Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సన్నిహితుడు దొరికితే...
ఈ వారం కవర్ స్టోరీ ''సాన్నిహిత్యం'' అద్భుతంగా ఉంది. అవును ఇది అక్షరాల నిజం. మనల్ని ప్రేమించడానికి, గౌరవించడానికి ఒక తోడుకావాలి. కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు నీకున్న ఐశ్వర్యం పనికి రాదని అదే ఒక సన్నిహితుడు కాని భాగస్వామి కాని ఉన్నట్లయితే వారితో మన బాధను చెప్పుకుంటే మన మనసుకు చాల ప్రశాంతంగా ఉంటుందని చెప్పిన సంగతులు వాస్తవాలు. మన రహస్య విషయాలను ఎవరికైతే చెప్పగలమో వారే మన మనసుకు నచ్చిన సన్నిహితులు అని నేను కూడా భావిస్తున్నాను. నేటి యువతరానికి ఈ స్టోరి చాల ఉపయోగపడుతుంది.
- మమత (జర్నలిస్టు), వరంగల్
ధైర్యాన్నిచ్చే స్నేహం
ఈవారం 'సోపతి'లో వచ్చిన కవర్ స్టోరీ 'సాన్నిహిత్యం' ఫ్రెండ్స్‌ని సంపాదించుకునే మార్గాన్ని తెలియజేసింది. స్నేహం అనేది అందరితో చేయలేం ఎందుకంటే అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. చాలామంది ''నాతో మాట్లాడొచ్చు కదా, ఫోన్ చేయొచ్చుకదా అంటారు'' కాని వారిని పట్టించుకోలేం. మన ఆలోచనలకు దగ్గరగా ఉన్నవారినే స్నేహితులుగా ఎంచుకుంటాం. వారితోనే అన్ని విషయాలు మాట్లాడుతుంటాం. అన్ని విషయాలు అర్థంచేసుకునే మంచి ఫ్రెండ్ దొరికితే ఆ ధైర్యమే వేరు. ఎందుకంటే ఆ బాధలను మరపించే ఓదార్పు వారిదగ్గర దొరుకుతుంది కనుక. ఇంట్లో, బయట పేరుకి ఎంతమంది స్నేహితులు ఉన్నా... మనతో సాన్నిహిత్యంగా ఉన్నవారు ఒక్కరు ఉన్న చాలు. మనల్ని ఆదుకునేవారు, అనునయించేవారు ఒక్కరున్నారనే ఆలోచనే మనకు కొండంత ధైర్యాన్నిస్తుంది.
- సంధ్య, హైదరాబాదు
అంతరంగాన్ని తాకింది
'అంతరంగం'లో రాసిన 'వినూత్న జీవితం' బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు సినిమాలు, టీవీలు, సెల్ఫోన్లు అంటూ ఒక మత్తులో మునిగినట్టు వాటికే పరిమితం అవుతున్నారు. అవి లేకుండా తోటి వ్యక్తులతో మెరుగైన సంబంధాలు కొనసాగించవచ్చు. కానీ అవి లేకుండా బతకలేమన్నతంగా ఇమిడిపోతున్నారు. చాలా విషయాలు పుస్తకాలు చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. మనకు నచ్చిన వ్యక్తులకు ఉత్తరాలు రాయడం కూడా అద్భుతంగా అనిపిస్తుంది. కొన్నేండ్ల తర్వాత వాటిని తిరిగి చూస్తే కలిగే ఆనందమే వేరు. టీవీలు, సినిమాలకు అంకితం కాకుండా అప్పుడప్పుడు మిత్రులతో, కుటుంబ సభ్యులతో గడపడం వల్ల కోల్పోయే సంతోషాన్ని తిరిగి పొందవచ్చు. మొత్తం మీద ఈ సంపాదకీయ వ్యాఖ్య నా అంతరంగాన్ని తాకింది.
- కె.అవినాష్, హైదరాబాదు