Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలతి పదాలతో అందమైన భావాలను గుదిగుచ్చి అందించిన అక్షర సుమమాల హనుమకొండకు చెందిన వకుళవాసు కవితా సంకలనం ''వాసంత సమీరాలు''. పేరుకు తగ్గ హద్యమైన 90 కవితలు ఈ సంకలనంలో ఉన్నాయి. మొదటిది, ఈ పుస్తక శీర్షిక అయిన ''వాసంత సమీరాలు'' కవితలో కవయిత్రి భావాలను ఆవిరి చేశానంటూ తిరిగి అవి అక్షర జల్లులుగా తన దోసిట్లో కురిశాయనడం చాలా అందంగా ఉంది.. వివిధ సమయాల్లో మనసు భావోద్వేగాల్ని ఈ కవితలో చెప్పారు.
''ఆకాశం'' కవితలో చిన్ననాటి నుండి ఆకాశంతో పెన వేసుకునే అనేక ఊసులను.., ''కవితా కాగడ కాళోజీ''లో కాళోజీ గారి గురించి తక్కువ మాటల్లో వివరంగా తెలిపారు. ''సాఫల్యం'' కవితలో మానవ జీవిత సాఫల్యానికి చక్కని సూత్రాలను.. ''నాన్నలో'' ప్రేమను.. 'ఆమె'' ప్రాముఖ్యతను.. ''అడవి బిడ్డల'' జీవనశైలి, అమాయకత్వం.. సమాజం కోసం ''పడిగాపులు''గాచే పోలీసువారి త్యాగనిరతిని, ''మధుర జ్ఞాపకాలు'' లో ప్రతి ఒక్కరం ఏదో ఒక సందర్భంలో దాచుకున్న నెమలీక వంటి తలపులు.. ''మన బాపులో'' ప్రొఫెసర్ జయశంకర్ గారి గురించి. ''ఏడడుగుల అనుబంధంలో'' భర్యాభర్తల అనురాగాన్ని.. ''భాషా తరువులో'' తెలుగు భాష మధురిమను... ''అరుగుల అడ్డా'' లో గతంలో ఇంటి ముందర అరుగులతో ముడిపడిన రకరకాల అనుభూతులను... ''అక్షరార్చన''లో ప్రేమికుల మధ్య అనురాగాన్ని.. ''ఆత్మీయ నేస్తం''లో భారతీయ సంప్రదాయ వస్త్రమైన చీరలోని గొప్పదనం.. అందం గురించి.. ఇంకా అనేక అద్భుత భావాలను చక్కగా రాశారు కవయిత్రి.. మనసులో మొలకెత్తే భావాల చిగురులను కవనవనంగా తీర్చిదిద్దిన తీరు ప్రశంసనీయం.. తన భావాలనే కాదు సామాజిక సమస్యలనూ తన కలం గళం ఎత్తి నినదించారు ఈ సంకలనంలో.
భావకవిత్వం ఇష్టపడే ప్రతి ఒక్కరి ఇంటి లైబ్రరీలో చేర్చుకోదగిన చక్కని పుస్తకం..
(వాసంత సమీరాలు (కవిత్వం), రచయత : వకుళ వాసు, పేజీలు : 160, వెల : రూ.150/-, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో, రచయిత సెల్ : 998919334)
- కె.వరుణ శ్రీనివాస్,
9963927192