Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్రకారులైనా, సాహిత్య కారులైనా కళాకారుల ఆలోచనా రీతిలో వారి ఆత్మశోధనతో పాటూ, తత్వశోధన కూడా ఉంటుంది. ప్రాపంచిక విషయ జ్ఞానము, స్థూల సూక్ష్మజ్ఞానము, జనన మరణాల రహస్యాలు వారికి ఎన్నోసార్లు ఎదురవుతాయి. వారిని తత్వవేత్తలుగా మారుస్తాయి. అందుకే ఫిలాసఫీ, మనస్తత్వశాస్త్రం (సైకాలజీ) వారికి తమ కళల రహదారి నేర్పే ముఖ్యపాఠాలు. కానీ సైకాలజీ చదువుకుని ఆ తత్వశాస్త్రానికి, కళల్లో అర్థం వెతుక్కుంది సీమా కోహిలీ. 1960లో జన్మించిన సీమా ఢిల్లీ వాస్తవ్యురాలు. 1981లో ఢిల్లీలో సైకాలజీలో బి.ఎ. (హానర్స్) పట్టా పొంది, ఆపై ఐ.టి.ఐ.లో అప్లైడ్ ఆర్ట్స్‌లో చేరింది. ఇట్లా ప్రారంభమైన సీమా కళాయాత్ర ఒక కొత్త శైలిని సృష్టించింది.
చిత్రాలు, శిల్పాలు, ఇన్‌స్టాలేషన్స్, పర్ఫామెన్స్, మురల్స్, కవితలు... ఇలా రకరకాలుగా తన భావాలను వ్యక్తపరుస్తుంది. ఆమె చిత్రాలు స్త్రీవాదానికి సంబంధించిన ఆలోచనలు అనేకన్నా స్త్రీలోని శక్తికి, భావాలకు సంబంధించినవి అనవచ్చు. సీమా చిత్రాలు, శిల్పాలు ఏవో మనసులోని జ్ఞాపకాలను వ్యక్తపరచటమే కాక, మరెన్నో నిగూఢ అర్థాలనూ తెలియజేస్తాయి. ఉదాహరణకి ఒక వృషభం శిల్పం కానీ, ఒక చిత్రంలోని ఆకారాన్ని గానీ పరికించి చూస్తే, ఎదురుగా కనిపించే ఆకారం ఒకటైతే, ఆ ఆకారంలో పొందుపరిచిన మరెన్నో చిట్టి ఆకారాలు, డిజైన్లు మరిన్ని కథలు చెబుతాయి. అవి పురాణేతిహాసాలు కావచ్చు, నాటి - నేటి చరిత్ర కథలు కావచ్చు. ప్రాపంచిక విషయాలు లేదా ఆ ప్రాపంచిక ఆలోచనల మేధకందని భావాలూ కావచ్చు. వీటన్నింటి మధ్య కాలాతీతం అనే వ్యత్యాసం ఉంది. నాటి నేటి చరిత్రలు కాలంతో గణించవచ్చు. కానీ పురాణ ప్రమాణాలు, ఆ ప్రాపంచిక సత్యాలు, కాలాతీతాలు. ఈ జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఎన్నో మజిలీల కథలు ఆమె చిత్రాలు, శిల్పాలు. అన్నింటినీ మించి ఆమె కళారూపాలు అందమైన ఆహ్లాదకర ఆకారాలు. స్త్రీ పురుష భేదం ఇదమిద్ధంగా తెలపని రేఖామయాలు. తెలిసినట్టే అనిపించినా అంతం, అర్థం కాని దీర్ఘ సమాసాలు.
'గోల్డెన్ ఊంబ్' అనే సిరీస్ ద్వారా స్త్రీ పురుషులిరువురు సృష్టికి మరో జీవి ఈ లోకంలోని రావడానికి సమాన బాధ్యులనే విషయాన్ని ఒక్కాణించింది. తన చిత్రాలు సీమకి ఒక మెడిటేషన్, ఒక హుందా. సొగసుతో కూడిన ఆమె చిత్రాలు నిశ్శబ్దంలో మాట్లాడే రహస్యాలు. ఆమె కవితలు రాసినా తను కవయిత్రిని కానంటుంది. అందమైన రంగుల్లో ఆమె చిత్రాలు ఆమె అత:కరణ రూపాలని ఇట్టే పట్టేయవచ్చు. అవి సామాజిక సందేశాలు కాదు. ఎన్నో చిత్ర ప్రదర్శనలు దేశ విదేశాల్లో చేసిన ఈమె, ఎన్నో అవార్డులూ అందుకుంది. ఫ్లోరిడాలో గోల్డ్ మెడల్ అందుకుంది. లలిత కళా అకాడమీ వారి లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు అందుకుంది. ఎన్నో మ్యూజియంలలో ఆమె చిత్రాలు పొందుపరిచారు. అందులో కొన్ని రూబి మ్యూజియం, కొచ్చి మ్యూజియం వంటివి ముఖ్యమైనవి.
- డా||ఎం.బాలామణి, 81067 13356