Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా దేశం, నా ప్రజలు- రక్తరేఖ, గొరిల్లా, ఆధునిక మహాభారతం, జనవంశం, రుతు ఘోష, మండే సూర్యుడు, కవిసేన మేనిఫెస్టో, లాంటిరచనలు చేసి సాహిత్య రంగాన్ని ఒక ఊపు ఊపిన ప్రసిద్ధ కవి, విమర్శకుడు శేషేంద్రశర్మ గారి కలంలోంచి 1987లో ఆంధ్రజ్యోతిలో వచ్చిన సీరియల్ నవల కామోత్సవ్. గాంధీ స్మారక సమితి, అశ్లీల ప్రతిఘటన వేదిక లాంటివి ఆనాడు కోర్టుల తలుపు తట్టాయి. సుప్రీంకోర్టు సైతం కేసు తిరస్కరించటం.. ఒక సంచలనం..
ఈ రోజు ఇంటర్నెట్ ద్వారా విశ్వమంతా విశ్వరూపం దాల్చి చిన్న పిల్లల్ని సైతం పెడదారి పట్టించే స్త్రీపురుషుల కామకృత్యాలు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్లో కుప్పతెప్పలుగా వచ్చి పడుతున్నది. నేటికి వేళ 34 ఏళ్ళ కిందట.. ప్రపంచీకరణ పాదం మోపుతున్న వేళ ఈ నవల వచ్చింది. ఈనవలను సమర్థిస్తూ శేషేంద్ర 1994లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇప్పుడు వేరు. చట్టాలు సాధారణ ప్రజలకే గాని ఉన్నత వర్గాలకి వర్తించవు. ఉన్నత వర్గాల్లో వున్న అస్తవ్యస్త సంబంధాలు, సాంఘిక, నైతిక పతనం మీద ఏ బాధ్యతా ఆ వర్గానికి లేకపోవడం ఆ వర్గాలే దేశానికి పాలక వర్గంగా ఉండటం.. వీళ్ళు దేశానికి ప్రమాదకరం అంటారు రచయిత.
ఇక కామోత్సవ్ నవల... రచయిత- తన స్నేహితుడు నర్సింహ ఉగాది శుభాకాంక్షలు చెప్పటం ఇద్దరూ సంభాషించుకొంటూ ఉండటంతో ప్రారంభమవుతుంది. జ్ఞాన్ ఒక పెయింటర్- కవి- అభ్యుదయ భావాలున్న వాడు. అజ్ఞాతంలో ఉంటాడు. భార్యతో బాంబే పారిపోతాడు. కీర్తి తన చెల్లెలు తృష్ణ.. ఆమె భర్త కుబేర్దత్ హౌటల్లో కలుస్తారు. జ్ఞాన్ తన భార్య కీర్తితో విలాసవంతంగా మద్యపానం చేయడం-స్కాచ్ సముద్రంలో ఈదుతారు... సినిమా వాళ్ళు పరిచయం.. పోలీసులు.. జ్ఞాన్కై వెదకడం.. బయట ఎమర్జెన్సీ కాలం గుర్తుకొస్తుంటుంది.. అందమైన స్త్రీలతో జ్ఞాన్ పరిచయాలు.. మరదలు తృష్ణను జ్ఞాన్ అనుభవించడం... తాగి.. డాన్సులు వేయడం.. పార్టీల్లో అల్లర్లు.. శ్వేతతో కలయిక.. భర్త జ్ఞాన్ చేసే శృంగారాన్ని బలపరచడం.. ఇది నవల.. ఉన్నత వర్గాల విచ్చలవిడితనం- తాగుడు- శృంగారం- రేస్ కోర్టులు- హౌటల్స్.. డాన్స్లు.. మధ్యలో ఆంగ్ల కవుల ప్రస్థావనలు.. తాత్త్వికతతో సంభాషణలు.. మెరుపు సూత్రీకరణ.. 30 అధ్యాయాల్లో పుష్కలంగా కనిపిస్తాయి- నవలా లక్షణాలకు దూరంగా.. ఓ అసంపూర్ణ చిత్రంగా (కథ) ఈ నవల సాగింది. ఉన్నత వర్గాలలోని విచ్చలవిడి తనాన్ని విపులంగా చిత్రించిన నవల. నీతులు, న్యాయాలు, క్రమశిక్షణలు అన్నీ కింది వర్గాలకే తప్ప మాకు కావనే ఒక నిరూపణ నవల్లో హైక్లాస్ డిస్ప్లే చేస్తుంది. కోర్టుల్లో జయం కలగవచ్చు- జనంలో చైతన్యం- మార్పుకు దోహదం చెయ్యాలి కదా!! రాజుల కాలంలో శృంగార కావ్యాలొచ్చాయి. ఆధునిక శృంగార కావ్యం కామోత్సవ్. పుస్తకాన్ని రచయిత రాయడు. పుస్తకం రచయిత చేత రాయిస్తుంది. మొత్తంగా ఏ రకమైన సామాజిక ప్రయోజనాన్ని పొందుతుందీ నవల? పునర్ముద్రణతో మళ్ళీ మనముందుకొచ్చింది.
(రచయిత : గుంటూరు శేషేంద్ర శర్మ, పేజీలు : 200, వెల : రూ.200/-, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలో.., సెల్ : 7702964402, 9441070985)
- తంగారాల చక్రవర్తి,
9393804472