Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాకూ భూగోళంతో
పోటీ పడుతూ
విశ్వాంతరాళమంతా
విహరించాలని ఉంది
కులం మతం జాతి వర్గం
మీకు తోచిన పేర్లతో
మమ్మల్ని ముక్కలు చేసి
వాద భేదాల ఊబిలోకి
మీరే తోసేసి
మమ్మల్ని ఉద్దరించే
కంకణ ధారులమని
ఊదర కొడుతున్నారు
మీ సింహాసనానికి మమ్మల్ని
కాపలా కుక్కల్లాగా
కట్టేసుకుంటున్నారు
నేడు లేని అర్ధాలను
ధర్మాలను ఉటంకిస్తూ
మాకు ఆపాదిస్తూ
నాటి లోహపు పద
స్తోత్రాలను స్థుతిస్తూ
మా గుండెల రాజేసి
మీ ఆయుధాలకు
పదును పెట్టుకుంటున్నారు
సోదరత్వం పరిఢవిల్లే
వర్తమాన భావి చైతన్యం
మాకు అందకుండా చేస్తూ
గత మృత కళేబరాన్ని
పునరుజ్జీవింప జేసి
మా ముందుంచాలని
ఆతృత పడుతూ ఉన్నారు
మేము బలి పుత్రులమో
వామనుడి వారసులమో
కావచ్చును
ఈ నేలమ్మ ప్రసవించిన
నిమిత్త మాత్రులమైన
నెత్తుటి బిడ్డలమే మేము
మా జననం మరణం
ఆకలితో మండే
పేగుల వాసన ఒక్కటే
వివక్షలేని గోడమీది బల్లి
మాలో ఎవరినైనా మింగి
ఏమీ ఎరుగనట్టే ఉండగలదు
అధికారమైనా అక్షరమైనా
మనస్సుల కలిపేదే కావాలి
కానిది ఏదైనా మా జాగృతాగ్నిలో
దగ్ధం కాక తప్పదు
మనుషులుగా ఒకరికి ఒకరం
స్పృశించుకోవాలనుంది
ఆత్మీయంగా ఆలింగనం
చేసుకోవాలని ఉంది
- పర్కపెల్లి యాదగిరి