Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్టోబర్ విప్లవానికి వందేళ్ళవుతున్న సందర్భమిది. అలనాడు బొల్షివిక్ పార్టీ పోరాట గమనాన్ని తెలుసుకోవాలనుకోడం సర్వసాధారణం. వందేళ్ళ కిందటి ఉద్యమక్రమాన్ని, విప్లవాల ఉధృతిని అర్థం చేసుకోడానికి ఉపకరించే పుస్తకం 'బోల్షివిక్ పార్టీ సంగ్రహ చరిత్ర'. 1938లో సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ ఆమోదించి, ప్రచురణకు అనుమతించిన చరిత్ర ఇది. అందుకని ఇది సాధికారికమైన పుస్తకం. ఎలాంటి వక్రీకరణలకు తావుండదని నమ్మవచ్చు. ఆనాడు ఎంతో అధ్యయనం చేసి, నాటి ఉద్యమ ఘటనల్ని రికార్డు చేసినందున ఈ పుస్తకానికి విశ్వసనీయత వుంది. కనుకనే నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ప్రచురించింది. వందేళ్ళ కిందటి రష్యా గురించి తెలుసుకోడానికి, ఉద్యమాల వెల్లువను అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
ఈ పుస్తకంలో మొత్తం పన్నెండు అధ్యాయాలున్నాయి. అర్ధబానిస విధానం అమలులో ఉన్న నాటి రష్యాలోని పరిస్థితుల్ని, కార్మికవర్గం పుట్టుకను, పెట్టుబడిదారీ విధాన అభివృద్ధిక్రమాన్ని వివరిస్తూ మొదటి అధ్యాయం ఆరంభమవుతుంది. 1883-1901 వరకు రష్యాలో సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ నిర్మాణం కోసం సాగించిన పోరాటాన్ని ఆసక్తికరంగా వివరిస్తుంది. లెనిన్ విప్లవ కార్యకలాపాల కేంద్రంగా వర్థిల్లిన 'సెంట్ పీటర్స్బర్గ్' గురించి చెబుతుంది.
రెండో అధ్యాయంలో పార్టీ నిర్మాణానికి లెనిన్ పథకం, ఆర్థికవాదుల అవకాశవాదం మొదలయిన అంశాలు చర్చించారు. మూడవ అధ్యాయంలో రష్యా ప్రథమ విప్లవం(1904-1907) గురించి వివరించింది. ఈ కాలంలో మెన్షివిక్కులకీ, బోల్షివిక్కులకీ గల సైద్ధాంతిక విభేదాలని విపులంగా విశ్లేషించింది. జార్ప్రభుత్వ తిరోగమనం, కార్మికుల తిరుగుబాట్లకు సంబంధించిన అంశాలనేకం ప్రస్తావనకు వచ్చాయి. నాలుగో అధ్యాయంలో ట్రాట్స్కీజానికి వ్యతిరేకంగా బోల్షివిక్కుల పోరాటం, స్వతంత్ర పార్టీగా అవతరించడానికి సంబంధించిన పలు సంఘటనల పరిణామక్రమం గురించి రికార్డు చేశారు. అయిదు, ఆరు అధ్యాయాలు చాలా కీలకమైనవి. మొదటి ప్రపంచయుద్ధానికి ముందు రష్యాలో వెల్లువెత్తిన కార్మికవర్గ ఉద్యమాలు, యుద్ద కాలంలో బోల్షివిక్ పార్టీ ఆధ్వరంలో ఉప్పొంగిన రెండో విప్లవానికి సంబంధించిన చరిత్రని ఈ రెండు అధ్యాయాల్లో వివరంగా తెలుసుకోవచ్చు. జార్ సైన్యాల ఓటమి, జార్ ప్రభుత్వ పతనం ఎలా జరిగిందో తెలుస్తుంది ఈ అధ్యాయాలు చదివితే.
అక్టోబర్ విప్లవ సన్నాహ కాలంలో బోల్షివిక్ పార్టీ నిర్వహించిన మహత్తర పాత్రని ఏడో అధ్యాయం విశదీకరించింది. ఎనిమిదో అధ్యాయంలో అంతర్యుద్ధ కాలంలో, విదేశీ సైనిక దురాక్రమణ కాలంలో బోల్షివిక్ పార్టీ పోషించిన వీరోచితపాత్ర గురించి తెలుసుకోవచ్చు. విప్లవ ప్రతీఘాతశక్తుల్ని నిలువరిస్తూ బోల్షివిక్ పార్టీ సాధించిన విజయపరంపరని విపులీకరించే అధ్యాయమిది. విప్లవానంతర పరిస్థితులలో సోవియట్ రష్యా రిపబ్లిక్‌గా అవతరించి ఆర్థిక, సామాజిక రంగాల్లో సాధించిన పురోగతిని, సోషలిస్టు సమాజ నిర్మాణం కోసం తీసుకున్న చర్యల్ని తర్వాతి అధ్యాయాలు వివరిస్తాయి. వందేళ్ళ కిందటి అక్టోబర్ విప్లవ చరిత్రనీ, దాని ప్రాధాన్యాన్నీ, ప్రాసంగికతనీ తెలియజేసే ఆసక్తికరమైన పుస్తకమిది. అక్టోబర్ విప్లవ శత వార్షికోత్సవం జరుపుకునే వేళ ఈ పుస్తకం చదవడం అవసరం.
- అశోక్‌కుమార్, 97000 00948