Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారసత్వ సంపద పట్టదు
ఈ వారం కవర్ స్టోరీ 'చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకం' సింప్లీ సూపర్. చాలా సమాచారం ఈ వ్యాసం ద్వారా తెలుసుకున్నాం. హిందు మతతత్వవాదులకు రాజకీయాలే ముఖ్యం కాని దేశ చారిత్రక, వారసత్వ సంపద ముఖ్యం కాదని అర్థమవుతున్నది. ఇటువంటి వ్యాసాలు మరిన్ని కోరుకుంటూ...
- ఆర్.హనుమంతరావు, జహీర్, హసీనా; హైదరాబాదు
తాజ్ ఒడిలో ఆడుకున్నాను
మీరు తాజ్ మహల్‌పై ఈవారం ప్రచురించిన వ్యాసం నాకెంతో నచ్చింది. ఒక్కసారి కాదు మూడు సార్లు దాన్ని చదివాను. ఉపయోగించిన భాష, రాసిన విధానం అద్భుతం. ఇన్ని సార్లు చదవడానికి కారణం ఉంది. మీరు వ్యాసంలో పేర్కొన్న తాజ్ అందాలు చదువుతుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. 83 ఏండ్ల వయసులో ఎప్పుడో మానాన్న, అమ్మ, తమ్మునితో కలిసి తరచూ సందర్శించిన తాజ్ అందాలు కళ్ల ముందు మెదులుతున్నాయి. మా నాన్న ఉద్యోగ రిత్యా నా చిన్నతనంలో తాజ్ మహల్‌కి దగ్గరగా (సుమారు పదిమైళ్ల దూరంలో) ఉన్న దయాలాబాద్ అనే ఊళ్లో ఉండేవాళ్లం.సెలవు దినాల్లో మా నాన్న తాజ్ మహల్‌కి అడ్డదారి (దగ్గర మార్గం)లో నడుచుకుంటూ మమ్మల్ని తీసుకువెళ్ళేవాడు. అట్లా ఎన్ని సార్లు వెళ్ళామో లెక్కే లేదు. నాకు నిజానికి తాజ్ అందాలను ఆస్వాదించే వయసు లేనందున అప్పుడు అంతగా ఆస్వాదించలేకపోయాను. ఇప్పుడు మీరు ప్రచురించిన వ్యాసం చూస్తుంటే... ఔరా.. ఇంత అద్భుత కట్టడం ఒడిలో ఎన్నో సార్లు ఆడుకున్నాను కదా అనిపిస్తున్నది.
- ఆలూరి జగన్మోహిని, మెహిదీపట్నం; హైదరాబాదు
అభినందనలు
వృత్తి రిత్యా జర్నలిస్టునైన నేను అప్పుడప్పుడూ కళాకారుల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను. ఒకసారి తెలుగు విశ్వవిద్యాలయం ఆర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కొందరు విద్యార్థులు, అధ్యాపకులను ఇటర్వ్యూచేసే సందర్భంలో వారు ఒక ఇబ్బందిని నా దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాదులో వందల సంఖ్యలో ఫైన్ఆర్ట్స్ విద్యార్థులు ఉన్నారు. వారికి కాలేజి/ యూనివర్సిటీ బయట ప్రాక్టీస్ చేసుకునే అవకాశం లేకుండా ఉంది. ఏదైనా ప్రయివేటు స్టూడియో ఉండి ఈ అవకాశం కల్పిస్తే ఎంత బాగుండో కదా అనేది వారి ఆవేదన. మరి వారికి చిప్ప సుధాకర్ స్థాపించిన 'బానియాన్ హార్ట్స్' స్టూడియో తెలియదేమో! నాకూ మీరు ప్రచురించిన 'సృజనాత్మక కళాప్రపంచం' చదివే వరకు ఎవరికైనా ప్రవేశం ఉన్న ఈ స్టూడియో సంగతి తెలియదు. ఇంత మంచి వ్యాసం ద్వారా కళాకారులకు మంచి సమాచారాన్ని అందించినందుకు అభినందనలు.
- శివ, హైదరాబాదు