Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన ఆలోచనల కనుగుణంగానే జీవితం సాగుతుంది.ఈ విశాల ప్రపంచంలో ఎలా జీవించాలనే ముఖ్యమైన విషయం మన చేతుల్లోనే ఉంది. ఒక మనిషి ఆలోచనల కనుగుణంగానే ఆయన లేదా ఆమె బతుకు రూపు దిద్దుకుంటుంది.మానవ జీవితంలో కంప్యూటర్లు ఒక ముఖ్యభాగమై పోయాయి. మనం రకరకాల స్విచ్‌లను నొక్కితే చాలు నెలల తరబడి కష్టపడి పరిష్కరించవలసిన సమస్యలను అవి కొద్ది సమయంలో పరిష్కరిస్తాయి. అవసరమైన సమాచారాన్ని వాటికి అందిస్తాం. మనకు కావలసిన సమాచారాన్ని పొందగలుగుతాం. ఈ విధానాన్నే మన జీవితానికి అన్వయించవచ్చని 'లుమ్ సెన్' అనే మానసిక శాస్త్ర వేత్త పేర్కొన్నారు. మన మెదడు ఆదునిక కంప్యూటర్. మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించు కునేందుకు మన మెదడు సహకరిస్తుంది. జీవితంలో క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటు న్నపుడు అది మనకు తోడుగా ఉండి, తగిన సూచనలు చేస్తూ ముందుకు నడిపిస్తుంది. మనం ఉత్సాహంగా ఉండడానికైనా, నిరుత్సాహంగా జీవితం గడప డానికైనా మన మెదడే కారణం. అందువల్ల మన శరీరంలో మెదడు ఒక ముఖ్యమైన భాగం. కరోనా వైరస్ వ్యాప్తితో మానవ జీవితం ప్రస్తుతం అతలం కుతలం అయిపోయింది. ఇంతటి క్లిష్ట సమయంలోనూ కోట్లాది మంది ప్రజలు మనో ధైర్యంతో కోవిడ్-19ను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇంకా ఎదుర్కొంటు న్నారు. విలువైన ప్రాణా లను భవిష్యత్తు మీద ఆశతో కాపాడు కుంటున్నారు. 2020 సంవత్సరం మార్చి 22న ప్రారంభమైన లాక్డౌన్ కొన్ని సడలింపులతో కొనసాగుతున్నది. స్వేచ్ఛగా జీవించాల్సిన మనిషి ఇంటికే పరిమితమయ్యాడు. ఇంకా ఎంత కాలం ఇలా జీవించాలి? అనే సమస్య కోట్లాది మందికి ఎదురవుతున్నది. క్లిష్ట పరిస్థితిని ఓపికతో అధిగమించాలి. పరిస్థితుల కనుగుణంగా మన జీవన విధానాన్ని మార్చుకోవాలి.
మిత్రమా.. మనుగడ కోసం ప్రతి మనిషి పోరాడక తప్పదు. ఉదాహరణకు అడవిలో పులి ఏ జంతువును సంహరిస్తుందో ఆ ప్రాణులకు తెలియదు. అలా అని ఆ జంతువులు అడవిని వదిలి దూరంగా పోలేవు. పులితో సహజీవనం చేయక తప్పదు. మనందరి పరిస్థితి ప్రస్తుతం ఇలాంటిదే. కోవిడ్-19 నివారణ వ్యాక్సీన్ వచ్చే వరకు కరోనా బారిన పడకుండా తప్పించుకు తిరగాలి. అలక్ష్యాన్ని వీడాలి. మాస్కులు ధరించాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. ప్రాణాలు నిలుపు కోవాలి. ఆశావాదంతో జీవించాలి. మన జీవితంలో కష్టాలు నష్టాలు కన్నీళ్లు సాధారణమేననే విషయాన్ని గుర్తించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళనకు గురికాని వారు ఎవరూ లేరు. ప్రతి నిత్యం ఏదో ఒక దుర్వార్తను వినవలసి వస్తున్నది. స్నేహితులకు ఫోన్లు చేస్తే తాము ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ఆందోళనకు గురవుతున్నామనే విషయాన్ని చెబు తున్నారు. మరికొంత మంది ధైర్యాన్ని కూడగట్టు కుని జీవిస్తున్నామని పేర్కొంటున్నారు. మీరు ఎలాంటి క్లిష్టపరిస్థితులనైనా ఎదుర్కొంటామనే సంకేతాలను మెదడు కు ఇవ్వండి. ఈ సంక్షోభాన్ని అధిగమి స్తామనే భరోసా ఇవ్వండి. వెంటనే మీ మెదడు మీ ఆదేశాలకు అనుగుణంగా ప్రోగ్రాం చేసుకుంటుంది. ఆ సమయంలో ఈ ప్రపంచం మీకు ఎంతో ఆనందంగా కనిపిస్తుంది. అంతేకాదు మీరెంతో ప్రశాంతతకు లోనవుతారు.
ఇతరుల పట్ల ప్రేమాభినాలను వ్యక్తపరచాలని, మంచి మనసుతో మాట్లాడాలని నిర్ణయించుకొండి. మీకు మానసిక ఉల్లాసం లభిస్తుంది. ఆ ఉల్లాసమే మిమ్మల్ని ముందుకు నడిపి స్తుంది. ఏ నిరాశ వాదం మీ దరిచేరదు. గతంలో మీరు చాలా నిరాశా పూరితమైన ఆలోచనలను ఆదరించి ఉంటారు. ప్రస్తుతం అందుకు భిన్నమైన ఆలోచనలకు పదును పెట్టండి. సాధించలేమని భయపడుతున్న వాటి స్థానే సాధించగలమన్న ఆలోచనలను ప్రవేశ పెట్టండి. మీరేం ఆలోచించాలనే విషయాన్ని ఈ ప్రపంచంలో ఎవరూ నిర్ణయించలేరు. మీకై మీరే నిర్ణయించుకోవాలి. అయితే మీ ఆలోచనల కనుగుణం గానే మీ జీవితం రూపుదిద్దుకుంటుందనే విషయాన్ని గుర్తిం చాలి. మీరు ఏ సమస్యనైనా అధిగ మించాలని నిర్ణయించు కున్నప్పుడు ఆ సమస్య పరిష్కారానికి మీలో మీరు ఊహించ నటువంటి ప్రతిభా సామర్థ్యాలు వ్యక్తమవుతాయి. ఆ సమస్యపై పూర్తి విజయం సాధించిన తరువాత మీలో వ్యక్తమయ్యే ఉల్లాసం అనుహ్యమైంది. ఎల్లప్పుడు అసౌఖ్యంగా, బాధల్లో మునిగి తేలే వ్యక్తులందరూ ఒక విషయాన్ని గుర్తించాలి. నిరంతరం మన మనసును మన అధీనంలో ఉంచుకోవాలి. అందులోకి సానుకూల ఆలోచనలను మాత్రమే ప్రవేశ పెట్టాలి. వ్యతిరేక ఆలోచనలను డిలీట్ చేయాలి. జీవితంలో వైఫల్యం చెందవద్దని, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని, వాటిని అధిగ మించాలని మీరు నిర్ణయించుకుంటే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ఈ ప్రపంచంలో ఏ శక్తి మీ నమ్మకాన్ని వమ్ము చేయజాలదు.ఇది నిజం. ముమ్మాటికీ ఇది వాస్తవం.
- జి గంగాధర్ సిర్ప,
8919668843