Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్తి కడుపుతోనే ఉరుకులు పరుగులాయే
ఉత్తుత్తిగనే తపుక్కున పడుడేయె!
బతుకు బరువు మోయలేక
జీవితపు బండి డోరగీలపడుడాయె!
కాయకష్టం ఎంత చేసినా
కష్టనష్టాలను ఎదిరించాల్సిందే
సంసార సాగరాన్ని ఈదాల్సిందే
ఊపిరి బిగబట్టి బతుకుతీరాన్ని చేరాల్సిందే!
ఎక్కెక్కిపడి ఏడ్చుడాయె
కుమిలి కుమిలి సచ్చుడాయె!
మనాది రోగానికి మందే లేదాయె
ఆలోచనల అగ్గిని రాజేస్కోవలసిందే
సమస్యల నెగళ్లను సల్లార్చుకోవలసిందే!!
దారిద్రానికి ఆకలెక్కువాయె
అడుక్కునేందుకు అభిమానం గొంతుకడ్డుతగిలె
చెలిమి చెలిమెలోనో
మాటల ఊటలతోనో
ఆకలిదప్పుల కుతి తీర్చుకోవలసిందే
ఇంటినిండా రోగాలు రొచ్చులాయె
దవాఖానకు దమ్మిడి దగా చేయబట్టే
ఆకులు అలమలతోనో, పండ్లు పసర్లతోనో
గుళ్ళయిన ఒల్లును బాగు చేసుకోవలసిందే
రొచ్చు బతుకును కడదాకా ఈడ్చుకెల్లాల్సిందే!!
ఇంటి సుట్టూ అప్పులోల్లె దడికట్టిరి
వడ్డీలకు వడ్డీలు రాజుకొని
రావణకాష్టంలా రగులుతునే ఉండే
ఇంటిల్లిపాది ఎంత పాకులాడినా పనికి
దమ్మిడి పైసానా దడిని విప్పదాయె
పెళ్ళీడు ఆడపిల్లలాయె
గుండెలమీద రగిలే కుంపటాయె
దించుకోలేక ఎత్తుకోలేక
కుల్లి కుల్లి ఏడ్చుడాయె
ఎన్ని బాధలు ఎదురైనా
బతుకు చెడుగుడాటలో
దెడ్లెంలైను దాటాల్సిందే
జీవితపు పోరాటంలో గెలవాల్సిందే!
- శిల్పా జగదీష్,
92908 27384