Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బురఖాలో హీరోయిన్
సినీ తారలకు పేరు, పలుకుబడి ఉంటాయి. ఐతే, సామాన్య పౌరులకు ఉండే స్వేచ్ఛ వాళ్లకు ఉండదు. వాళ్లు తక్కిన పౌరుల్లా షాపింగ్‌కు, సినిమాలకు, షికార్లకూ వెళ్లలేరు. ఒక వేళ సరదా పడి వెళ్లినా, సినిమా అభిమానులు గుర్తు పట్టి, గుమిగూడి నానా హంగామా చేస్తారు. 'సెక్యూరిటీ' సమస్యలు ఎదురవుతాయి. ఐతే, ఒకసారి ప్రముఖ నటి వాణిశ్రీ ఓ ఉపాయం ఆలోచించి, జనం మధ్యకు వచ్చి- సురక్షితంగా తను అనుకున్నది సాధించారు.
ఆమెకు చాలా కాలంగా హైదరాబాద్‌లో ఉన్న సాలార్జంగ్ మ్యూజియం చూడాలని కోరిక. అప్పట్లో- సారథి స్టూడియోలో 'దసరా బుల్లోడు' షూటింగ్లో పాల్గొనడానికి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు. ఒక రోజు ఏదో కారణం వల్ల షూటింగ్ రద్దయింది. ఆ రోజు ఎలాగైనా సాలార్జంగ్ మ్యూజియం చూడాలని ఓ ఉపాయం ఆలోచించారు. ఓ ముస్లిం యువతిలా తన డ్రెస్‌పై నల్లని బురఖా దుస్తులు వేసుకున్నారు. ముఖాన్ని కూడా ఆ బురఖాతో కవర్ చేసుకున్నారు. కళ్ల దగ్గర ఎలాగూ ఖాళీ ఉంటుంది కాబట్టి తను అన్నీ చూడొచ్చు కాని తనను ఎవరూ గుర్తు పట్టలేరు. ఆ ఐడియా ఫలించింది. వాణిశ్రీ ఆ రోజు తను అనుకున్నట్లుగానే అందరితో పాటు కలిసి మెలిసి తిరుగుతూ మ్యూజియం అంతా చూసి ఆనందంతో సంబరపడిపోయారు. సినీ తారలన్నాక అలాంటి తిప్పలు తప్పవుమరి!