Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలచక్రం గిర గిరా తిరుగుతూనే ఉంటుంది. అయితే అది ఎప్పుడూ ఒకే వేగంతో తిరుగుతుందా అంటే తిరగదు. ఒకప్పుడు నెమ్మదిగా కాస్త వేగంగా తిరిగేదేమో కానీ ఇప్పుడు మాత్రం 'టాప్‌గేర్'లో 'టాప్‌స్పీడ్'లో పరుగెడు తున్నదన్న మాట మాత్రం ఖచ్చితంగా నమ్మలేని నిజం కాదు నమ్మి తీరవల్సిన నిజం. అందువల్లనే కదా మనం చూస్తున్న ఈ మార్పులన్నీ. ఇన్ని రకాల మార్పులు ఏ కాలంలోనూ రాలేదు కనుక ఈ జనామాలో కాలచక్రం విల్లువదిలిన బాణంలా పిస్తోలుకు వీడ్కోలు చెప్పిన బుల్లెట్లా పరుగెడుతున్నదనాలి.
'వాపో బలుపో', 'నాశన కాలమో', 'పోయే కాలమో' ఇప్పుడే చెప్పలేం కాని ఈ మార్పులు లోకంలోని సమస్తమైన విషయాల్లోనూ వచ్చి వేలు పెడ్తున్నవి.
ఉదయం కూరగాయలకని వెళ్ళిన భార్య సువర్ణసుందరి సాయంత్రందాకా రాలేదు, దాందో భయపడ్డ భర్తకు ఏం చెయ్యాలో తెలీలేదు. తెల్సిన వాళ్ళకీ చట్టాలకీ ఫోన్లు చేశాడు. ఇరుగుపొరుగు ఇళ్ళల్లో పలికి జొరబడి వెదికాడు. కానీ తనతో ఏడు అడుగులూ వేసిన మనిషి ఆజాపజా లేదు. ఏం చెయ్యాలో పాలూ పెరుగూ కూడా పోలేదు. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళక తప్పదా అనుకున్నాడు.
అప్పుడు వచ్చింది. ఆవిడ కాదు. ఆమె కాదు సువర్ణ సుందరి. వచ్చింది సెల్లులో ఘొల్లు శబ్దం. సందేహం లేదు. ఎవడో ఈ వెర్రి మాలోకాన్ని కిడ్నాప్ చేసేడు. ఎంత డిమాండు చేస్తాడో ఏమోనని భయపడుతూనే ఫోన్‌ని చెవికి ఆనించేడు.
అవతలివాడు మొదట ఆవలించేడు తర్వాత బ్రేవ్‌మని తేన్చేడు. తర్వాత అర్థంపర్థంలేని నవ్వునవ్వేడు. నవ్వాక అరిచేడు.
'నీ పెంకి పెళ్ళాంని వదిలిపెట్టాలంటే రేపు జరగబోయే ఎలెక్షన్లో మా పార్టీకే నువ్వు ఓటు వెయ్యాలి. కాదూ కూడదని మొండికేస్తే అవునూ అవునని మోసం చేస్తే మేం కనిపెడ్తాం. నీ ఓటు మాకు పడితేనే నీ సువర్ణ సుందరిని వొదిలెడతాం' అన్నది ఆ అరుపులు సారాంశం.
కిడ్నాప్ చేసిన వాడు వేలూ, లక్షలూ డబ్బుతే అంటాడు కానీ ఈ వింత ఏమిటి ఓటు అడుగుతున్నాడు అని గోడకు తల బాదుకున్నాడు సుందర్రావను సువర్ణ సుందరి మొగుడు వోటర్ల లిస్టులో ఆమె ఓటు గల్లంతయిపోయి తన ఓటు బతికి ఉండడం వల్ల ఇలా మూడిందనుకున్నాడు.
స్కూల్‌కు వెళ్ళిన బుజ్జిగాడు ఇంటికి రాలేదు. వాణ్ణి ఐ.ఐ.టి. ఇంజనీర్‌ను చేద్దామని కాచుక్కూచున్న తల్లీదండ్రికీ ఏమీ తోచలేదు. టీవీ చూడ్డం మానేసి ఇంటి ముందు అరుగు మీద కూచున్నారు బెంగపడుతూజ అప్పుడు వచ్చింది ఫోను. ఆవలింతా, త్రేన్పూ, నవ్వూ అయ్యాక అరుపులు వినపడ్డయి.
'నీ కాబోయే ఐఐటి ఇంజనీరు కొడుకుని వదిలి పెట్టాలంటే రేపు జరగబోయే ఎలెక్షన్లో మా పార్టీకే నువ్వు ఓటు వెయ్యాలి మీ ఆవిడకూ ఓటుంది అది కూడా మా పార్టీకే పడితీరాలి. మొండికేస్తే మోసం చేస్తే మీ బుజ్జిగాడు ఇంజనీరు కాదు కాంట్రాక్లు ఉద్యోగి కూడా అవలేడు ఒక వేళ బతికి పిజ్జాలూ బర్గర్లూ తింటే' అని ఆ అరుపులు సారాంశం.
అత్తామామా కనపడకపోతే ఇంకో కొడుకు ఇంటికి వెళ్ళుంటారు పీడా వదిలింది అనుకుంది కోడలు. తమ్ముడింటికే వెళ్ళారా లేక ఇక్కడ ఉండలేక ఏ చెట్టో చోరువో చూసుకోలేదు కదా అని భయపడ్డాడు కొడుకు.
అప్పుడొచ్చింది.. వాళ్ళ కాదు ఫోను. ఆవులింతా త్రేన్పూ నవ్వూ అయ్యాక వినపడ్డవి అరుపులు. రేపు జరగనున్న ఎలెక్షన్లో మా పార్టీకే మీరిద్దరూ ఓటు వెయ్యాలి. మీ ముసలి తల్లీ తండ్రీ పోయిన ఎలెక్షన్లకి పోలింగ్ బూత్‌కి రాలేదు ఓటు వెయ్యలేదు అందుకే ఎత్తుకొచ్చాం. రేపు వాళ్ళ చేత కూడా మా పార్టీకే ఓటు వేయించుకుని అప్పుడు వదుల్తాం' అని ఆ అరుపుల సారాంశం.
ఒకప్పుడు ఎలెక్షన్లు వచ్చినయంటే ఇంటికి వచ్చి బొట్టు పెట్టి గడ్డం పట్టుకుని ఓటు వెయ్యమని బతిమాలేవారు, ఆ రోజులు పోయినయి అనుకున్నాడు సుందర్రావు. అసలీ కొత్త వింతేమిటి ఓట్లు వెయ్యండని బెదిరిస్తున్నారు కిడ్పాపులంటున్నారు అని వాపోయేరు బుజ్జిగాడి పేరెంట్సు, ముసలి పేరెంట్సు కొడుకూ కొడలూ!
వరుసగా మనుషుల్ని స్తంభాలకి కట్టేసి బెల్టులతో బాదుతు న్నారు కార్యకర్తలు. మీరంతా మా పార్టీకే ఓటు వెయ్యాలి. వేస్తారా ఛస్తారా అని అరుస్తున్నారు కొందరు. 'మా ఓటు మీ పార్టీకే మీ పార్టీకే మా ఓటు' అని మొత్తుకున్న వాళ్ళని కట్టు విప్పదీసి వాళ్ళ అమ్మల మీదా అమ్మమ్మల మీదా ఓట్లు వేయించుకుంటున్నారు మరికొందరు కార్యకర్తలు.
'ప్రతి ఐదేళ్ళకీ ఎలెక్షన్లు వస్తయి. ఏదో ఒక పార్టీ గెలుస్తుంది. గెలిచిన పార్టీ ప్రభుత్వం అవుతుంది. ఇప్పుడు మా పార్టీనే ప్రభుత్వం మళ్ళీ దాకా బై ఎలక్షన్లు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయితీ ఎన్నికలు కానీ పట్టభద్రుల ఎన్నికలు కానీ మాకు ఓటేస్తేనే చెల్లుబాటవుతుంది. మిగతా పార్టీలకు వేస్తే అవి మురిగిపోతయి. ఏం చెయ్యాలన్నా మేమే కదా అందుచేతన్ చేన్ మెడకు పడ్డపాము కరవక మానదు కనక మాకే మీ ఓటు వేసి తీరాలి' అని బెదిరించసాగాడు ఓ నాయకుడు మైకులో.
కాలచక్రం ముందుకు తిరుగుతున్నదో వెనక్కి తిరుగుతున్నదో అర్థంకానంత వేగం పుంజుకుంది. సామదాన బేధాల కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా దండోపాయమే!!
- చింతపట్ల సుదర్శన్,
9299809212