Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కడ్నించి వచ్చాడో వచ్చాడు ఓ మనిషి. ఎక్కడ్నించి వచ్చాడో వచ్చిన ఆ మనిషి కమలాపండు రంగులో వచ్చి బత్తాయిపండు రంగులోకి మారుతున్న ఆకాశంలోకి చూస్తూ ఆ వెలుతురు కింద ఒళ్ళు విరుచుకుంటున్న ఆమెను చూశాడు.
ఎక్కడ్నించి వచ్చాడో వచ్చిన ఆ మనిషి ఆకుపచ్చని చీర కట్టుకొని వున్న ఆమెను చూస్తూ అలా నిలబడిపోయేడు కొండపల్లి బొమ్మలాగా. ఎవరు నువ్వు? ఏం కావాలి అని మరో మనిషి అడిగేదాక.
ఎవరు నువ్వు? ఏం కావాలి అని మరో మనిషి అడిగాక కదిలిన కొండపల్లి బొమ్మ పెదవి విప్పింది.
నేనూ మనిషినే నీలాగ. కనిపించినంత మేర ఆకుపచ్చ దనం చూసి నిలబడిపోయానిలాగ కొయ్యలాగ అన్నాడు ఎక్కడ్నించి వచ్చాడో వచ్చిన ఆ మనిషి.
'ఎవరు నువ్వు? ఏం కావాలి?' అని అడిగిన మరో మనిషి ఓహో ఆకుపచ్చ రంగు చీరకట్టుకున్న మా అమ్మని చూసి కొయ్యలా నిలబడిపోయావా. నేను ఆమె కొడుకుని. భూమి పుత్రుణ్ణి. చూడు రాత్రనకా పగలకా, చెమటోడ్చి ఆమెకు బహు మతిగా అందించిన ఆకుపచ్చ రంగు చీర అది. చూడు చూడు రంగురంగుల పూలు చూడు. ఆకాశంలో ఎదిగి రకరకాల పండ్లు వేలాడుతున్న చెట్లు చూడు. మనిషంత ఎత్తు ఎదిగి గాలికి తలలూపుతున్న జొన్న కంకులు చూడు. అరచేయి తగలగానే పులకించే రకరకాల ధాన్యపు గింజలు చూడు. ఇవన్నీ నేను అమ్మ కోసం కష్టపడితే ఆ నేలమ్మ నా కోసం యిస్తున్న 'రిటర్న్ గిఫ్ట్స్' అన్నాడు.
ఎక్కడ్నించి వచ్చాడో ఆ మనిషి నిండు కుండలాంటి చెరువునూ పెద్ద అండలాంటి కొండనూ చూసి సంబరపడి వెళ్ళిపోయేడు.
ఎక్కడ్నించి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయిన ఆ మనిషి ఎందుకో మళ్ళీ వచ్చాడు ఆకుపచ్చ రంగు చీరలో ఉన్న నేలమ్మని చూద్దామని. జలకళతో నిండుకుండలా ఉన్న చెరువుని, రోజూ సూర్యుణ్ణి పైకి తెచ్చి సాయంత్రాలు దాచిపెట్టే కొండని మరొక్కసారి మళ్ళీ తనివితీరా చూసుకుందామని.
కానీ ఎంత వెదికినా ఆకుపచ్చని చీర కట్టుకున్న నేలమ్మ కనిపించలేదు. ఏమైంది? ఎక్కడికి వెళ్ళి పోయింది అని విచారిస్తూ నిలబడ్డాడు ఎక్కడ్నించి వచ్చాడో వచ్చిన ఆ మనిషి ఇదివరకులాగే ఓ చోట కొయ్యబొమ్మలా నిలబడి పోయాడు.
ఎదురుగ్గా రంగు వెలసిన నేలముళ్ళూ నేల జెముళ్ళూ మొలిచిన నేల పల్లేరు కాయలు పరుచుకున్న నేల పిచ్చి మొక్కలు మొలిచి దీనంగా వున్న నేలని చూస్తూ ఎవరు నువ్వు? ఏం కావాలి? అని అడిగాడో మనిషి. కానీ ఈ మనిషి ఆ భూమి పుత్రుడు కానేకాదు.
ఏం లేదు. ఊరికే నిలబడ్డానన్నాడు ఎక్కడ్నించో అక్కడికి వచ్చిన మనిషి.
'నడువు నడువు. కాస్సేపట్లో జె.సి.బి లు వస్తయి, లారీలు వస్తయి, పని వాళ్ళు వస్తారు, ఇది మా కొత్త వెంచర్ ప్లాట్లు చేసి అమ్ముతాం' అన్నాడు భూమి పుత్రుడు కాని మనిషి. తను ఆ నేలకు యజమానినంటూ మీసం దువ్వాడు.
'మరి ఆ భూమి పుత్రుడు?' అని నసిగాడు అక్కడ భూమి పుత్రుణ్ణి చూసిన మనిషి.
'వాడా? పట్నంలో గంజిలో లారీల్లోకి బస్తాలు మోస్తూ ఉండి ఉంటాడు పోపో' అనరిచాడు నేలకు యజమానినని చెప్పుకున్నవాడు.
ఎక్కడ్నించో అక్కడికి వచ్చిన మనిషి ఉసూరుమని వెళ్తూ చెరువుని చూద్దామనుకున్నాడు. అక్కడ నీటి చుక్క లేదు. చెరువు నేలయింది. నేల మీద ఎవరో రాళ్ళు పాతారు. ప్లాట్లు అమ్మబడును అన్న బోర్డు వేలాడ్తున్నది.
నిట్టూరుస్తూ వెళ్ళిపోతున్న ఆ మనిషికి కొండ కూడా కనిపించలేదు. అదే నేలలోకి వెళ్ళిపోయిందో నేలే దాన్ని మింగేసిందో కాని కరెంటు స్తంభాలు మొల్చుకొచ్చేయి. మట్టి రోడ్ల మీద రంగు రంగుల జండాలు మొల్చుకొచ్చాయి.
మెళ్ళో కండువా ఖరీదైన పట్టుచొక్కా వేళ్ళకు ఉంగరాలూ మెళ్ళో పట్టాల్లాంటి బంగారు గొలుసులూ వేళ్ళాడుతున్న మనిషి ఆ మనిషి చుట్టూ మనుషులూ కనిపించి చెట్టుచాటున నక్కాడు ఎక్కడ్నుంచో అక్కడికి వచ్చిన మనిషి.
చెరువును మాయం చేశామని కొండను మింగేశామని పొలాలు పోరంబోకు స్థలాలు చేసేశామని మనవన్నీ అక్రమ వెంచర్లు అని ఎవ్వరూ భయపడవద్దు అన్నాడు వేళ్ళకు ఉంగ రాలు ఉన్నా ఉంగరాల జుట్టు లేని బట్టతల వాడు.
అసలిక్కడ కొండా లేదు. అక్కడ చెరువూ లేదు. పొలమూ పుట్రాలేదు అని బిగ్గరగా నవ్వాడు మరో మనిషి 'లే అవుట్' చూస్తూ.
ఎల్.ఆర్.ఎస్.. ఎల్.ఆర్.ఎస్ అని అరుస్తూ చప్పట్లు కొట్టారు అక్కడున్న వాళ్ళందరూ.
- చింతపట్ల సుదర్శన్,
9299809212