Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సృష్టిలో తీయనిది స్నేహమేనోయి' అన్నాడు ఓ మహాకవి. ఎందరో మహనీయులు, మహాకవులు స్నేహం గొప్పతనాన్ని గూర్చి తమ కవితల్లో, అమూల్యమైన మాటల్లో చాటి చెప్పారు. ఎప్పటికి తరిగిపోని మూలధనమది. అలాంటి స్నేహం విలువను తెలిపే సినిమాలు, సినిమా పాటలు మన తెలుగులో ఎన్నో ఉన్నాయి. 'హ్యాపీడేస్' (2007) సినిమాలోని వనమాలి రాసిన 'పాదమెటుపోతున్నా పయనమెందాకైనా' అనే స్నేహగీతం ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. తీయని జ్ఞాపకాల మూటలా, స్నేహ పరిమళంలా ఈ పాట ప్రతి ఒక్కరి గుండెలో నిలిచిపోయేలా రాశాడు వనమాలి.
మన సంతోషాన్నే కాదు కష్టాన్ని కూడా పంచుకునేవాడు స్నేహితుడు. మనం ఎంత దూరం నడవగలుగుతామో, ఎన్ని మైళ్ళు ప్రయాణం చేయగలుగుతామో అంత దూరం స్నేహితుడు మన వెంట వస్తాడు. జీవిత ప్రయాణంలోనూ అంతే. అడుగు తడబడిన ప్రతీసారి చేయూతనిస్తూ, అలసట వచ్చినప్పుడల్లా ఆత్మబలాన్ని అందిస్తూ, ఒంటరి తనంలోనైనా, ఓటమిలోనైనా వెంట నీడలా ఉంటాడు. కన్నీళ్ళు తుడిచి ఆదుకుంటాడు. కాసేపు మనం కనబడకపోతే చాలు అల్లాడిపోతాడు. నమ్మకానికి ప్రతిరూపంలా నిలబడతాడు.
మనం అమ్మానాన్నలకు కూడా చెప్పుకోలేని విషయాలను స్నేహితులతో చెప్పుకుంటాం. అంటే అమ్మ ఒడిలో లేని బంధమై మనల్ని అల్లుకునేది స్నేహమే. బతుకంతా తీరిపోని ప్రేమల్ని పంచేది స్నేహమే. అలాంటి నిస్వార్థమైన స్నేహితుల జీవితాల్ని ఈ పాటలో ప్రతిఫలింపజేశాడు వనమాలి. ఈ పాటే కాదు ఈ సినిమాయే స్నేహితుల కథతో రూపుదిద్దుకోవడం ఇక్కడ విశేషం.
కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులు వాళ్ళు.రకరకాల మనస్తత్వాలు వారివి. స్నేహాన్ని పంచుకుంటూ, ఒక్కచోట చేరి కష్టసుఖాలు చెప్పుకుంటూ, అన్ని విషయాలు ఒకరినొకరు పంచుకుంటూ ఉంటారు. మొదట్లో మీరు మీరు అనుకున్న స్నేహం రానూ రానూ ఏరా ఏరా అంటూ ఏకమైంది. మోమాటాలు లేకుండా కలిసి ప్రయాణం చేసింది.
వానవస్తే చాలు కాగితాలతో పడవలను చేసి నీళ్ళల్లో వదిలేసే జ్ఞాపకాలన్నీ స్నేహంలోని భాగమే. చిన్నతనంలోనే కాదు పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఒక్కోసారి స్నేహితులు కలిస్తే చిన్ననాటి అల్లర్లన్నీ గుర్తుకువచ్చి, వాళ్ళ పెద్ద వయసును మరిచి మళ్ళీ బాల్యంలోకి తొంగి చూసి మళ్ళీ అవే అల్లరి పనుల్లో, ఆటపాటల్లో మునిగిపోయేలా చేసేది స్నేహమే. స్నేహానికి వయసుతో పనిలేదు. మనసుంటే చాలు. అది మొదలైనా, చివరైనా వీడని బంధంలా ముడిపడి నడిపించేది స్నేహమే అంటున్నాడు వనమాలి.
స్వచ్ఛమైన, నిర్మలమైన స్నేహాన్ని గూర్చి ఈ పాటలో గొప్పగా వివరించాడు వనమాలి. స్నేహం విలువను, నిజమైన స్నేహితుల మనస్తత్వాలను అద్భుతంగా వివరించిన పాట ఇది..
పాట :పాదమెటు పోతున్నా.. పయనమెందాకైనా..
అడుగు తడబడుతున్నా.. తోడురానా..
చిన్ని ఎడబాటైనా.. కంటతడి పెడుతున్నా..
గుండె ప్రతి లయలోనా.. నేను లేనా..
ఒంటరైనా ఓటమైనా
వెంటనడిచే నీడవేనా
ఓ మై ఫ్రెండ్
తడి కన్నులనే తుడిచిన నేస్తమా
ఓ మై ఫ్రెండ్
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా..
అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుందీ
జన్మకంతా తీరిపోనీ మమతలెన్నో పంచుతోందీ
మీరు మీరు నుంచీ మన స్నేహగీతం
ఏరా ఏరాల్లోకీ మారే
మోమాటాలే లేనీ కలే జాలువారే
ఒంటరైనా ఓటమైనా.. వెంటనడిచే నీడ నీవే..
ఓ మై ఫ్రెండ్
తడి కన్నులనే తుడిచిన నేస్తమా
ఓ మై ఫ్రెండ్
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా..
వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాల
నిన్నుచూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే
గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకొంటూ
తుళ్ళింతల్లో తేలే స్నేహం
మొదలో తుదలో తెలిపే
ముడి వీడకుందే
ఒంటరైనా ఓటమైనా.. వెంటనడిచే నీడ నీదే..
ఓ మై ఫ్రెండ్
తడి కన్నులనే తుడిచిన నేస్తమా
ఓ మై ఫ్రెండ్
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా..
- తిరునగరి శరత్ చంద్ర,
6309873682