Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గదిలో ఒకామె గోళ్ళకు రంగు వేసుకుంటున్నది. గదిలో ఉన్న మరొక మనిషి గోడకు తల ఆన్చి గుర్రు పెడ్తున్నాడు. అదే గదిలో ఉన్న మరొక వ్యక్తి ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. ఇంకొక శాల్తీ పత్రికలో 'పదకేళి' నింపుతున్నాడు.
గది బయట తచ్చాడుతున్నవాడు గేటు వైపుకి చూస్తున్నాడు. గేటు దగ్గర ఉన్నవాడు రోడ్డుపైకి చూస్తున్నాడు. రోడ్డు ఖాళీగా వుంది. ఖాళీగా వున్నందుకు బావురుమంటున్నాడు.
దిగులుగా ఉన్న రోడ్డు ఉలిక్కిపడ్డది. కారొకటి బుర్రుమంటూ వచ్చింది. వచ్చి వెళ్లిపోలేదు. గేటుకి అంతదూరాన ఆగింది. ఆగిన కారు తలుపు తెర్చుకుంది. తెర్చుకున్న కారు తలుపులో నుంచి ఓ తల బయటకి వచ్చింది. తల వెంట దాని తాలూకు బాడీ బయటకు వచ్చింది. ఆ బాడీ తలను మోసుకుంటూ గేటు దాటింది. గది దగ్గరికి వచ్చింది.
వచ్చిన వాడు గదిలో గోళ్ళకి రంగు వేసుకుంటున్న ఆమె వైపు చూశాడు. ఆమె చేయి వెనక్కి దాచుకుంది. గురక ఆగిపోయింది. ఆ పక్కన పుస్తకంలో నుంచి తల బయటకి వచ్చింది. పత్రికను పొట్టలో దాచుకున్నాడింకో శాల్తీ.
ఎవరైనా వచ్చారా? అని అడిగాడు కారు దిగి బోడీని మోసుకుంటూ వచ్చినవాడు.
బొటనవేలూ చూపుడువేలూ కలిపి సున్నా చుట్టింది ఆమె. కిటికీలోంచి వెల్తురు పడి మెరుస్తున్నయి రంగువేసిన గోళ్ళు.
అతను నిట్టూర్చాడు. వెనక్కి తిరిగాడు కారు దగ్గరికి నడిచాడు. కార్లో కూచున్నాడు కారు నడవలేదు. పరుగెత్తింది.
గోడ గడియారం మరో గంట కాలాన్ని బాగా నమిలి తినేసింది. ఖాళీగా ఉన్న రోడ్డు బావురుమంటున్న రోడ్డు దిగులుగా ఉన్న రోడ్డు ఉలిక్కి పడ్డది. టీవీ వాళ్ళ వ్యాన్ వచ్చింది. అందులోంచి ఇద్దరు దిగారు ఒకడి చేతిలో కెమెరా ఉంది. ఒకరి జేబులో మైకుంది. ఇద్దరూ గేటు దాటారు. గది ముందుకు వచ్చారు.
గదిలో గోళ్ళకు రంగు వేసుకోవడానికి ఇరవై గోళ్ళూ అయిపోయినందున ఆమె చేతిగోళ్ళతో బొట్టు సవరించు కుంటున్నది. గది ముందుకు వచ్చిన మనిషిని చూసి సర్దుకు కూచుంది. గుర్రుపెడ్తున్నవాడు విధిలేక కళ్ళు తెరిచి కనుబొమలతో చిక్కుముడి వేశాడు. పుస్తకం మింగేసిన వాడు పనేమీ లేక బుర్ర గోక్కుంటున్నాడు. పాతదైపోయిన పత్రికని చుట్టచుట్టి మరొకడు గాలి విసురుకుంటున్నాడు గదిలో ఫ్యాను ఉన్నా ఏమీ చెయ్యడానికి లేక.
ఎవరైనా వచ్చారా? అని అడిగాడు గదిలోకి వచ్చినవాడు. గదిలో ఎవరూ నోరు విప్పలేదు.
గోళ్ళ ఓనర్ ఇందాకటి లాగానే బొటనవేలు చూపుడువేలు కలిపి సున్నా చుట్టింది. కనుబొమల ముడి విప్పిన వాడు మిగతా ఇద్దరూ రెండేసి వేళ్ళు జత చేసీ భూగోళమూ, కోడిగుడ్డూ, బత్తాయికాయా చూపించారు.
వచ్చినవాడు నుదుటి మీద అరచేతి వేళ్ళతో బాదుకున్నాడు. ఉసూరుమంటూ వెనక్కి మళ్ళాడు.
సెల్లు మోగింది. అరుణ్ వెళ్దామా అన్నాడు వెంకటేష్. 'వర్క్ ఫ్రం హౌం' అలవాటైపోయింది. ఇల్లు దాటి రావడం లేదు. సరుకులు బిగ్ బాస్కెట్లో వస్తున్నయి. కూరగాయలు 'పొలిమేర' తెస్తున్నది అంటూ సెల్లు ఆఫ్ చేసి కంప్యూటర్ ఆన్ చేశాడు అరుణ్.
'వస్తావా వెళ్దాం!' అంది గీత. 'ఏం వెళ్దాం. వంటిల్లు సర్దుకోవాలి' అంది సునీత. మరీ వంద మీటర్ల దూరమూ నడవలేను మనగేటు ఎదురుగ్గా అయితే వచ్చేవాణ్ణే అయినా మన ప్రాబ్లమ్స్ ఎవరూ సాల్వ్ చెయ్యర్లే అన్నాడు రాఘవరావు మోహన్‌రావుతో అతను కూడా వెళ్ళకుండా ఆపేస్తూ.
వరాలూ, హామీలూ, ఇళ్ళూ వాకిళ్ళూ పెన్షన్లూ క్వాటర్లూ కర్సెన్సీలూ మానిఫెస్టోలూ అన్నీ వాళ్ళకే గదాజ వీళ్ళ కోసంవాళ్ళూ, వాళ్ళ కోసం వీళ్ళూ మనకెందుకు 'హెడ్డేక్' అనుకున్నాడు అల్లంత దూరాన ఉన్న గుడిశెల వైపు చూస్తూ ఇంటి ఆవరణలో ఆరు కార్లున్న కోటేశ్వర్రావు.
రోడ్డు ఖాళీగానే వుంది. గేటు దగ్గరి వాడు నీరసపడ్డాడు. గదిలోని వాళ్ళు ఉసూరుమంటున్నారు. గోడకు తల ఆన్చి నిద్ర పోతున్న వాడికి పెద్ద ఇనుపడబ్బా ఇకటి ఇంటింటికీ మోసుకుపోయి 'వెయ్యండయ్యా బాబు వెయ్యండయ్యా'అని పాడుతున్నట్టు కల వచ్చింది.
గది ముందు పోలింగ్ స్టేషన్ నం.3 అని రాసున్న అట్ట గాలికి వెనక్కి తిరిగిపోయింది. తన మీద గౌరవమూ, నమ్మకమూ తగ్గిపోతున్న మనుషుల కారణంగా ముందు ముందు యేం జరుగుతుందోనన్న భయంతో వణికిపోసాగింది 'ప్రజాస్వామ్యం'.
- చింతపట్ల సుదర్శన్,
9299809212.