Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితంలో మన ఆలోచనల ప్రకారం పని చేసుకుంటూ ముందుకు వెళతాం. అయితే మనసు కుదురుగా ఒక్క దగ్గర ఉండనివ్వదు. ప్రతి రోజూ ఎన్నో ఆలోచనలు వస్తాయి. వాటన్నింటిని ఆచరణలో పెట్టలేం. ఆచరాణాత్మక ఆలోచనలను మాత్రమే చేయాలి. కొన్ని సందర్భాల్లో తప్పులు చేయవచ్చు. మనం చేస్తున్నదే కరెక్టు అని భావిస్తాం. కానీ ఎదుటి వ్యక్తులు ఎత్తిచూపేదాకా చేస్తున్న పొరపాట్లు, తప్పులు మనకు తెలియవు. మీరు తప్పు చేస్తున్నారని ఎవరైనా విమర్శిస్తే, ఆ విమర్శను సహృదయంతో స్వీకరించాలి. నా మంచి కోసమే చెబుతున్నారని భావించాలి. తెలియకుండా చేస్తున్న పొరపాట్లను సరిదిద్దుకోవాలి. ఇలా చేయడం ద్వారానే వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. జీవితంలో మరింత వికాసం పొందేందుకు దోహదం చేస్తుంది.
అయితే చాలా మంది విమర్శలు చేసే వారి పట్ల వ్యతిరేక భావాన్ని ప్రదర్శిస్తారు. వారిని కోపంగా చూస్తారు. 'నన్నే విమర్శిస్తారా? నా స్థాయి ఏమిటి? అని గొప్పకు పోతారు. విమర్శలు చేసే వారి పట్ల శతృత్వాన్ని పెంచుకుంటారు. తాము చేస్తున్నదే కరెక్టు అని 'మూర్ఖపు' భావనంలో ఉంటారు. ఆ 'ఇగో' అనే విషవలయం నుంచి బయట పడాలి. పుట్టుకతో ఎవరూ ఏ విషయంలోనూ నిష్ణాతులు కారు. జీవితంలో పడిలేస్తూ, గాయాల పాలవుతూ, వాటిని మాన్పుకుంటూ అనేక విషయాలు నేర్చుకుంటాం. కష్టాల కొలిమిలో రాటు దేలుతాం. జ్ఞానానికి మెరుగులు దిద్దుకుంటాం. అలాగే విమర్శలను స్పోర్టివ్‌గా తీసుకుని తప్పులను సరిదిద్దుకోవాలి. ఆత్మవిమర్శ చేసుకోవాలి.
విమర్శ, ఆత్మవిమర్శ అనే పద్ధతిని అనుసరించడం ద్వారా మనం మెరుగైన జీవితాన్ని సాగించగలం. ఉదాహరణకు కొంత మంది రాజకీయ నాయకులు విమర్శలను అసలు సహించలేరు. విమర్శలు చేస్తున్న వారి పట్ల నిర్దయగా వ్యవరిస్తారు. వారిపై ఎదురు దాడికి దిగుతారు. వారిని కించపరుస్తారు. కానీ తాము చేస్తున్న తప్పులను, నిర్ణయాలను మార్చుకోరు. ప్రతిపక్షాలు చేసే విమర్శల్లో మంచి విషయాలను స్వీకరించే విశాల హృదయాన్ని పాలకులు అలవర్చుకోవాలి. ఆ మాటకొస్తే విమర్శ, ఆత్మ విమర్శ అనేది సమాజంలో అందరికీ వర్తిస్తుంది. ఈ పద్ధతి జీవితాలను మెరుగు పర్చుకునేందుకు ఎంతో ఉపయోగకరం.
చాలా మంది సంవత్సరాంతంలో ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఇది మంచిదే. పని పద్ధతులను మెరుగు పర్చుకునేందుకు ఇది దోహదపడుతుంది. అంతేగాకా ఈ సంవత్సరంలో పూర్తి చేయలేని అంశాలను మరుసటి సంవత్సరం పూర్తి చేసేందుకు అవకాశముంటుంది. ఆత్మ విమర్శ చేసుకున్న అంశాలను రాసుకోవాలి. నూతన సంవత్సరంలో చేయబోయే పనుల జాబితాను కూడా సిద్ధం చేసుకోవాలి. అయితే ఆత్మపరిశీలన, పెండింగ్ పనుల సమీక్ష అనేది ఎవరికి వారుగా నిజాయితీగా చేసుకోవాలి. జీవితం నిరంతర ప్రవాహం వంటింది. గడిచిన కాలం తిరిగి రాదు. జీవితంలో ప్రతి క్షణం, ప్రతి నిమిషం ముఖ్యమైనదే. జీవితంలో దేన్నైనా సంపాదించుకోగలం కాని గడిచిన కాలాన్ని తిరిగి సంపాదించుకోలేం.
పనులను సమీక్ష చేసుకోవడంలో ఆలస్యం కూడదు. ఆత్మ పరిశీలన సందర్భంలో తప్ప ఒక వ్యక్తి తన లోపాలను మరే సందర్భంలోనూ గుర్తించలేడు. ఆత్మ పరిశీలనకు సున్నితమైన పద్ధతి అనుసరిస్తే అది ఆ వ్యక్తిని బలవంతున్ని చేస్తుంది. తమను తాము అభివృద్ధి చేసుకునేందుకు ఎలాంటి మెలకువలు, ఎలాంటి సూత్రాలు అనుసరించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఆత్మపరిశీలనలో వెలుపలికి వస్తాయి. ఆత్మ పరిశీలనలో ఒక వ్యక్తిలో నిగూఢంగా ఉన్న ప్రతిభ గుర్తించబడుతుంది. మానవుని వ్యక్తిత్వంలో భావావేశంతో కూడిన తమను తాము అంచనా వేసుకునే విధానం చాలా ముఖ్యమైనదని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆత్మ పరిశీలన అనేది తన ఆత్మసంతృప్తి కోసం కాదు. తన లక్ష్య సాధనకు కావలసిన వనరులను సంపాదించుకునేందుకు తోడ్పడేదిగా ఉండాలి.
ఒకప్పుడు రష్యన్ గ్రామాల్లో ప్రచారంలో ఉన్నట్టు అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరూ అనే విధానంలో సాగాలి. జీవితమనేది మెరుపు వేగంతో నడిచే చదరంగం పోటీ వంటిది కాదు. జీవితంలో తలెత్తే ప్రతి సమస్యను పరిష్కరించుకునేందుకు వాస్తవిక దృక్పథంతో, తెలివి తేటలతో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలి. అందుకోసం ఒక నిర్ణయం చేయడంలో మనపై పని చేసే ప్రభావాలను విశ్లేషించుకోవాలి. అన్ని మానసిక భావావేశాలపై స్వయం నియంత్రణ అనేది తప్పకుండా ఉండాలి. దృఢ నిశ్చయం, పట్టుదల, నిరంతర శిక్షణ ఉన్పప్పుడే ముఖ్యమైన అవసరమైన ఈ కృషిని మనం చేయగలుగుతాం. ఇదే మనకు జీవితంలో అసాధారణమైన ఫలితాలను ఇస్తుంది. జీవితంలో సమన్వయం పాటించడమంటే తమను తాము సరిదిద్దుకోవడంగా భావించాలి. స్వయం విద్యాభ్యాసం, స్వయం ప్రగతి సాధించే క్రమంలో మన నిత్యం చేయవలసిన పని ఇదే.
- జి గంగాధర్ సిర్ప, 9010330529