ని, అందులోని అమాయకత్వాన్ని, తోటివారికి సహయపడే లక్షణాలను ప్రతిబింబించి బాక్సాఫీసు వద్ద మంచి విజయాలను అందుకున్నాయి.
Authorization