Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్ద చెట్టుకొమ్మకి తలకిందులుగా వేలాడుతున్న పెద్ద కొండచిలువకి దగ్గర్లోనే మనుషులు మసులుతున్న చప్పుడుకి మెలకువ వచ్చింది. మెలకువ వచ్చీరాంగానే ఆకలేసింది. నాలుక బయటకి చాస్తూ కొమ్మమీంచి నేలమీదకి నెమ్మదిగా పాకింది. ఇంతమంది వున్నారిక్కడ ఒక్కడన్నా చిక్కడా అనుకుంటూ మనుషులు మసులుతున్న చోటికి చేరింది.
అదొక పోలింగుబూతు. ఓట్లెయ్యడానికి వచ్చిన వాళ్ళ కళ్ళపడ్డదది. అంతే! పరుగో పరుగు. క్షణంలో జనం మాయం అయిపోయేరు. ఆకలిగా ఉన్న కొండచిలువ ఏదో ఒకటి మింగాలనుకుని 'ఏదో ఒకటి' మింగేసింది. ఆ తర్వాత దానికి తెలిసింది తను చేసింది తప్పని.
ఆవురావురంటూ తను మింగేసిన వస్తువదేమిటో గాని చెట్టుకు చుట్టుకోనీదు. లోపల ఓ చోట అడ్డం పడి కదలదు మెదలదు. బాధతో గిలగిల్లాడింది కొండచిలువ. ఏం చెయ్యాలో పాలుపోలేదు. సాటి కొండచిలువ నొకదాన్ని సలహా అడిగింది. అప్పుడు తెలిసింది దానికి తను ముందూ వెనకా చూసుకోకుండా గుడ్డిగా మింగేసిన వస్తువేమిటో! తన ఫ్రెండు సలహా పాటిస్తూ భారంగా ఎంతో దూరంగా వున్న ఎన్నికల అధికారి ముందుకు వచ్చి నిలబడ్డది.
'సార్! తెలీక మింగేశాను. నానాయాతన పడుతున్నాను. మీరే దీన్ని బయటకి రప్పించాలి ప్లీజ్!' అని ప్రాధేయపడింది.
'ఏది పడితే అది మింగేయడమేనా! నువ్వు చేసింది చాలా పెద్ద నేరం. ఎన్నికలూ ప్రజాస్వామ్యం వంటి మాటలకర్థం తెలీని దానివి కనక వదిలేస్తున్నా పో' అన్నాడు ఎన్నికల అధికారి చిరాకు పడుతూ.
'మరి నా కడుపులో వున్న దీన్ని' అని నీళ్ళు నమిలింది కొండచిలువ.
'నువ్వు దాన్ని మింగావని ఆ బూత్‌లో ఎన్నిక రద్దు చేశాం, మళ్ళీ నిర్వహిస్తాం. నీ బాధ చూస్తే జాలేస్తున్నది. ఎవరైనా మంచి డాక్టర్ని కలువు. ఆలస్యం చేయకు' అన్నాడు ఎన్నికల అధికారి జాలి పడుతూ.
ఎన్నికల అధికారి సలహా పాటిస్తూ భారంగా ఎంతో దూరంగా వున్న డాక్టర్ గారి ముందుకు వచ్చి నిలబడ్డది కొండచిలువ.
'సార్! తెలీక మింగేశాను. నానా యాతన పడుతున్నాను. మీరే దీన్ని బయటకి రప్పించాలి ప్లీజ్!' అని ప్రాధేయపడింది.
'నువ్వు మింగింది మామూలు వస్తువు కాదు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే దాన్ని మింగేశావు నువ్వు. నేను సర్జన్నే కానీ అప్రజాస్వామిక పనులు ఎన్నో చేశాను. దొంగాపరేషన్లు, సర్టిఫికెట్లూ సాక్ష్యాలు చెప్పాలంటే చాలా వున్నాయి. వీటితో తీరికలేక ఓటర్నే అయినా ఎన్నడూ ఓటేసిన వాణ్ణి కాను. సారీ! ఆ పక్కన లాయర్ గారుంటారు. ఆయన్ని కలు. ఏమైనా చేయగలడు' అన్నాడు డాక్టర్ తను కొండ చిలువ కడుపులో ఉన్నది బయటకు తీయలేనందుకు సిగ్గుపడుతూ.
డాక్టర్ సలహా పాటిస్తూ భారంగా ఎంతో దూరంగా వున్న లాయర్ గారి ముందుకు వచ్చి నిలబడ్డది కొండచిలువ.
'సార్! తెలీక మింగేశాను. నానాయాతన పడుతున్నాను. మీరే దీన్ని బయటకి రప్పించాలి ప్లీజ్!' అని ప్రాధేయపడింది.
'నువ్వు మింగింది మామూలు వస్తువు కాదు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే దాన్ని మింగేశావు నువ్వు. నేను లాయర్నే కాని అప్రజాస్వామిక పనులు ఎన్నో చేశాను. నా తెలివితేటల్తో నిజాన్ని అబద్దం చేశాను. న్యాయసూత్రాల్ని తికమకగా వాడి పారేశాను. చెప్పాలంటే చాలా వున్నాయి. క్షణం తీరిక లేక ఓటర్నే అయినా ఎన్నడూ ఓటేసిన వాణ్ణి కాదు. సారీ! నాకు తెల్సిన మాష్టారి అడ్రసు ఇస్తాను. ఆయనకి ప్రజాస్వామ్యం అంటే ఎంతో గౌరవం. ఆయన్ని కలు. ఏమైనా చేయగలడు' అన్నాడు లాయర్ తను కొండచిలువ కడుపులో ఉన్నది బయటకు తీయలేనందుకు ఏ మాత్రం సిగ్గుపడకుండా.
'సార్! సార్! తెలీక మింగేశాను' అని కొండచిలువ మాష్టార్ని బతిమాలింది.
'ప్రజాస్వామ్యం అంటే నాకెంతో గౌరవం. ప్రతి ఎన్నికలప్పుడూ డ్యూటీ సక్రమంగా చేశాను. అయితే ఓటర్నే అయినా ఎన్నడూ ఓటు వేసిన వాణ్ణి కాను, డ్యూటీలో వుండడం వల్ల' అంటూ చేతులెత్తేశాడు మాష్టార్ కూడా.
ఆ తర్వాత కనపడ్డ ప్రతి మనిషినీ ప్రాధేయపడుతూ అడిగింది. చాలామంది మేం ఓటర్లమే కాని ఓటు వేసిన వాళ్ళం కామని తప్పుకున్నారు.
నిరాశగానూ నిస్పృహతోనూ వెనక్కి వస్తున్న కొండచిలువకి ఓ మనిషి ఎదురయ్యి తనే పలుకరించాడు... 'ఏంటలా నీరసంగా పాకుతున్నావు ఏమైంది నీకు?' అన్నాడు.
'నువ్వేం చేస్తావు? ప్రజాస్వామ్యం అంటే తెలుసా నీకసలు!' అంది కొండచిలువ.
'అదేమో నాకు తెలీదు గానీ ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా బూత్‌కు వెళ్ళి క్యూలో నిలబడి ఓటు వేస్తూ వచ్చిన మామూలు ఓటర్ని' అన్నాడు మామూలు మనిషి కొండచిలువ వీపు మీద చేయి వేసి.
అంతే! కొండచిలువ కడుపులో వున్న 'ఈవీఎమ్' ఒక్క జర్కుతో కదిలి గబగబా ముందుకు వచ్చి దాని నోట్లోంచి బయటకు వచ్చేసింది మామూలు మనిషి మీద గౌరవంతో.
ఓటెయ్యని ఓటర్లకంటే ఓటేసే మామూలు మనుషులంటేనే ప్రజాస్వామ్యానికి ప్రాణం అనుకుంటూ హాయిగా చెట్టెక్కేసింది కొండచిలువ.
- చింతపట్ల సుదర్శన్, 9299809212