సవాలక్ష సమస్యలతో సతమతమయ్యే ప్రజలకు కాస్తంత ఊరటనిచ్చే వినోదం సినిమా. రెండున్నర గంటలు ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా భిన్న జోనర్ చిత్రాలతో దర్శక, నిర్మాతలు రకరకాల ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. డిఫరెంట్ జోనర్స్లో తెరకెక్కి
విశేష ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షమూ కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు మెచ్చిన కొన్ని
భిన్న నేపథ్య చిత్రాల గురించి ఈ వారం స్పెషల్ షో..
డివైన్స్
పేదరికంలో జన్మించిన ఓ అమ్మాయి జీవితం డాన్సర్‌తో చేసే స్నేహం వల్ల ఎలాంటి మలుపులు తిరిగిందనే కథాంశంతో ఈ డ్రామా చిత్రం తెరకెక్కగా, హౌడా బెన్యామైనా దర్శకత్వం వహించారు. డౌనియా అనే టీనేజ్ అమ్మాయి తన తల్లి, అత్తయ్యతో కలిసి పారిస్‌లో ఉంటుంది. పేదరికంతో ఇబ్బంది పడుతుంటారు. ఆమె, తన స్నేహితురాలు మియామౌనా డబ్బుల కోసం చిన్న చిన్నదొంగతనాలు చేస్తుంటారు. అంతేకాదు డ్రగ్ డీలర్స్తోనూ సంబంధాలు పెట్టుకుంటారు. ఇంతలో డౌనియాకి ఓ డాన్సర్ పరిచయం అవుతాడు. అతని పరిచయం ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పిందనేది ఆద్యంతం ఆసక్తికరం. ఈ చిత్రం 2016లో విడుదలై మిశ్రమ ఫలితాన్ని రాబట్టుకున్నా, క్రిటికల్‌గా ప్రశంసలందుకుంది. కేన్స్ వంటి పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో డౌనియాగా ఊలయా అమమ్రా నటన ఆద్యంతం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆమె స్నేహితురాలిగా డెబోరా లుకుమూనా నటించారు.
ఫ్రాన్సెస్ హా
ఓ అల్లరి అమ్మాయికి, ఇన్నోసెంట్ అమ్మాయికి మధ్య స్నేహాన్ని తెలిపే చిత్రమిది. బ్లాక్ అండ్ వైట్‌గా సాగే ఈ కామెడీ డ్రామాకి నోవా బౌబాచ్ దర్శకత్వం వహించారు. ఫ్రాన్సెస్ హల్లాడే 27ఏండ్ల విద్యార్థిని. ఆమెకి స్కూల్ టైమ్ నుంచి సోఫియా అనే స్నేహితురాలుంటుంది. సోఫియా ఓ క్రమశిక్షణతో కెరీర్‌ని నిర్మించుకుంటుంది. ఫ్రాన్సెస్కి డాన్స్ అంటే ఇష్టం. కానీ అందులో రాణించలేకపోతుంది. సరిగ్గా డాన్స్ చేయడం కూడా రాకుండా అవమానాలు ఎదుర్కొంటుంటుంది. ఓ డాన్స్ కంపెనీలో అప్రెంటిస్‌గా పనిచేస్తుంటుంది. చైనా టౌన్లో నివసిస్తుంది. కానీ ఇల్లు కూడా ఉండదు. నిత్యం స్ట్రగుల్ పడుతున్నా తన అమాయకత్వంతో జీవితాన్ని ఎంజారు చేస్తుంది. ఈ క్రమంలో ఎప్పటికైనా తన స్నేహితురాలు సోఫియాతోనే ఉండాలనుకుంటుంది. మరి అది సాధ్యమైందా? తన కలని నిజం చేసుకుందా? అనేది ఆసక్తికరం. ఆద్యంత హాస్యభరితంగా సాగే ఈ సినిమా 2012లో విడుదలై మూడు మిలియన్ డాలర్లతో రూపొంది 12 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇందులో ఫ్రాన్సెస్గా గ్రెటా గెర్వింగ్ నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది. సోఫియాగా మైకీ సమ్నర్ నటన సైతం ఆకట్టుకుంది.
మై ఆఫ్టర్నూన్స్ విత్ మార్గరేట్
చదువంటే బద్ధకమైన ఓ వ్యక్తికి, అత్యంత మేధావి అయిన వృద్ధురాలికి మధ్య అసాధారణమైన స్నేహాన్ని తెలిపే చిత్రమిది. ఈ హాస్యభరిత వినోదాత్మక చిత్రానికి జీన్ బేకర్ దర్శకత్వం వహించారు. జెర్మెయిన్ 45ఏండ్ల చదువుకోని వ్యక్తి. తనకు కూతురుంటుంది. రెగ్యులర్ కూలిపనులు చేసుకుంటూ తన స్నేహితులతో సరదాగా జీవితాన్ని గడుపుతుంటాడు. ఓసారి సాయంత్రం సమయంలో పార్క్‌కి వెళ్ళినప్పుడు మార్గరేట్ అనే వృద్ధురాలు కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ తన కంటపడుతుంది. ఆమె పక్కన కూర్చొని మాటా, మాటా కలుపుతాడు. అది స్నేహంగా మారుతుంది. ఆమె చాలా ఎడ్యూకేటెడ్. అతనిలోని అమాయకత్వాన్ని గుర్తించి చదవమని పుస్తకాలివ్వడమే కాదు, అతన్ని పూర్తిగా ఉన్నతంగా మారుస్తుంది. మరి వీరి జర్నీ ఏ తీరం చేరిందనేది ఆద్యంతం భావోద్వేగభరితం. అసాధారణమైన స్నేహ కథతో వచ్చిన ఈ సినిమా 2010లో విడుదలై ఆకట్టుకుంది. ఇందులో జెర్మెయిన్ పాత్రలో గెరార్డ్ డెపార్డియు, మార్గరేట్ పాత్రలో గిసెల్ కాసాడెసస్ల నటన ఆద్యంతం అలరిస్తుంది.
వన్ ఛాన్స్ టు డాన్స్
ఓ అమ్మాయి ప్రేమని, తన డ్రీమ్ అయిన డాన్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేసిందనేది కథాంశంతో రూపొందిన చిత్రం. గ్యాబీ అనే 17ఏండ్ల అమ్మాయి ప్రొఫెషనల్ డాన్సర్ కావాలనుకుంటుంది. అందుకోసం ఈస్ట్ కోస్ట్ హై స్కూల్లో జాయిన్ అవుతుంది. అక్కడ ఆమె డాన్సర్‌గా శిక్షణ తీసుకుంటున్న క్రమంలో తను ఇద్దరబ్బాయిలతో ప్రేమలో పడుతుంది. మరి తన ప్రేమ చివరకు ఫలించిందా?, ప్రొఫెషనల్ రియాలిటీ డాన్సర్ కావాలనుకునే ఆమె కల నెరవేరిందా లేదా అనే ఆసక్తికర అంశాల సమాహారంగా ఈ చిత్రం రూపొందింది. ఆడమ్ డేయోయి దీనికి దర్శకత్వం వహించగా, 2014లో విడుదలైన సినిమా విశేషంగా ఆకట్టుకుంది. గ్యాబీ పాత్రలో లెక్సీ గియోవగ్నోలి విభిన్న భావోద్వేగాలను పలికిస్తూ తనదైన నటనతో మెస్మరైజ్ చేశారు.
మేక్ యువర్ మూవ్
డాన్సర్ కావాలనుకునే కుర్రాడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం నేపథ్యంలో రూపొందే చిత్రమిది. డాన్నీస్ అనే కుర్రాడు డాన్స్‌ని ఇష్టపడుతుంటాడు. ఎంతో ప్యాషన్‌గా డాన్స్ క్లబ్లో, స్ట్రీట్ డాన్సర్‌గా ఆకట్టుకుంటుంటాడు. ఇంతలో అతను అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. పేరోల్‌పై బయటకు వచ్చి డాన్స్ చేస్తుంటాడు. కానీ పేరోలో అధికారులు అడ్డు చెబుతుంటారు. మరి తన డాన్స్ కలని నెరవేర్చుకున్నాడా? అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే కథాంశంతో సాగే సౌత్ కొరియన్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా చిత్రమిది. 'రోమియో అండ్ జూలియెట్' చిత్రం ఆధారంగా దర్శకుడు డ్వానె అడ్లర్ దీన్ని రూపొందించారు. 2013లో సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. డాన్నీ పాత్రలో డెరెక్ హఫ్ నటన కట్టిపడేస్తుంది.
హోప్ డాన్స్
బ్యాలెట్ డాన్సర్‌గా రాణించాలనుకునే ఓ మల్టీటాలెంటెడ్ టీనేజ్ అమ్మాయి జీవితంలోని మలుపులను తెలిపే చిత్రమిది. హోప్ డగ్లస్ అనే టీనేజ్ అమ్మాయికి బ్యాలెట్ డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనేది డ్రీమ్. అందుకు తల్లి సపోర్ట్ చేస్తుంది. గొప్ప డాన్సర్‌గా చూడాలనుకుంటుంది. కానీ తండ్రి ఆమెని క్రీడాకారిణిగా చూడాలనుకుంటాడు. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది. తన కలని నిజం చేసుకుందా లేక తండ్రి కలని నిజం చేసిందా? అనేది సినిమా. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ డాన్స్ ప్రధాన భావోద్వేగభరిత చిత్రానికి ఆండ్య్రూ డిల్లన్ దర్శకత్వం వహించారు. హోప్ పాత్రలో అవరోస్ డిల్లన్ నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది. తండ్రిగా మైకేల్ స్వాన్, తల్లిగా సన్నీ డోంచ్ నటించారు. 2017లో సినిమా విడుదలై మంచి విజయం సాధించడంతోపాటు అనేక పురస్కారాలను సొంతం చేసుకుంది.
మెమరీస్ ఆఫ్ అండర్డెవల్మెంట్
సెర్గియో అనే సంపన్న బూర్జువా రచయిత క్యూబాలో నివాసం ఉండాలని నిర్ణయించుకుంటాడు. తన భార్య, ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడికి వెళతాడు. క్యూబన్ తిరుగుబాటు నుంచి, మిస్సైల్ క్రైసిస్ వరకు అక్కడ వచ్చిన మార్పులను గమనిస్తూ అక్కడ నివాసం ఉండేందుకు ఇబ్బందులు పడుతుంటాడు. ఆ సమయంలో పరిచయం అయిన ఎలెనా, హన్నాలతో రిలేషన్ ఎలా ఉంది, అది తన వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందనేది సినిమా. క్యూబన్ తిరుగుబాటులోని వాస్తవాలను, అక్కడి జీవనాన్ని తెలిపే ఈ డ్రామా చిత్రానికి థామస్ గుటీర్రెజ్ అలియా దర్శకత్వం వహించారు. సెర్గియో పాత్రలో సెర్గియో కొర్రీరి, ఎలెనాగా డైసీ గ్రానడోస్ ఆకట్టుకున్నారు. 1968లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లోనే భారీ విజయాన్ని, ప్రశంసలను అందుకుంది.
ది రోడ్
మనుగడ కోసం చేసే పోరాటంలో తండ్రీ కొడుకుల స్ట్రగుల్‌ని తెలిపే చిత్రమిది. ప్రకృతి విపత్తు వల్ల వాళ్లుండే ప్రాంతం మొత్తం సర్వనాశనమవుతుంది. తండ్రి, కొడుకులు జీవనం కోసం రోడ్డుపై ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో అనేక అడ్డుంకులు ఎదురవుతుంటాయి. వాటన్నింటిని ఎదుర్కొని మనుషుల జీవనానికి అనుకూలమైన ప్రాంతానికి చేరేందుకు వాళ్లు పడ్డ ఇబ్బందులు, చేసిన పోరాటం నేపథ్యంలో రూపొందిన చిత్రమే 'ది రోడ్'. ప్రేమ, మనుగడ, ఆశ, తెగింపు, స్ట్రగుల్ అంశాల మేళవింపుతో తండ్రీకొడుకుల మధ్య అనుబంధం తెలిపే ఈ చిత్రానికి జాన్ హిల్కోట్ దర్శకత్వం వహించారు. 2009లో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకోవడంతోపాటు భారీ విజయాన్ని సాధించింది. తండ్రీతనయులుగా విగ్గో మార్టిన్సెన్, కోడి స్మిట్ మెక్ ఫీ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు.
ది జడ్జ్
ఓ కేసులో ఇరుక్కున నాన్నని దాన్నుంచి బయట పడేసేందుకు కుమారుడు చేసే న్యాయ పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. చికాగోలో పెద్ద పేరుమోసిన డిఫెన్స్ అటార్నీ లాయర్‌గా హ్యాంక్ పాల్మర్ తల్లి హఠాన్మరణంతో సొంత ఊరుకి వస్తారు. ఆ దు:ఖ సమయంలో స్థానిక జడ్జ్‌గా ఉన్న తండ్రి జోసెఫ్ పాల్మర్పై ఓ హత్యకేసు ఆరోపణలు వస్తాయి. దీంతో జాబ్ పోతుంది. దీంతో హ్యాంక్ ఈ కేసులోని అసలు నిజాలను కనిపెట్టి తండ్రిని ఎలా నిర్ధోషిగా నిలబెట్టాడు, ఈ క్రమంలో వారి మధ్య ఏర్పడ గొప్ప అనుబంధాన్ని తెలిపే చిత్రమిది. తండ్రీతనయుల మధ్య భావోద్వేగభరిత సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆద్యంతం నాటకీయంగా సాగే ఈ చిత్రానికి దర్శకుడు డేవిడ్ డాబ్కిన్ దర్శకత్వం వహించారు. ఇందులో హ్యాంక్ పాత్రలో స్టార్ హీరో రాబర్ట్ డౌనీ జూనియర్ నటన ఆకట్టుకుంటుంది. అతని తండ్రి పాత్రలో రాబర్ట్ డువాల్ నటించారు. సినిమా 2014లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పలు అవార్డులను అందుకుంది.
బ్రాడ్స్ స్టేటస్
ఓ తండ్రిని మార్చే కొడుకు కథతో రూపొందిన చిత్రమిది. బ్రాడ్ స్లోవాన్ తన భార్య మెలానీతో, కుమారుడు ట్రారుతో కలిసి ప్రేమతో కూడిన జీవనాన్ని గడుపుతుంటాడు. తాను ఓ స్వచ్ఛంద సంస్థని రన్ చేస్తుంటాడు. అయినప్పటికీ ఇతరులకు సాయం చేయలేకపోతుంటాడు. తన స్నేహితులు మంచి సంపన్నులుగా ఉంటారు. వారిని పోల్చుకుంటూ బ్రాడ్ దిగులు చెందుతుంటాడు. మరి ఆయన ఆలోచనని కాలేజ్‌లో చదివే తనయుడు ఎలా మార్చాడనే కథాంశంతో, తండ్రీ తనయుల మధ్య గొప్ప పరిణతి చెందిన అనుబంధాన్ని తెలిపేలా ఈ చిత్రం రూపొందింది. మైక్ వైట్ దీనికి దర్శకత్వం వహించారు. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 2017లో విడుదలైన ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో బ్రాడ్‌గా బెన్ స్టిల్లర్, తనయుడు ట్రారుగా ఆస్టిన్ అబ్రామ్స్ల నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది.
Authorization