Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక అయిడియా జీవితాన్నే మార్చేస్తుందేమో కాని ఒక కరోనా జీవితాల్నే కూల్చేసింది అనుకుంటూ గేటు దాటబోయేడు నారాయణ.
లాక్డౌన్ వల్ల ఉపాథి పోయి రోడ్డున పడ్డ ప్రైవేట్ స్కూల్ టీచర్ ముఖంలోని దైన్యం కనిపిస్తున్నది ఆకాశంలో.
స్వంత ఊరికి బయలుదేరిన వలస కూలి మార్గమధ్యంలో కుప్పకూలిపోతే పక్కనే దిక్కుతోచకుండా రోదిస్తున్న భార్య ఏడుపులా శబ్దం చేస్తున్నది గాలి.
ఆకాశాన్నీ వెన్నులో చలి పుట్టిస్తున్న గాలినీ చూసి ఒక వేళ వర్షం గనక వస్తే ఏ మురిక్కాలవలోనో కొట్టుకుపోతానని భయపడ్డాడు నారాయణ.
ఏం చెయ్యాలా అని బుర్రని వెదుక్కుంటుంటే వచ్చారు వాళ్ళిద్దరు.
వాళ్ళల్లో ఒకడు సార్ అని అరిచాడు.
ఆ అరుపుకు ఝడుసుకున్నాడు నారాయణ. ఏమిటో లాక్డౌన్కు ముందు చప్పట్లు కొట్టిన్నాటి నుంచీ పట్టుకుంది ఈ భయం. ఏది తిన్నా భయమే. ఏది ముట్టుకున్నా భయమే. ఏది విన్నా భయమే అనుకున్నాడు మనసులోనే.
'సార్! మీరు కొన్ని వివరాలు చెప్తే రాసుకోవడానికి వచ్చాం' అన్నాడు ఇద్దరిలో ఒక్కడు మాస్కుని ముక్కు కిందకి లాగిపట్టి.
'సర్వే! ఇంటింటి సర్వేనా' అన్నాడు నారాయణ వాళ్ళని గేటు లోపల్కి రానిచ్చి.
'ఇంటింటి సర్వే కాదు సార్ వంటింటి సర్వే' అన్నాడు ఇద్దరిలో ఒక్కడు బట్టతల ఉన్నవాడు.
'వంటింటి సర్వేనా అదేం సర్వే?' అన్నాడు నారాయణ వాళ్ళకి కొంచెం దూరంగా నిలడబి మాస్కుతో ముక్కు కప్పుకుని.
'అవును సార్! ఇప్పుడు సీజనే అది సర్వేల సీజన్. భూముల సర్వే, ఇళ్ళ సర్వే, బంగారం సర్వే, సర్వే సర్వే సర్వే' అన్నాడు ఇద్దరిలో ఒకడు బట్టతల కాకుండా బుట్టితల ఉన్నవాడు.
'ఈ కరోనా సీజన్లో జనం చస్తుంటే సర్వేల గోలేంటి, సమ యం, సందర్భం లేదా'అన్నాడు నారాయణ కోపం తెచ్చుకుని.
'తప్పదు సార్! రాజు తల్చుకుంటే సర్వేలకు కొదవా' అన్నారు. కరోనా ఏమో కాని ఖజానా ఖాళీగా వుంది కదా. అందువల్ల ఏదో ఒకటి చేసి నాలుగు రాళ్ళు సంపాదించాలి కదా' అన్నాడు ఒకడు.
'అదేం లేదు సార్. అక్రమాలన్నిటినీ క్రమం చేస్తే ఒక అంతా సక్రమమే కదా. సక్రమం కోసమే యిదంతా. మనది పారదర్శక ప్రభుత్వం సార్' అని సవరించాడు మరొకవాడు.
'ఇంతకీ ఈ వంటింటి సర్వే దేనికి?' అన్నాడు నారాయణ ప్రహరీ గోడకి తల బాదుకోవాలా అనుకుంటూ..
'వెరీ సింపుల్ సార్.. మీ వంటింట్లోఎన్ని గిన్నెలు ఎన్ని పళ్ళేలు ఎన్ని గరిటెలు ఎన్నిస్పూన్లు ఎన్ని గ్లాసులు ఉన్నాయో లెక్క రాసుకుంటాం' అన్నాడు బట్టతల.
'ఎందుకు?' అన్నాడు నారాయణ ముఖంలో వెర్రి కళ తాండవిస్తుంటే.
'అదంతా కాలిక్యులేషన్ సార్. ఒక కుటుంబంలో ఎంత మంది ఉన్నారు అన్నది అసలు పాయింటు.అంత మందికి సరిపడే వాటికంటే ఎక్కువ ఉన్నట్టయితే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది'.
'బాబోరు!' అరిచాడు నారాయణ. 'గిన్నెలు పళ్ళాలూ గరిటెలూ ఏం చేసుకుంటుంది ప్రభుత్వం' అన్నాడు నారాయణ వెర్రి ముఖం వేలాడేస్తూ.
'ఏమైనా చేస్తుంది. వేలం వేసుకోవచ్చు. ఖజానాలో డబ్బు జమ చేసుకోవచ్చు' అన్నాడు బట్టతల.
'ఒకవేళ మా వంటింటి సామాను ఎక్కువైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?' అన్నాడు నారాయణ కొంచెం తెలివి తెచ్చుకుని.
'అలా అడగండి చెప్తాం. చాలా వీజీ. రెగ్యులరైజ్ చేసుకోడమే' అన్నారిద్దరూ ఏక కంఠంతో.
'రెగ్యులరైజా?' అన్నాడు నారాయణ ముఖంలో ఆశ్చర్యంలో అంటించుకుని.
'అవును. మీ దగ్గర భూమి అక్రమమైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. డబ్బు కడితే అదే సక్రమం అని సర్టిఫికెటు ఇస్తుంది. ఇంకా గోల్డ్ రెగ్యులరైజేషన్ (జీ.ఆర్.ఎస్), మనీ రెగ్యులరైజేషన్ (ఎం.ఆర్.ఎస్) లాంటి అనేక ఆర్ ఎస్లు ప్రవేశపెట్టబోతున్నారు. అప్పోజిషన్ వాళ్ళూ గిట్టనోళ్ళూ నోరుపారేసుకుంటారు కానీ ప్రభుత్వం చిత్తశుద్ధిని చెత్తశుద్ధి అనుకుంటారు కానీ ఈ స్కీములన్నీ నలుపును తెలుపు చెయ్యడం కోసమే అక్రమాలన్నిటినీ కడిగిపారేయడం కోసమే అని అర్థం చేసుకోరు' అన్నాడు బట్ట తల వాడు.
'మీ వంటిల్లెక్కడ సార్!' అన్నాడు బుట్టతల వాడు.
- చింతపట్ల సుదర్వన్, 9299809212