Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజువారీగా ఉపయోగించే ఆవాలు, పసుపు, అల్లం వంటి వాటి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చిన్న చిన్న సమస్యలకే వైద్యుల వద్దకు పరిగెత్తనవసరం లేకుండా కాస్త మనసు పెడితే ఇంట్లో ఉన్న వాటితోనే వాటి నివారణలు చేసుకోవచ్చు. అనారోగ్యం ఏర్పడినపుడు అని కాకుండా అవసరాన్ని బట్టి తీసుకుంటుంటే కొన్ని రకాల ఆనారోగ్య సమస్యలు దరిచేరవు. ఎందులో ఏముంటాయో, ఎందుకు ఉపయోగపడతాయో కొన్నింటి గురించి మీకోసం..
1. చక్కెరను నియంత్రించే దాల్చిన చెక్క :
దాల్చిన చెక్కలో ప్రోటీన్లు, పీచు, ఐరన్, సోడియం, విటమిన్ సి ఇంకా అనేక రకాల పోషక విలువలున్నాయి. దీనిలోని ఔషధ విలువల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతూ, కొలెస్ట్రాల్, ట్రెగ్లీసెరైడ్ స్థాయిని తగ్గిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
2. పైత్యానికి విరుగుడు అల్లం:
ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన ఔషధం లేదని పెద్దలు చెబుతుంటారు. అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. వికారం, వాంతులు, విరోచనాలకు ఇది చెక్ పెడుతుంది. గర్భవతులలో ఉదయం పూట ఏర్పడే వికారాన్ని, ఎన్నో కారణాల వల్ల వచ్చే కడుపునొప్పిని అల్లం నివారిస్తుంది. చలికాలంలో అల్లం టీ తాగేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.
3. గుండెకు నేస్తం వెల్లుల్లి:
వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో మెండుగా వున్నాయి. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
4. అందం, ఆరోగ్యానికి కుంకుమపువ్వు :
కుంకుమపువ్వు చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దేశ విదేశాల్లో ఆహార పదార్థాలలో రుచి, రంగు, సువాసన కోసం వాడుతున్నారు. కుంకుమపువ్వులో క్యాన్సర్ నిరోధక గుణాలు వున్నాయి. గర్భిణులు కుంకుమ పువ్వును పాలలో కలిపి తీసుకుంటే పిల్లలు అందంగా పుడతారు అని పెద్దలు చెబుతుంటారు.
5. శ్వాసకు మేలు లవంగాలు:
యాంటిసెప్టిక్, యాంటీబయోటిక్ ఔషధాలలో లవంగాలను ఉపయోగిస్తారు. లవంగాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు దంతాలకు రక్షణనిస్తాయి. నోటిని, శ్వాసను తాజాగా ఉంచుతాయి. హదయానికి ఆరోగ్యాన్నిస్తాయి. అప్పుడప్పుడు ఒక లవంగాను నోటిలో వేసుకుని చప్పరిస్తూ ఉంటే శ్వాస సంబంధ సమస్యలు దరి చేరవు.
6. జీర్ణశక్తికి జీలకర్ర :
జీలకర్ర జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని క్యూమిక్ డీహైర్ అనే పరిమళం లాలాజల గ్రంధులను క్రీయాశీలం చేస్తుంది. ఆకలిని కలుగజేస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థను ఎలాంటి అంటురోగాలు సోకకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది.
7. కండరాల నొప్పులను తగ్గించే ఆవాలు :
రోజువారీ తాలింపుల్లో ఉపయోగించే పోపుల్లో ఉండే వాటిలో ముఖ్యమైనవి ఆవాలు. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావలసిన విటమిన్లు అందిస్తాయి. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గిస్తాయి. శ్వాస అవరోధాలను దూరం చేస్తాయి.
8. జీర్ణక్రియకు నల్లమిరియాలు :
ఘాటుగా ఉండి నాలుకను చురుక్కుమనిపించే మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి ఉదరంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదలయ్యేలా ప్రేరేపిస్తాయి. బ్లాక్ కాఫీలో మిరియాల పొడి వేసుకుని తాగితే ఋతుక్రమ సమయంలో ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇస్తుంది.
9. శ్వాస సంబంధిత సమస్యలకు పచ్చి యాలకులు :
ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి, శ్లేష్మాన్ని తొలగించే శక్తి యాలకులకు ఉంది. ఇవి జీర్ణక్రియ వ్యవస్థపై చక్కగా పనిచేస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు యాలకులు వేసిన పాలను తాగిస్తే ఉపశమనం ఉంటుంది.
10 . యాంటి ఆక్సిడెంట్‌గా పసుపు :
కూరల్లో తప్పనిసరి వాడే పసుపులో యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. రక్త శుద్ధికి, కాలేయం, కంటి వ్యాధులకు, గాయాలు మానుటకు, వాపులతో కూడిన నొప్పులకు ఇలా ఎన్నో రకాల సమస్యలకు పసుపు వాడతారు. ఇతర ఉపయోగాలు కూడా పసుపులో కనిపిస్తాయి. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు పొడి వేసి ఉదయం, సాయంత్రం తాగితే పడిశానికి మంచి ఉపశమనం లభిస్తుంది. పసుపును నీటిలో కలిపి ముద్ద చేసి లేదా లేత వేపాకు గుజ్టుతో కానీ కలిపి చర్మంపై రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. చర్మంపై దద్దుర్లు వచ్చినపుడు నువ్వుల నూనెలో పసుపు రంగరించి పూసినా అవి పోతాయి. బెణికినపుడు నొప్పికి, గాయాలకు, కీళ్ల వద్ద కొంచెం వాపు, నొప్పికి సున్నం, పసుపు కలిపి తేలికగా రుద్దితే మంచి ఉపశమనం కలుగుతుంది.
- అంకం రమాదేవి