Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాతకాలంలో రాజుల్ని రాజులనే అనేవారు కానీ ఈ కాలంలో రాజుల్ని రాజులనకుండా మంత్రులని పిలుచుకుంటున్నాం అంతే తేడా! రాజు తల్చుకుంటే వరాలూ దెబ్బలూ! మంత్రి తల్చుకుంటే కూడా అంతే మరి!
రాజులైతేనేం మంత్రులయితేనేం ఎప్పుడు ఎవర్ని ఎందుకు ఆకాశానికెత్తుతారో ఎందుకు వరాలు గుప్పిస్తారో ఎవరికెరుక వాళ్ళ రీజనింగు, అండర్ స్టాండింగూ, సీక్రెట్ అజెండా బహుముందుచూపూ దీర్ఘ దర్శనమూ అంత వీజీగా ఓట్లు వేసే మామూలు జనానికి అర్థం కావు గాక కానేకావు.
పాతకాలం రాజులను ప్రస్తావించడం జరిగింది కనక ఓ రాజావారి కథ గుర్తుచేసుకుందాం.
రాజావారు పొద్దున్నే బాల్కనీలో నుంచుని అలాగ వీధిలో వచ్చేపోయే జనం వంక చూస్తున్నారు. సడన్‌గా ఆయన దృష్టి సెక్యూరిటీలు లేని ఇనపగేటు మీద పడింది. ఈ పని దొంగలు ఎక్కడ్రా అనుకునే లోపునే ఎవడో ఒకడు అటువేపు నించి గేట్‌కి ఆనుకుని ఏదో చేస్తున్నాడు.
రాజావారు సులోచనాలు తెప్పించుకుని పరీక్షగా చూసి తేల్చుకున్నారు. తమ ప్యాలెస్ గేట్‌కి వీపు ఆనించి నిలబడ్డవాడు 'కోన్‌కిస్కా గొట్టం' గాడని, వాడలా ఊరికే గేట్‌కి వీపు ఆనించి నిలబళ్ళేదని, తన వీపుని గేటుకేసి అదేపనిగా పైకీ కిందకీ ఈ పక్కకీ ఆ పక్కకీ రాస్తున్నాడని అర్థం చేసుకున్నారు.
రాజుగారు చప్పట్లు చరిచారు. భటులు హుటాహుటిన పరుగెత్తేరు. గేట్‌కి వీపురాసుకుంటున్నవాడ్ని పెడరెక్కలు విరిచి పట్టుకొచ్చి రాజుగారి ముందు పడేసేరు.
వాడ్ని ఏకీలుకాకీలు విరిచేయించుదామనుకున్న రాజాగారికి తన తాతల కాలం గుర్తుకువచ్చింది. ఆకాలంలో తమ దివాణంలో పనిచేసిన ముసలాయన గుర్తుకొచ్చేడు. జాలీ, దయా ఎగురుకుంటూ వచ్చి ఆయన రెండు భుజాల మీదా నిలబడ్డయి. క్షణం పట్టదు రాజుల 'మూడ్' మారిపోడానికి.
'ఏరా! ఎందుకు గేట్‌కు ఆనుకుని నిలబడ్డావు?' అనడిగాడు రాజు వీలైనంత మెత్తగా, ప్రేమగా, లాలింపుగా, బుజ్జగింపుగా అవతలివాడి చెవికింపుగా.
రాజావారి గొంతులోని తియ్యదనం వల్ల అప్పటిదాకా వణుకుతున్నవాడు స్టడీగా నిలబడి 'ఏం చెప్పను మారాజా! దురద.. ఒకటే దురద. దురదయ్యా దురద... దురద బాధ భరించలేక తమరి ప్యాలెస్ గేటుకేసి రుద్దుకుంటున్నానంతే! మా రాజులు దయ చూపాలి' అన్నాడు వాడు దగ్గర్లో ఏదైనా గోడ ఉందేమో గోక్కోడానికని కళ్ళతో వెదుక్కుంటూ.
'దురదా... వీపు గోక్కుంటున్నావా?' నవ్వాడు రాజు. భటుల వైపు తిరిగాడు రాజు. 'ఒరేరు... వీడ్ని బాత్రూంలోకి తీసుకువెళ్ళి మళ్ళీ దురద రాకుండా వీపుకి సబ్బు అరగదీయండి. ఆ తర్వాత కొత్త డ్రస్సు వెయ్యిండి... పాతది తగలెయ్యండి మళ్ళీ దురద రాకుండా. పొండి' అన్నాడు.
శుబ్భరంగా స్నానం చేయించుకుని కొత్త డ్రస్సు వేసుకు వచ్చిన వాడికి ఓ వంద నాణాలు బహుమానంగా ఇచ్చాడు. వరాలిచ్చే రాజులూ మంత్రులూ ఇలాగ ఇచ్చేస్తారు. ఎందుకు ఏమిటి అనడుగుతారా ఎవరైనా? దురదకు వందా? అని ప్రశ్నిస్తారా ఎవరన్నా? నహీ!
రాజావారు ఒకానొకడు దురదకోసం గేట్‌కి వీపురాసుకుంటం రుద్దుకోటం చేస్తుంటే వందిచ్చాడని షవర్‌బాత్ చేయించాడని కొత్త బట్టలు వేయించాడని బ్రేకింగ్ న్యూస్, ఎన్సూరెన్స్ చేయించుకున్న బట్టల షాప్‌వాడు తగలబెడితే తగలబడ్డ షాప్ మంటలా ఊరంతా వ్యాపించింది. ఎడాపెడా చెడామడా వరాలిస్తున్నార్రాజావారని అడిగిన వాడికి లేదనడని అడగనివాడిదే మహా పాపమని ఇళ్ళు కట్టిస్తున్నాడని, చీరలు కొనిస్తున్నాడని, భవనాలు కట్టిస్తున్నాడు, పెళ్ళిళ్ళూ పేరంటాలూ చేయిస్తున్నాడని వాడవాడా తెల్సిపోయింది.
ఇదివరకు మల్లేనే, మరోనాడు రాజావారు బాల్కనీలో నించుని చూస్తుంటే ఎవరో ఇద్దరు చెరో గేటు రెక్కకీ రుద్దుకుంటూ కన్పించారు వీపులు. రాజావారు చప్పట్లు కొడదామనుకుంటుండగానే పరుగెత్తి భటులు ఆ ఇద్దర్నీ సగౌరవంగా రాజావారి సముఖానికి తెచ్చారు.
వాళ్ళిద్దర్నీ చూసిన రాజావారికి వాళ్ళ ముఖాలు అస్సలు నచ్చలేదు. అదంతే! ముఖాలు చూసిన వేళావిశేషమన్నమాట. చిరాకూ కోపమూ ఎగురుకుంటూ వచ్చి ఆయన రెండు భుజాల మీదా నిలబడ్డయి. క్షణం పట్టదు రాజులకూ మంత్రులకూ 'మూడ్' మారడానికి.
'ఎందుకురా గేట్‌కు ఆనుకుని నిలబడ్డారు?' అని కసిరారు. 'ఏం చెప్పం మహారాజా! దురద! ఒకటే దురద. దురదయ్యా దురద.. దురద బాధ భరించలేక తమరి ప్యాలెస్ గేట్కేసి రుద్దుకుంటున్నాం అంతే!' అన్నారు వాళ్ళు స్నానానికి రడీ అయిపోతూ.
భటులు సబ్బూ టవల్‌తో రడీగా ఉన్నారు. రాజా వారు మాత్రం 'వీళ్ళిద్దరికీ చెరో యాభయి కొరడా దెబ్బలు తగిలించి తరిమెయ్యండి' అన్నాడు కటువుగా.
దెబ్బలు తిని లబోదిబోమంటూ వెళ్ళిపోనున్న వాళ్ళలో ఒక్కడు మాత్రం ధైర్యం చేసి 'ఇది .... మారాజా! ప్రజలందరూ సమానమే కదా. ఇది వరకు వీపు గోక్కున్న వాడికి బహుమానం, మాకు దండనా?' అన్నాడు... రాజులకీ మంత్రులకీ వాళ్ళు చేసే పనులకు లాజిక్కులుంటాయని తెలీక...
'ఎదవలూ! వాడు ఒక్కడు... తన వీపు తాను గోక్కోలేడు. అందువల్ల బహుమానం. మీరిద్దర్రా! నీ వీపు వాడూ వాడి వీపు నువ్వూ గోక్కోవచ్చుగా! నా గేటే కావాలా. పైగా బహుమానం కావాలా' అని హుంకరించాడు రాజు. ఇంకా వుంటే మళ్ళీ దెబ్బలు పడతాయని దురద లేకున్నా గోక్కోవడానికి వచ్చినవాళ్ళు పారిపోయారు.
రీజనింగూ, అండర్స్టాండింగు, సీక్రెట్ అజెండా, ముందుచూపూ ఉండే రాజులూ మంత్రులూ ఎప్పుడు ఎవర్ని ఎందుకు ఆకాశానికెత్తుతారో ఎందుకు వరాలు గుప్పిస్తారో ఎవరికెరుక పోనీ మీరు చెప్పండి మీకు ఎరుకా?
- చింతపట్ల సుదర్శన్, 9299809212