Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకయ్య అనే రైతు తన పొలంలో పొట్ల, గుమ్మడి పాదులు వేశాడు. వాటికి పందిరి కట్టటంతో అవి పోటాపోటీగా పెరిగాయి. రెండు పాదులకు పిందెలు వచ్చి, అవి పెద్దవి కూడా అయ్యాయి. రైతు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పాదులు చేయటం, నీళ్లుపెట్టాడు. పొట్లకాయలు వంకర రాకుండా వాటి చివర బరువుగా చిన్నచిన్న రాళ్లు కట్టాడు. అలాగే గుమ్మడికాయల బరువుకు తగ్గ ఏర్పాట్లు చేశాడు. పొట్లకాయలకు రైతు కట్టిన రాళ్లను చూసి గుమ్మడికాయ హేళన చేసేది. పొట్లకాయ ఎదురు తిరిగి ఏమీ అనలేక సిగ్గుతో తల దించుకునేది.
ఒకరోజు గుమ్మడికాయ పొట్లకాయను ఉద్దేశించి ''షికారుకు వస్తావా.. సరదాగా అలా తిరిగొద్దాం'' అన్నది. పొట్లకాయ రైతు కట్టిన రాయి బరువుకు కదల్లేక రాలేనన్నది. దానికి గుమ్మడికాయ ''నువ్వు రాలేక కాదు.. రైతు నిన్ను కదలకుండా కట్టేశాడు ఇంకేం వస్తావు షికారుకు'' అన్నది.
పొట్లకాయ పరువు కాపాడుకోడానికి ''అదేం కాదు.. నామీద నమ్మకంతో పొలానికి కాపలా ఉంచాడు. నాకు విశ్వాసం ఎక్కువ అందుకే షికారుకు రానన్నాను'' అన్నది.
దానికి గుమ్మడికాయ ''కోతలు బాగా కోస్తున్నావ్ .. మాటలు నేర్చావ్ .. నీ బతుకంతా జైల్లో ఖైదీ మాదిరి బంధీవి'' అని పరిహాసం చేసింది.
కోపంతో ''పొట్లకాయ నా అంత ఎత్తు లేని నీతో మాటలు అనవసరం'' అన్నది.
గుమ్మడికాయకు ఆ మాటలు కోపం తెప్పించాయి. ఒక్కసారిగా పందిరి పైనుంచి కిందకు దూకి ''నాతో పోటీ పడు.. ఎవరి శక్తేంటో తెలుస్తుంది'' అంది.
పొట్లకాయ తనకు కట్టిన రాయిని తెంపుకుని సై అన్నది. రెండూ పరుగుపందెం పెట్టుకుందామని నిర్ణయించుకున్నాయి. పొగరుతో ఉన్న గుమ్మడికాయ ఒక్క ఉదుటున దొర్లుకుంటూ పరుగు ప్రారంభించింది. పాపం పొట్లకాయ దొర్లలేక, నడవలేక మెల్లగా పాకుతూ ముందుకు సాగింది. గుమ్మడికాయ దొర్లుకుంటూ చాలా దూరం పోగా, పొట్లకాయ మెల్లగా పాకుతుంది. వేగంగా పోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా గుమ్మడికాయతో పోటీ పడలేక పోతుంది.
ఇంతలో ఒక విచిత్రం జరిగింది. వేగంగా దొర్లుకుంటూ పోతున్న గుమ్మడికాయకు మధ్యలో పెద్ద రాయి అడ్డు రావటంతో పరుగుకు బ్రేక్ పడింది. ఎంత బలం చూపినా రాయి దాటలేక పోయింది. రాయి దాటాలని విశ్వ ప్రయత్నం చేసింది. అలా చాలా సమయం గడిచిపోయింది. తన పక్క నుంచి పొట్లకాయ పాకుతూ ముందుకు పోతున్నా గుమ్మడికాయ గమనించలేదు. పొట్లకాయ మెల్లగా పాకుతూ గమ్యం చేరి విజేతగా నిలిచింది. గుమ్మడికాయ సిగ్గుతో తల దించుకుంది. అనరాని మాటలు అన్నందుకు క్షమించమని పొట్లకాయను కోరింది. ఇక నుంచి ఇద్దరం స్నేహంగా కలిసుందామని నిర్ణయించుకున్నాయి. ఇంతలో దూరం నుంచి రైతు వస్తుండటంతో రెండూ వాటి స్థానాలకు చేరాయి.
- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర, 9492309100