Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగం ఈ ఇరవయ్యో శతాబ్దంలో స్త్రీకి తప్పని అవసరం. ఆర్ధిక స్వావలంబన కోసం అంటూ, స్త్రీకి తన సొంత సంపాదన భద్రత ఇస్తుందని, ఆమె జీవితానికి అది అధారం అవుతుందని, ఆర్ధిక అవసరాలు లేకపోయినా, ఆమె సామాజిక అవసరాలకు ఆమె వ్యక్తిగత సంపాదన సహకరిస్తుంది అని, స్త్రీ ఉనికిని ఆమె స్వయంగా ఆర్జించే ధనం గౌరవాన్ని సమకూర్చుతుందని చాలా మంది స్త్రీలు ఉద్యోగాన్ని తమ జీవితంలో ఒక భాగంగా స్వీకరించి, అది తాము నిర్వర్తించవలసిన ఒక బాధ్యతగానే ఈ రోజుల్లో అనుకుంటున్నారు. కాని బయట ప్రపంచం కేవలం పురుషులకే పరిమితం అని అనుకునే గత కాలపు రోజుల్లో ఒక స్త్రీ కుటుంబం కోసం ఉద్యోగాన్ని నిర్వర్తించేటప్పుడు, కుటుంబ స్త్రీ పాత్ర నుండి ఉద్యోగినిగా మారుతున్న క్రమంలో ఆమె కుటుంబపరంగా, సమాజపరంగా ఎదుర్కున్న సవాళ్ళను, చివరకు ఆమె బలమైన వ్యక్తిత్వం, నైతిక బలం ఉన్న మహిళగా సమాజాన్ని ఎదుర్కొని తన అస్థిత్వాన్ని నిలుపుకునే ఒక అపురూప వ్యక్తిగా ఎదిగిన క్రమం ఉత్తేజపరుస్తుంది. సత్యజిత్ రే బెంగాలీ క్లాసిక్ ''మహానగర్''లోని ఆర్తి మజుందార్, భారతీయ సినిమాలో మలచబడ్డ ఒక విశిష్టమైన స్త్రీ పాత్ర. నేటి ఆధునిక ఉద్యోగినికి ప్రేరణ ఇచ్చే గొప్ప సినిమా మహానగర్.
సత్యజిత్ రే ప్రతిభ గురించి ప్రపంచం అంతా ఎన్నో విధాలుగా చర్చించింది. భారతీయ సినిమాలోని విశిష్టమైన స్త్రీ పాత్రలను పరిచయం చేసే క్రమంలో కేవలం ఆ కోణం నుంచే ఈ సినిమాను నేను చర్చించదలిచినందువలన ఈ కళాఖండం గురించి ఎన్నో టెక్నికల్ విషయాలు కూడా చర్చించుకోవచ్చని తెలిసినా ఆర్తీ పాత్ర వరకు మాత్రమే ఇక్కడ పరిమితమవ్వదలచాను.
కలకత్తాలో ఒక మధ్యతరగతి కుటుంబం. ఇంటి పెద్ద రిటైర్డ్ స్కూల్ టిచర్. భార్య కుటుంబాన్ని కనిపెట్టుకుని చూసే గహిణి. వారి కొడుకు సుబ్రత ఒక బ్యాంక్‌లో పని చేస్తుంటాడు. అతని భార్య ఆర్తి అనుకూలవతి. కొద్దిగా కాలేజీ చదువు సాగించి మధ్యలో పెళ్ళి వలన చదువు పూర్తి చేయదు. ఇంట్లో అందరూ ఎంతో ఇష్తపడే వ్యక్తి ఆమె. వారికి ఒక కొడుకు. వీరు కాక ఆ ఇంట్లో హైస్కూలుకు వచ్చిన ఒక చెల్లెలు కూడా ఉంటుంది. ముచ్చటైన కుటుంబం. కాని కొడుకు అర కొర సంపాదన కారణంగా ఆ ఇంట్లోని వ్యక్తులు కొన్ని అర్ధిక సమస్యలతో ఇబ్బందిపడుతూ ఉంటాడు. ఇంటి పెద్ద కంటి అద్దాలకు, డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళడానికి, అమ్మాయి చదువుకు, తల్లికి కావలసిన పొడుం డబ్బా లాంటి చిన్న అవసరాలు తీరక, తీర్చడానికి సుబ్రత్ జీతం సరిపోక, కుటుంబం ఇబ్బంది పడుతూ ఉంటుంది. తన స్నేహితుడు అతని భార్య ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారని సుబ్రత్ చెప్పినప్పుడు ఆర్తి ఆలోచనలలో పడుతుంది. తనను కూడా ఉద్యోగం చేయమని భర్త అడుగుతున్నాడని అనుకుంటుంది. ఆలోచిస్తూ తన భర్త చాలా కష్టపడుతున్నాడని, అయినా ఇంటి అవసరాలు తీర్చలేక ఇబ్బంది పడవలసి వస్తుందని తాను అతనికి ఏమీ చేయలేకపోతున్నానని బాధపడుతుంది.
కుటుంబ స్త్రీ రోజూ చేసే పనులు గురింపు పొందవని, వాటికి విలువ కట్టకపోవడం ప్రతి కుటుంబంలో, సమాజంలో జరుగుతున్నదే అన్నది ఆర్తి ఆలోచనలతో అర్థ్ధం అవుతుంది. భర్త డబ్బు తీసుకువస్తున్నాడు కాబట్టి అతను చేసేది విలువైన పని. కాని తను కుటుంబం కోసం పడే శ్రమలో డబ్బు ప్రసక్తి లేనందువలన తను చేసే శ్రమవిలువ స్వయంగా ఆర్తి, ఆమెలాంటి గహిణులెవ్వరికీ అర్థం కాకపోవడం సహజంగా సమాజంలో ఉన్న అజ్ఞానమే. దానికి ఆర్తి కూడా అతీతురాలు కాదు. తన భర్తతో సమానంగా తాను కష్టపడాలంటే తానకు ఉద్యోగం అవసరమని నిర్ణయించుకుంటుంది ఆర్తి. ఆమె, సుబ్రత ఇద్దరూ కలిసి పేపర్ ప్రకటనలు చూసి ఆమె చదువుకు సరిపడ ఉద్యోగాలు వెతుకుతారు. చివరకు ఒక ఆఫీస్‌లో సేల్స్ గర్ల్ ఉద్యోగం ఉందని తెలిసి దానికి దరఖాస్తు పెడతాడు సుబ్రత్. దరఖాస్తు రాస్తూ కింద సంతకం పెడుతూ అలవాటు లేని పని అవడం వల్ల ఆర్తి చేయి వణుకుతుంది. మజుందార్లో జీ ఉండాలా ఉండాలా అని స్పెల్లింగ్ భర్తతో చెప్పించుకుంటుంది. ఆమె ఇబ్బందిని ఆస్వాదిస్తాడు సుబ్రత. అలాగే పెద్దవారికి చెప్పకుండా ఇంటర్వ్యూకి వెళ్ళడం, ఆర్తికి ఉద్యోగం రావడం జరుగుతుంది. జీతం వంద రూపాయలు. అప్పట్లో పెద్ద రుసుమే అది. ఇంటి పెద్దకు కోడలు ఉద్యోగానికి వెళ్తుందని కొడుకు ద్వారా తెలుస్తుంది. అది అతని దష్టిలో పెద్ద తప్పు. అగ్రకులానికి చెందిన ఒక కుటుంబ స్త్రీ ఇలా డబ్బు సంపాదన కోసం వీధిలోకి వెళ్ళడం అతని దష్టిలో చేయకూడని పని. కొడుకుతో మాట్లాడడు ఆ తండ్రి. తల్లి మాత్రం ఎవరికీ చెప్పలేక తాను అందించవలసిన సహకారం కుటుంబానికి అందిస్తూ మౌనంగా ఉండిపోతుంది. ఆర్తి కొడుకు చిన్నపిల్లవాడు. తల్లి ఇల్లు వదిలి ఉద్యోగానికి వెళ్ళడం ఇష్టపడక మారాం చేస్తాడు. చివరకు డబ్బు చేతికి వచ్చాక మంచి బొమ్మలు కొనిస్తానని తల్లి చెప్పే సరికి అలకమాని తల్లిని వెళ్లనిస్తాడు.
ఆర్తి మొదటిసారి ఉద్యోగంలో చేరడానికి భర్తతో ఆఫీసుకు వెళుతూన్నప్పుడు ఆమె చేతులు చల్లబడిపోవడం ఆమె బెదురుచూపులు చుసి భర్త ఆమెకు ధైర్యం చెప్పి ఆఫీసు ముందు ఆమెను వదిలి వెళ్ళిపోతాడు. ఆర్తి తనతో పాటు ఉద్యోగంలో చేరిన మిగతా స్త్రీలను కలుసుకుంటుంది. అందులో ఎడిత్ అనే ఒక ఆంగ్లో ఇండియన్ అమ్మాయి పరిచయం అవుతుంది. ఎడిత్ మేనేజర్‌తో మాట్లాడి అందరికీ జీతంతో పాటూ కమిషన్ కూడా వచ్చే ఏర్పాటు చేస్తుంది. మేనేజర్‌కు మొదటి నుండి ఎడిత్పై సదభిప్రాయం ఉండదు. ఆంగ్లో ఇండియన్లకు నైతికత తక్కువ అని అతని అభిప్రాయం. అందుకే బెంగాలీ ఉన్నత కుల స్త్రీ అయిన ఆర్తికి ఇచ్చిన గౌరవం ఎడిత్కు ఇవ్వడు. పైగా ఏ ఇబ్బంది ఎదురయినా ఎడిత్ కాకుండా ఆర్తి మిగతావారి బదులుగా మాట్లాడాలని నిర్ణయిస్తాడు. అప్పటి సమాజంలో ఆంగ్లో ఇండియన్లపై హిందువులకు ఉన్న చిన్నచూపు ఈ సినిమాలో బాగా చూపించారు దర్శకులు.
ఆర్తి తొందరలోనే పని నేర్చుకుని తన నేర్పుని ప్రదర్శించి మంచి కమిషన్ సంపాదిస్తుంది. మొదటి నెల జీతం వచ్చాక ఇంటికి కావలసినవన్నీ అందరికీ తెస్తుంది. ఆమెలో పెరుగుతున్న ఆత్మ విశ్వాసం, భర్త తోడు లేకుండా ఆమె నెగ్గుకు రావడం, తనపై తనకి ఆమెకు కలుగుతున్న నమ్మకం సుబ్రతను అభద్రతా భావంలోనికి నెట్టేస్తాయి. మామగారు ఆమె డబ్బు ముట్టడానికి ఇష్టపడడు. సుబ్రతకు తాను ఒంటరినవుతున్నానని అనిపిస్తూ ఉంటుంది. భార్య వ్యక్తిత్వంలో పేరుకుంటున్న విశ్వాసాన్ని గమనిస్తూ ఉంటాడు. ఆమెను ఉద్యోగానికి రాజీనామా చేయమని తాను పార్ట్‌టైమ్ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నానని చెబుతాడు. కాని తాను పనిని ఆస్వాదిస్తున్నానని ఆర్తి చెపుతుంది. ఇంట్లో ఎవ్వరూ ఆమె ఉద్యోగం చేయడం ఇష్టపడట్లేదని ఆ పరిస్థితులలో ఉద్యోగం అనవసరం అని తానే అదనంగా మరో పని చూసుకుంటానని అతను అంటాడు. ఆర్తి మౌనంగా రాజీనామా పత్రంపై సంతకం పెడుతుంది.
అదేరోజు సుబ్రత బ్యాంకు దివాళా తీసినందువలన అది మూత పడుతుంది. అతని ఉద్యోగం పోతుంది. రాజీనామా చేయవద్దని అతను భార్యకు ఫోన్ చేసి చెబుతాడు. ఆర్తి తన పరిస్థితి వివరించి మేనేజర్ ఇచ్చే అదనపు భాద్యతలు స్వీకరిస్తూ ఒక యాభై రూపాయలు జీతం ఎక్కువ అడుగుతుంది. ఆమె పనిని ఇష్టపడ్డ మేనేజర్ దానికి అంగీకరిస్తాడు. అనారోగ్య కారణంగా ఉద్యోగానికి రాలేని ఎడిత్ పనిభారం కూడా అమెపై పడుతుంది. న్యూనతా భావంతో సుబ్రత కొట్టూకుంటూ ఉంటాడు. భార్య పర్సులో కనిపించిన లిప్స్టిట్ అతనిలో ఎన్నో అనుమానాలు కలిగిస్తుంది. ఎడిత్ ఇచ్చిన లిప్‌స్టిక్‌ను అప్పుడప్పుడు సరదాగా వాడుతున్న ఆర్తి దాన్ని పడేసి భర్త తనను తప్పుగా అర్ధం చేసుకోవద్దని చెబుతుంది.
ఒకరోజు హౌటల్లో ఆర్తి తన స్నేహితుని భర్తను కలుసుకుంటుంది. ఉద్యోగం చేస్తున్నావా అని అడిగిన అతనికి తన భర్త వ్యాపారస్తుడని, సరదాగా తాను ఉద్యోగం చేస్తున్నానని. ఆరు నెలలు మాత్రమే తాను కొంత మార్పు కోసం ఉద్యోగం చేయదల్చానని. ఇది ఆఖరి నెల అని చెబుతుంది. చాటు నుండి ఆమె మాటలు విన్న సుబ్రతకు తనపై ప్రేమతో భార్య చెబుతున్న అబద్దాలు ఆలోచనలలో పడేస్తాయి. ఉద్యోగం లేని భర్త పరిస్థితిని కప్పి పుచ్చుకుంటూ అతని గౌరవానికి, ఈగోకు భంగం కలగకుండా తాము ఆర్థిక అవసరాలకోసంకాక సరదా కోసం ఉద్యోగం చేస్తున్నామని చెప్పుకునే ఎందరో స్త్రీల స్థితి మనకు ఆ సీన్లో కనిపిస్తుంది. భర్త ఉద్యోగం చేయకుండా, భార్య ఉద్యోగం చేస్తుంటే సమాజం చూసే చిన్న చూపు, చూపే చులకన భావంలో స్త్రీ పురుష సహజీవనాన్ని ఆర్థిక ప్రాధాన్యతల మధ్యనుండి చూసి అంచనా వేసే సమాజ వైఖరి కనిపిస్తుంది. ఆ వైఖరిని ఎదుర్కునే వర్కింగ్ ఉమెన్ కష్టం, ఆమె పడే పాట్లు ఆ ఒక్క సీన్లో గొప్పగా చూపించారు రే.
కొంత అనుమానం, అభద్రతతో సుబ్రత ఒకసారి ఆర్తి ఆఫీసుకు వస్తాడు. అయితే అక్కడ ఆమె మేనేజరు వ్యక్తిత్వం అతనికి నచ్చుతుంది. అంతకుముందు ఆ మేనేజర్ భార్యతో ఫోన్లో మాట్లాడం విన్న తరువాత, ఆతను ఒక మంచి భర్త అనీ అర్థం చేసుకుంటాడు. ఆర్తిపై అతనికి ఉన్నది గౌరవం అని తనను అతను ఆఫీసులో గౌరవించిన విధానం చూసి అతను అర్ధం చేసుకుంటాడు. మేనేజర్ సుబ్రతకు కూడా ఉద్యోగం చూస్తానని చెబుతాడు.
ఆరోగ్యం బాగుపడి ఉద్యోగంలో చేరడానికి వచ్చిన ఎడిత్ అబద్దాలు చెప్పి సెలవు తీసుకుందని అవమానకరంగా మాట్లాడి మేనేజర్ ఆమెను ఉద్యోగం నుండి తొలగిస్తాడు. ఆర్తి ఇది తెలిసి మేనేజర్‌ను నిలదీస్తుంది. అతను తప్పు చేసాడని ఎడిత్ నిజంగానే అనారోగ్య కారణంతోనే ఆఫీసుకి రాలేదని, తాను ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను చూసి వచ్చానని చెబుతుంది. కాని ఆంగ్లో ఇండియన్లను చులకనగా మాట్లాడుతూ, ఆమె ఉద్యోగంలో లేకపోకపోతే, లాభపడేది ఆర్తి అని మేనేజర్ ఆమెకు సూచిస్తాడు. కాని తాను అన్యాయాన్ని సహించనని అతన్ని ఎడిత్కు క్షమాపణ చెప్పమని అడుతుంది ఆర్తి. నిరాకరించిన అతనికి రాజీనామా ఇచ్చి ఆఫీసు నుండి బైటపడుతుంది.
బైట కలిసిన భర్తను చూసిన తరువాత ఆమె వాస్తవంలోని వస్తుంది. ఇంటి పరిస్థితులను మరచి తాను ఆ పని చేయలేదని, న్యాయం కోసం చేసానని తనను అర్థం చేసుకొమ్మని భర్తను అడుగుతుంది. ప్రతి దానికి భయపడుతూ, భర్త అనుమతి కోసం చూసే ఒకప్పటి ఆర్తికి, అంతటి కష్టకాలంలో కూడా పరిస్థితులకు బెదరక న్యాయం కోసం ఉద్యోగాన్ని వదిలి వచ్చిన ఆ స్త్రీకి మధ్య మార్పు చూసిన ఆ భర్త, భార్య చేసిన పనిని మెచ్చుకుంటాడు. తాను కూడా అంత ధైర్యం, సాహసం, చూపలేనని, ఉద్యోగం కోసం విలువల్ని కుదవ పెట్టడం సాధారణంగా అందరూ చేసే పని అని కాని దానికి విరుద్దంగా ఆర్తి చూపిన ధైర్యం తెగువ, తనకు అంగీకారమని, తాను ఆమెను అర్థం చేసుకుని సమర్ధిస్తానని అతను చెబుతాడు. ఇంత పెద్ద మహానగరంలో తమ ఇద్దరికీ ఉద్యోగాలు దొరక్కపోవని వారు కలిసి ఒకటిగా వెళ్ళడం సినిమా ఆఖరి సీన్.
సినిమా మొదట్లో పక్క ఇంట్లో భర్త కోసం టిపోడి అప్పు తీసుకు వచ్చి, టీ తయారు చేసి వచ్చి ఆలస్యంగా వచ్చావని భర్త కినుకగా మాట్లాడితే భయంగా అణుకువగా జవాబు చెప్పే ఒక గహిణిగా ప్రతి అడుగూ నమ్మకం లేక వెనుకాడుతూ వేస్తూ అభద్రతభావాన్ని నిండుగా నింపుకున్న మహిళగా ఉన్న ఆర్తి ఆ మహానగరంలో ఉద్యోగం చేస్తూ ఒక వ్యక్తిగా ఎదుగుతూ, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతటి సాహసానికయినా సిద్ధపడి ఉన్న మనిషిగా చివరకు మారడం కనిపిస్తుంది. ఆఖర్లో పేదరికంలో నిరుద్యోగంలో ఆ భర్త చేతిని పట్టుకుని ఆత్మవిశ్వాసంతో నడుచుకుంటూ వెళ్ళిపోతున్న ఆమెను చూస్తే ఆమె వ్యక్తిత్వంలో ఆ ఉద్యోగ అనుభవం వలన ప్రపంచాన్ని తన దష్టితో చూసి విశ్లేషించే అవకాశం వచ్చిన తరువాత ఆమె మానసికంగా ఎదిగిన వైనం కనిపిస్తుంది. ఉద్యోగం చెస్తే స్త్రీ చెడిపోతుంది, బైట ప్రపంచంలోకి వెళితే స్త్రీ కుటుంబానికి దూరమవుతుంది లాంటి స్టేట్మెంట్లు ఈ రోజుకీ వింటూనే ఉంటాం. అలాంటి వాటికి సమాధానంగా కనపడుతుంది ఆర్తి పాత్ర. ఆఫీసులో ఒక ఆంగ్లో ఇండియన్ యువతిపై చుపే వివక్ష కోసం పోరాడే ఒక యువతిగా ఆమె చూపిన సాహసం, సమాజ పరమైన అవగాహన ఉన్న స్త్రీ ఎంత ఉన్నతంగా ఎదగగలదో చెబుతుంది. స్త్రీని ప్రపంచ విషయాల నుండి దూరం పెట్టడం కాకుండా ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగే స్వేచ్ఛను ఇవ్వగలిగితే ఆమెలో వ్యక్తిగా వచ్చి మార్పులు సమాజానికి ఎంత ఉపయోగకరంగా ఉంటాయో ఆర్తి పాత్ర చెబుతుంది.
ఆర్తి ఉద్యోగాన్ని ఇష్టపడుతుంది. ముందుగా అర్థిక అవసరాల కోసమే ఉద్యోగాన్ని చేయడం మొదలుపెట్టినా, తనలోని శక్తిని ఆ ఉద్యోగ ప్రయత్నం ఆమెకు చూపెడుతుంది. ఒక్కసారి తనపై తనకు నమ్మకం వచ్చిన తరువాత తన భాద్యతల పరిధిని పెంచుకుం టుంది. సమాజాన్ని, కుటుంబాన్ని అర్ధం చేసుకుంటుంది. తన శక్తి వంచన లేకుండా అన్ని పాత్రలను సక్రమంగా పోషిస్తుంది. అవసరం కోసం పురుషునితో జీవించే ఒక స్త్రీలా కాకుండా, కోరి ఆ భర్తతో జీవించే స్త్రీగా ఎదుగుతుంది. భార్యకు తాను అవసరం కాదు అని తెలుసుకుని ఆ భర్త అభద్రతా భావానికి లోనయినా, చివర్లో ఆర్తి తనను కోరివచ్చి తాను ఒక్కడు మాత్రం, తనను అర్థం చేసుకుంటే చాలని రాజీనామా తరువాత అడిగినప్పుడు ఆమెలోని స్త్రీ తత్వానికి, ఆత్మ విశ్వాసానికి ఆ భర్త ఆశ్చర్యపోతాడు. అలాంటి పరిపూర్ణమైన స్త్రీతో ఉన్న బంధంలోని సౌందర్యాన్ని ఆస్వాదిస్తాడు. ఇప్పుడు తన చేతులు చల్లబడట్లేదని తాను ధైర్యంగా ఉన్నానని ఆమె చెబుతున్నప్పుడు ఆ ఆత్మాభిమానం గల స్త్రీ చేయి పట్టుకోవడంలో ఉండే పరిపూర్ణతను అతను అర్థం చేసుకుని ఆమెతో ఆనందంగా ప్రయాణించడానికి ఎన్ని కష్టాలనయినా కలిసి భరించడానికి సిద్ధపడతాడు. ఒక బలమైన వ్యక్తిత్వం గల స్త్రీతో జీవితం మగ ఈగోను అనుక్షణం సంతప్తి పరచక పోయినా, జీవితాన్ని అర్ధవంతం చేయగలదని పురుషుడు అర్ధం చేసుకున్నప్పుడే ఆర్తి లాంటి స్త్రీల సంఖ్య పెరుగుతుంది.
రే తీసిన అన్ని సినిమాలు గొప్పవే. కాని మహానగర్లో ఒక వర్కింగ్ వుమెన్ ఇండివిడ్యుయాలిటిని, అటువంటి స్త్రీలు సమాజానికి ఎంత అవసరమో అన్న విషయాన్ని 1963లోనే ఈ సినిమా ద్వారా రే చెప్పిన తీరు చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి వర్కింగ్ ఉమెన్ గుర్తుపెట్టుకోవలసిన గొప్ప పాత్ర ఆర్తి మజుందార్. ఆ పాత్రలో జీవించిన మాధాబీ ముఖర్జీ నటన ఆకట్టుకుంటుంది.
- పి.జ్యోతి,
9885384740