Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏదో ఒక రకంగా నటించడం వేరు. 'సినిమా గ్రామర్' ఆకళింపు చేసుకుని నటించడం వేరు. సరైన పద్ధతిలో విజ్ఞుల పర్యవేక్షణలో 'నటనా శిక్షణ' పొందిన వారు నటిస్తుంటే, ఆ స్థాయి విలక్షణంగా ఉంటుంది. అందుకు ఉదాహరణగా నటనలో శిక్షణ పొందిన ప్రముఖులు రాజేంద్రప్రసాద్ ఒకసారి తన తొలి అనుభవాన్ని (బాపు దర్శకత్వంలో 'స్నేహం'-1977) ఇలా వివరించారు. 'అప్పుడే నేను దక్షిణ భారత్ చలన చిత్ర వాణిజ్య మండలి వారి నిర్వహణలో నడుస్తున్న ఫిలిమ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పూర్తి చేసి వచ్చాను. నేను ఆ శిక్షగా సంస్థలో రెండో బ్యాచ్‌కి చెందిన వాణ్ణి (మొదటి బ్యాచ్‌లో ప్రముఖ నటుడు రజినీకాంత్, ఐదవ బ్యాచ్‌లో ప్రసిద్ధ నటుడు చిరంజీవి శిక్షణ పొందారు) 'స్నేహం' చిత్రంలో నాపై చిత్రీకరించిన తొలి దృశ్యం 'కుంటి కులాసం ఇంటికి మోసం' అన్న డైలాగ్‌ను బాపుగారు నాకిచ్చి 'ఇది ఎలా చెబుతావ్?' అని అడిగారు. వెంటనే నేను ఆ డైలాగ్‌ను అభినయ సహితంగా చూపి, దానికి పొడిగింపుగా ఆ సీన్లో ఆ డైలాగ్‌ను అభినయ సహితంగా చూపి, దానికి పొడగింపుగా ఆ సీన్లో ఆ డైలాగ్‌ను ఎవరినైతే ఉద్దేశించి చెప్పానో 'ఆ పాత్ర కుంటివాడు కాబట్టి కాలు అడ్డం పెడతాను. అతనప్పుడు కింద పడిపోతాడు' అని వివరించి చెప్పాను. దీన్నే 'ఇంప్రొవైజేషన్' అంటారు. ఆ 'ఇంప్రొవైజేషన్'ను వివిధ విధానాల్లో మాకు యాక్టింగ్‌లో నేర్పిస్తారు. నేను చెప్పిన విధానం బాపుగారు విని నన్నెంతో మెచ్చుకున్నారు. ఇలా శిక్షణ పొందిన నటీనటులు 'ఇంప్రొవైజేషన్'లో భాగంగా తన నటన గురించి మాత్రమే శ్రద్ధ చూపకుండా 'సహ నటీనటుల నటనా స్థాయి మోతాదు ఎక్కువగా ఉన్నా. తక్కువగా ఉన్నా, దాన్ని ఒకే స్థాయిలో ఉండేలా 'బాలన్స్' చేస్తూ, మొత్తం సన్నివేశం అంతా రసవత్తరంగా వచ్చేలా కృషి చేస్తారు- దర్శకుడి అనుమతి తీసుకుంటూ అందుకే శిక్షణ అన్నది 'సినిమాగ్రామర్' పట్ల అవగాహన ఏర్పడేలా చేస్తుంటారు అనుభవజ్ఞులు.