Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి అనే వాడు మంచివాడు అవనీ కాకపోనీ తెలివైన వాడు మాత్రం అవును. తెలివైన వాడు అయితేనేం మనిషికి ఉన్నవి రెండు కాళ్ళే. రెండు కాళ్ళు మాత్రమే ఉన్న వాడయితేనేం నాలుక్కాళ్ళ వాటి మీద పెత్తనం చలాయిస్తాడు. ఎందుకంటే మనిషి మరి తెలివైన వాడు కదా!
అనగనగా అదో అడవి. ఇదిగిదిగో ఇదో గుర్రం. దీనికి నాలుగు కాళ్ళు. నడిపించే వాడు వున్నాడు. వీడికి మాత్రం రెండు కాళ్ళే అయితేనేం ఉండాల్సింది తెలివి. అది వీడికి వుంది.
ఈ మనిషి గుర్రం మీద బయలుదేరాడు. ఒకటా రెండా అనేక యోజనాల ప్రయాణం. రాత్రీ లేదు పగలూ లేదు గుట్టా లేదు మెట్టా లేదు నీరూ లేదు నిప్పు లేదూ. అలాగ గుర్రం పరుగెత్తుతూ ఉండాల్సిందే. దాని మీద మనిషి మైళ్ళకి మైళ్ళు దాటి పోవాల్సిందే.
నాలుక్కాళ్ళ గుర్రాన్ని నాకు రెండు కాళ్ళ మనిషిని మోయడం అవసరమా అనుకుందేమో గుర్రం పరుగులో తేడా వచ్చింది. వేగం తగ్గింది. అడుగులో అడుగు వేస్తూ ఆషామాషీగా నడవసాగింది. తెలివైన మనిషికి ఏమీ అర్థం కాలేదు. కాసింత దూరం నడిచాక బాట పక్కనే ఓ బాటసారి కనిపించాడు. ఒక తెలివికి మరో తెలివి తోడయితే బావుంటుంది కదా అనుకున్నాడు.
'ఓ బాటసారీ!' అని కేక వేశాడు. బాటసారి బాట మీద నుంచుని 'ఓరు!' అని పలికాడు.
'మరేం లేదు! నాకర్థం కావడం లేదు! వెళ్ళాల్సిందేమో చాలా దూరం. ఈ గుర్రమేమో మొరాయిస్తున్నది' అన్నాడు.
'వెనకాముందూ అన్ని బరువులు మోస్తున్నది. తిండి సరిగ్గా పెట్టావా?' అన్నాడు బాటసారి గుర్రాన్ని ఎగాదిగా చూస్తూ.
అయ్యో అడక్కు. ఏదిపెడితే అదికాక ఏదిపడితే అది తిన్నది. చిట్టూ, తౌడూ, శనగలూ, ఉలవలూనే కాదు ఎండు గడ్డీ పచ్చి గడ్డీ నానా గడ్డీ తిన్నది. హుశారుగా పరుగెడ్తుందని అన్నీ పెట్టా అన్నా' అన్నాడు గుర్రం మీద ఉన్నవాడు.
'అంత ఎక్కీ తొక్కీగా ఏదిపడితే అది తిని ఒళ్ళు బరువెక్కి ఉంటుంది అందుకేనేమో కదలడం లేదు. నాలుగు బాదకపోయావా?' అన్నాడు బాట మీద ఉన్నవాడు.
'బాదడమా? అదేం కుదరదు. చీమకు కూడా హాని తలపెట్టని వాణ్ణి బాబూ. ఆవు తోకకు మొక్కేవాణ్ణి, కాటేసే పాముకు పాలుపోసే వాణ్ణి' అన్నాడు గ్రురం నడిపేవాడు.
'అలాగా' అంటూ మరోసారి గుర్రాన్ని పరీక్షగా చూసాడు బాటసారి. గుర్రం మీద ఉన్న మూటల మీద రాతలు చదివాడు. 'ఆవాస్ యోజన', 'జన్‌ధన్ యోజన' 'ఉజ్వల్ యోజన' 'మాన్‌ధన్ యోజన' 'ఇవేమిటోరు ఇన్ని యోజనాల బరువు మోస్తూ ఈ గుర్రం ఎన్ని యోజనాలు పరుగెట్టగలదోరు' అన్నాడు.
'ఇవేం చూశావ్ ఇంకా చాలా ఉన్నాయి. బ్యాంక్‌లు దివాళా తీయించిన వాళ్ళ అప్పుల లెక్కలున్నయి పబ్లిక్ రంగ సంస్థలున్నయి రకరకాల సబ్సిడీలున్నయి ఇవన్నీ మోసుకుంటూనే ముందుకు వెళ్ళాలి 'అచ్ఛేదిన్' 'ఆత్మనిర్భరత' సాధించి తీరాలి' అన్నాడు గుర్రం రౌతు.
'ఊహూ! లాభం లేదు. పక్క చూపులే తప్ప ముందు చూపులేని గుర్రం మీద ఇంత భారం మోపితే వెనక్కి నడుస్తుంది తప్ప ముందుకు పోదు. నా మాట విను. బరువులన్నీ దించి పారెయ్యి. అప్పుల వాళ్ళ లెక్కలు చించి పారెయ్యి సంస్థలన్నీ అయినకాడికి అమ్మేసెయ్యి. సబ్సిడీల సంగతి మరిచిపో. గుర్రానికి గుగ్గిళ్ళూ ఉలవలూ కావాల్సినన్ని పెట్టాలంటే పెట్రోల్‌ని నమ్ముకో పన్నులూ సెస్సులూ పెంచెయ్యి అయిన కాడికి అప్పులు చేసెయ్యి. ఇవ్వాల్సిన వోళ్ళకి మొండి చెయ్యి చూపు. లిఫ్టు అడుగుదామంటే నిన్నే మోయ్యని గుర్రం నన్నేం మోస్తుంది నా మొహం' అంటూ బాటసారి ముందుకి చూడకుండా వెనక్కి వెళ్ళిపోయేడు.
బాటసారి చెప్పింది బాగానే వుంది. అవన్నీ అమలు చేసినా గుర్రం పరుగెడ్తుందో లేదో. మాయో మంత్రమో తంత్రమో సాయం వస్తే తప్ప దీన్ని 'టాప్ గేర్'లో పరుగెత్తించలేం అనుంకుంటూ అలా ముందుకు వెళ్ళిన 'రైడర్'కి చెట్టు కింద అరుగు మీద ముక్కు మూసుకుని ఉన్న ఓ బాబా కనిపించేడు. ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి తన గోడు వినిపించాడు. గుర్రానికి మరింత 'హార్స్ పవర్' కావాలని కోరాడు.
బాబా ఓ మంత్రం చదివాడు. గుర్రానికి ముందూ వెనకా కాకుండా మధ్యన మరో రెండు కాళ్ళు మొలిపించాడు. 'నాలుగు కాళ్ళమీద పరుగెత్తలేని గుర్రం ఆరు కాళ్ళ మీద గాలిలో తేలిపోతుంది. ముందు కాళ్ళు ముందుకెళ్తే వెనక్కాళ్ళు ఫాలో అయితయి. మధ్య కాళ్ళు బరువెంతైనా మోసేస్తయి. సుఖంగా కూచోవడానికి కార్పొరేటు జీనూ కళ్ళెం, గుర్రాన్ని అదిరించి బెదిరించి నడిపించడానికి కార్పొరేటు కొరడా కూడా యిస్తాను. జీతే రహౌ బేటా' అంటూ అవిచ్చి ముక్కూ కళ్ళూ మూసుకున్నాడు బాబా.
మామూలు గుర్రం కాదిదియిప్పుడు. ఆరు కాళ్ళ గుర్రం పరుగెత్తడమే కాదు 'ఎగిరినా ఎగరవచ్చు'ననుకున్నాడు తెలివైన వాడు కొరడా చేతపట్టుకుని.
- చింతపట్ల సుదర్శన్,
9299809212