Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చుట్టూ దట్టంగా చెట్లూ ఆ పక్కా ఈ పక్కా కొండలూ. చెట్ల మీద కిచకిచలాడే కోతులు, కొండమీద చీమలు పెట్టిన పుట్టల్లో పాములూ.
భూమ్మీద విరగబడ్డానికి ప్రయత్నిస్తున్న రవి కిరణాలని అడ్డుకుంటున్న కొమ్మలు, కొమ్మల్లో గూళ్ళూ గూళ్ళల్లో పక్షులూ.
కోతుల కిచకిచలూ, పాముల బుసబుసలూ, పక్షుల గగ్గోలూ వాటి మధ్య పిల్లబాట, దాని మీద గెంతుతూ వస్తున్న డింగో!
నాలుక్కాళ్ళ డింగో... వాటి మీద నడుస్తున్న డింగోకి ఓ ముఖమూ దాంట్లో ఒక వాసన చూసే ముక్కూ. డింగో రంగు బూడిద. బూడిద రంగు డింగో దారంట కుందేళ్ళ జాడ పసిగట్టడానికి గెంతుతూ వస్తున్న డింగో!
డింగో తూర్పు నుండి పడమరకు వెళ్తున్నది పడమర నుండి తూర్పుకు వస్తున్నది బింగో! పొడుగు కాళ్ళ బింగో.
బింగోకు పొడుగుకాళ్ళే కాదు పొడవాటి ముక్కు కూడా వుంది. ఆ ముక్కుతో అది మడుగులో చేపల్లి పొడుచుకు తింటుంది.
రెండు కాళ్ళ బింగో... వాటి మీద నడుస్తున్న బింగోకి వున్న ముఖంలో పొడవాటి ముక్కుమీద చిన్న తల. బింగో రంగు తెలుపు. తెలుపు రంగు బింగో దారంట నీళ్ళ మడుగూ, వాటిల్లో చిన్న చేపల జాడా పసిగట్టడానికి నింపాదిగా నడుస్తూ అప్పుడప్పుడూ ఎగురుతూ వస్తున్నది బింగో.
తూర్పు నుండి పడమరకు వెళ్తున్న డింగో పడమర నుండి తూర్పుకు వస్తున్న బింగో ఓ చోట కలిశాయి.
హలో డింగో అందామనుకుంది బింగో. హాలో బింగో అందామనుకుంది డింగో. కానీ దాని జాతి వేరు నా జాతి వేరు, దాంతో కలవడం దేనికి అనుకుంది బింగో. అది పక్షి. నేను జంతువు. మా ఇద్దరికీ కుదర్దు అనుకుంది డింగో.
రెండూ ఒకదాన్ని ఒకటి దాటేక మనసు మార్చున్నాయి. జాతులు వేరైనా అవసరం ఒకటయితే రెండు కాళ్ళూ నాలుక్కాళ్ళూ కలవొచ్చు, తప్పేం లేదు అనుకున్నాయి. హారు హలో డింగో అంది బింగో. హారు హలో బింగో అంది డింగో.
నీళ్ళూ చేపల జాడ చెప్తానని డింగో, కుందేళ్ళ ఇళ్ళ జాడ చెప్తానని బింగో మాట్లాడుకున్నాయి. జాతులు వేరయినా, కాళ్ళ సంఖ్య వేరైనా, ముఖాలూ ముక్కుల సైజూ కలవకపోయినా, రంగుల్లో తేడా వున్నా కల్సిపోయినవి ఆపద్ధర్మంగా ఆప్తమిత్రులైపోయినయి. ఈనాటి ఈ బంధం ఏ నాటిదో అని పాట కూడా పాడుకున్నాయి.
తమ ఫ్రెండ్షిప్కి గుర్తుగా వుంటుందని డింగో బింగోని డిన్నర్‌కి ఆహ్వానించింది. బింగో సరేనంది.
ఆ మర్నాడు బింగో, డింగో ఇంటికి చేరుకుంది. డింగో బింగోని కావలించుకుని ఇంట్లోకి తోలుకుపోయింది. ఘుమఘుమలాడే పాయసం వాసన నోరూరిస్తుంటే ముక్కు బార్లా తెరిచింది బింగో. వెడల్పాటి పళ్ళెం నిండా వేడి వేడి పాయసం పోసి బింగో ముందు పెట్టింది డింగో.
పళ్ళెంలో ముక్కు టకటకలాడించింది బింగో. ఒక్క చుక్క పాయసం కూడా దాని ముక్కులోకి జొరబడలేదు. మళ్ళీ మళ్ళీ పళ్ళాన్ని పొడిచీ పొడిచీ అలసిపోయింది బింగో!
చూస్తూ వుండగానే పళ్ళెంలో వున్న పాయసాన్ని ఎర్రటి నాలుకతో జుర్రేసింది డింగో! ముఖంలో పొడవాటి ముక్కు వుంటం తన ఖర్మ అనుకుంది బింగో!
ఫ్రెండ్షిప్పన్నాక నేనూ నీకు విందు ఏర్పాటు చెయ్యాలి గదా, మా ఇంటికి రావా మరి అనడిగింది బింగో డింగోని.
ఎగిరి గంతేసింది డింగో!
విందుకు వెళ్ళడానికి తయారై ఈల వేయలేదు గనక ఊళ వేస్తూ నాలుగు కాళ్ళమీద హుశారుగా గెంతేస్తూ మరో మర్నాడు డింగో బింగో ఇంటికి చేరుకుంది. బింగో డింగోని హత్తుకుని ఇంట్లోకి తోలుకుపోయింది. ఘుమఘుమలాడే పాయసం వాసన డింగో ముక్కుని ఉక్కిరిబిక్కిరి చేసింది. కూజాలో వేడివేడి పాయసం పోసి డింగో ముందు పెట్టింది బింగో.
సన్నమూతి కూజా, కూజాలో వేడివేడి పాయసం. డింగో నాలుక వేళాడేసి కూజా చుట్టూ తిరిగింది. ఒక్క చుక్క పాయసం కూడా దాని నాలుక కంటలేదు. మళ్ళీ మళ్ళీ కూజా చుట్టూ తిరిగీ తిరిగీ అలసిపోయింది డింగో!
చూస్తూ వుండగానే కూజాలో వున్న పాయసాన్ని పొడవాటి ముక్కుతో పీల్చేసింది బింగో. ముఖంలో పొడవాటి ముక్కు లేకపోవడం తన ఖర్మ అనుకుంది డింగో.
కుందేళ్ళని వేటాడే డింగోలూ, చేపల్ని ముక్కుతో పొడుచుకు తినే బింగోలూ వేరువేరు పార్టీలకి చెందినా ఎన్నికలప్పుడు పొత్తులకి మాత్రం రడీ అయిపోతాయి. ఆప్తమిత్రుల డ్రామా ఆడతయి. అయితే ఎవరి స్వార్థం వారిదే కదా! డింగోల పాయసం డింగోలదే బింగోల పాయసం బింగోలదే!
ఎన్నికల పొత్తులనగా తుమ్మితే ఊడే ముక్కులే కదా!!
- చింతపట్ల సుదర్శన్, 9299809212