Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ రోజు అందరూ అక్కనో ఏంజల్లా చూస్తుండటం అభరుకి విసుగనిపించింది. ఉదయం నుంచే ఊర్నుంచీ అమ్మమ్మ తాతయ్యలు, నానమ్మ, పెదనాన్న, బాబారు, చుట్టాలే కాకుండా తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు, స్నేహితులు అంతా అక్కకు అభినందనలు తెలుపుతూ కానుకలు ఇస్తున్నారు.
నాన్నైతే కాస్ట్లీ స్వీట్స్ పట్టుకొచ్చేశాడు. అమ్మ అక్కకి ఇష్టమైన వంటకాలు చేస్తుంది. దీనంతటికీ కారణం అభరు అక్క పదవ తరగతి మంచి మార్కులతో ప్యాసవటమే. ఉన్నట్టుండి అక్క సెలబ్రిటీ అయిపోయింది. తొమ్మిదవ తరగతి చదువుతున్న అభరుని ఎవరూ పట్టించుకోకపోవటంతో చదువురాని మొద్దుగా భావించి అందరూ తనని పక్కకు నెట్టేసినట్టు భావించి, అక్కమీద ఈర్ష్యతో ముభావంగా వున్నాడు.
అక్క వర్షిణి మాత్రం అదేమీ గమనించకుండా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు, ఇంటికి వచ్చినవాళ్ళకూ స్వీట్స్ పంచసాగింది. మైమరచిపోయి తనను పట్టించుకోలేదన్న బాధ అలకగా మారి గదిలోకెళ్ళి కంప్యూటర్ ఓపెన్ చేశాడు అభరు.
ఆ మధ్యాహ్నం వర్షిణి స్నేహితురాళ్ళు వచ్చి పార్టీ ఇవ్వాలని అడగ్గానే తండ్రి ఒప్పేసుకుని మంచి హోటల్‌కి తీసుకెళ్ళాడు. అది అసలు నచ్చలేదు అభరుకి. ఎందుకంటే తనెప్పుడైనా హోటల్‌కి వెళ్దామంటే ''వద్దునాన్నా. బయటి ఫుడ్ మంచిది కాదు అనేవాడు'' తండ్రి.
రేపట్నుంచీ చెప్తా వీళ్ళ సంగతి 'తమ్ముడూ నా బుక్స్ నీ రాక్‌లో పెట్టుకుంటా' అంటే ఒప్పుకోకూడదు. అమ్మ 'చిన్నా..! ఈపూటకు ఇడ్లీలోకి చట్నీలేదు కారప్పొడితో సర్దుకో' అని అన్నా, 'ఒరే అభి..ఈ పెన్ డ్రైవ్ నువ్వు స్కూల్‌కెళ్ళే దారిలో నిరంజన్ అంకుల్‌కి చేర్చూ' అని తండ్రి అన్నా అస్సలు చెయ్యకూడదని గట్టిగా అనుకున్నాడు.
రాత్రి ఇంటికొచ్చేసరికి పదైంది. బట్టలు మడుస్తూ తల్లి, పెట్టుకున్న నగలు తీస్తూ వర్షిణి, అన్ని వస్తువులూ అలమరలో సర్దుతూ తండ్రి వున్నారు. అభరు డ్రెస్ మార్చుకుని వాష్‌రూం వైపు వెళ్తుంటే తల్లి మాటలు వినిపించాయి... 'వచ్చేయేడు చిన్నూకి ఇంతకంటే మంచి పొగడ్తలు వస్తాయి' అని. 'ఆ..మరేమనుకున్నావ్ వాడు జెమ్. పెద్ద రిసార్ట్‌లో ప్లాన్ చేద్దాం అభరు పార్టీ. ఇప్పుడైతే ముందే అనుకోకపోయాం కదా' అని తండ్రి, 'అవును డాడీ.. వాడిప్పుడే నాకు లెక్కల్లో డౌట్స్ క్లియర్ చేస్తున్నాడు. నాకంటే ఎక్కువ ర్యాంక్‌లో ప్యాసవుతాడు. నా పాకెట్ మనీ ఇప్పట్నుంచే దాచాలి, వాడికి కోరిన గిఫ్ట్ కొనివ్వటానికి' అని వర్షిణి అనుకోవటం అభరు చెవిన పడింది.
''ఛ...కొంతసేపట్లో సొంతక్క మీదే ఈర్ష్య పెంచేస్కున్నానే. నా ఆలోచనలో తప్ప, వారి మనసుల్లో ఎక్కడా తారతమ్యం కనిపించట్లేదు. అనవసర అపోహలతో అయినవారిపై అలిగినందుకు సిగ్గుపడుతూ తనమీద వారికున్న ప్రేమను తేలికపడిన మనసుతో అనుభూతిస్తూ హాయిగా నిద్రపోయాడు అభరు. మర్నాటినుంచీ తనలోని వ్యతిరేక ధోరణిని వదిలిపెట్టి అందరిలో మంచిని చూస్తూ మంచి కుర్రాడిగా ఎదిగాడు.
- డేగల అనితాసూరి, 9247500819