Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాటంటే మనిషి జీవితం. మనిషి కష్టంలోనూ, సుఖంలోనూ పాట తోడూ నీడా. సుద్దాల అశోక తేజ పాట పనితో పాటే పుట్టింది అంటాడు. పని మనిషితో పాటు పుట్టింది. ఆ రకంగా పాటకి మనిషి అంత చరిత్ర వుంది. కొన్ని పాటలు మనిషిని ఓదారుస్తాయి. కొన్ని పాటలు మనిషిని ఉత్తేజితుడిని చేస్తాయి. కొన్ని పాటలు మనసును ఆహ్లాదంలో ముంచి తేల్చుతాయి. కొన్ని పాటలు సన్నగా గుండెను మెలి తిప్పుతాయి. కొన్ని పాటలు క్రోధాగ్నివేశాలు రగిలిస్తాయి. సినిమా పాటలైతే చెప్పవలసిన పనే లేదు... నిత్యం జనం నోళ్ళలో నానుతూ ఉంటాయి. ఒక 'వందేమాతరం', ఒక 'మాకొద్దీ తెల్లదొరతనం' స్వాతంత్య్ర సంగ్రామానికి ఊపిరులూదితే ఒక పాట ఒక పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చింది
ఒక పల్లవి, రెండు చరణాలు ఉంటే పాట కాదు. రసాలూరు రాజేశ్వరరావు లాంటి సంగీత దర్శకుడు ఉంటే దినపత్రికల వార్తా శీర్షికలు కూడా పాటల్లా మనలని అలరిస్తాయి. కానీ వార్తాశీర్షికలు ఎప్పటికీ పాటలు కాలేవు. పాటకి ఒక ఆత్మ ఉంటుంది. ఆత్మ లేనప్పుడు ఒక పల్లవి, రెండు చరణాలు విగత శరీర అంగాలుగా కనిపిస్తాయి తప్పిస్తే మంచి పాటలా మన మనసును దోచుకోవు. మొన్నా మధ్య 'మిర్చి' సినిమాలో ఒక పాటలో ఒక కవి ''రక్తాన్నే ఎరుపెక్కించావు'' అని రాశాడు. ఏడవతరగతి చదువుకునే మా అబ్బాయి ''రక్తం ఎర్రగానే ఉంటుంది కదా నాన్నా! ఇంకా ఎరుపెక్కించడం ఏమిటి?'' అని అడిగాడు. నాకేం జవాబు చెప్పాలో అర్ధం కాలేదు. ఆ సినిమా చూస్తే కానీ కవి ఆ మాట ఎందుకు రాశాడో నాకు అర్ధం కాలేదు. ఆ సినిమాలో ఇద్దరు ఫ్యాక్షన్ లీడర్లలో ఒకరు శాంతి కాముకుడు. మరొకరు నిత్యం పగ, ప్రతీకారం అంటూ శాంతి కాముకుడిని రెచ్చగొడుతూ ఉంటాడు. శాంతి కాముకుడి అనుచరులకు తగిన జవాబు ఇవ్వాలని లోలోపల ఉంటుంది. కానీ మౌనంగా వుండవలసి వస్తుంది. అప్పుడు హీరో ఎదుటి పక్షానికి దిమ్మ తిరిగి పోయే జవాబు ఇస్తాడు. ధమనులలో, సిరలలో మౌనంగా పరుగులు తీస్తున్న రక్తాన్ని ఉత్తేజితం చేశాడన్న మాట. ఇంత ఆలోచన ప్రతి శ్రోతకీ ఉండాలనే రూలు లేదు కదా.
మొన్నామధ్య విజయవాడ నుండి బస్సులో వస్తుంటే నా సీట్ వెనుక కూర్చున్న ఇద్దరు ఇంజనీరింగ్ అమ్మాయిలు ఒక పాట గురించి మాట్లాడుకుంటున్నారు...
''అబ్బ! ఏం రాశాడే పాట. ఎంత అద్భుతంగా ఉందో కచ్చితంగా చంద్రబోసో, అనంత శ్రీరామో రాసి ఉంటాడు'' అన్నది ఒక అమ్మాయి.
''లేదు, లేదు చంద్రబోసు, అనంత శ్రీరామ్ పాటల మధ్య మధ్య హిదీ, ఇంగ్లిష్ మాటలు చాలా వాడతారు. ఇందులో ఒక్క ఇంగ్లిష్ మాట కూడా లేదు. కాబట్టి సీతారామశాస్త్రి రాసి ఉంటాడు'' అన్నది మరొక అమ్మాయి. వాళ్ళ మాటల మీదకు వద్దు అనుకున్నా నా మనసు పోయింది.
''ఇంతకూ సాంద్ర అంటే అర్ధం ఏమిటి?'' అన్నది ఒక అమ్మాయి.
''ఏమోనే. నాకూ తెలియదు. గూగుల్ చేద్దామా?'' అన్నది మరొక అమ్మాయి.
ఒక్కసారి వెనక్కు తిరిగి సాంద్ర అంటే Intensive అని వాళ్లకు అర్ధం అయ్యే భాషలో చెప్పాను. వాళ్ళు మాట్లాడుకున్నది 'ఎన్టీఆర్ బయోపిక్'లో టైటిల్ సాంగ్ గురించి. అది రాసింది చంద్రబోసు, అనంత శ్రీరామ్ కాదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా కాదు. శివశక్తి దత్తా. కీరవాణి వాళ్ళ నాన్నగారు. ఈ కథ ఇంతటితో అయిపోలేదు. ఇంటికొచ్చాక మా అబ్బాయి 'విజితాఖిలాంద్ర' అంటే ఏమిటి అని అడిగాడు. అఖిలాంధ్రను అంటే ఆంధ్రదేశం మొత్తాన్ని జయించినవాడు అని అర్ధం అని చెప్పాను. వాడి ప్రశ్నలు అంతటితో ఆగలేదు. విజేత అన్నా విజిత అన్నా ఒక్కటేనా అన్నాడు. దరిదాపుగా ఒకటే అన్నా. నేను పెద్ద కవిని అనీ, నాకు తెలుగుకు సంబంధించినంత వరకు తెలియనిది లేదు అని మా అబ్బాయి నమ్మకం. వాడు నా వంక చిరాగ్గా చూసి ''మా టీచర్ విజేత అంటే మాస్క్యూలైన్ జెండర్ అనీ, విజిత అంతే ఫెమైన్ జెండర్ అని చెప్పిందే'' అన్నాడు వాళ్ళ టీచర్ చెప్పినదాన్ని క్రాస్ చెక్ చేసుకోవడం వాడికి అలవాటు. ''అయితే నాకు తెలియదు'' అని చెప్పి ఆ పాటను గూగుల్‌లో వెతికాను. ఆ పాట ఇలా వుంది...
ఘన కీర్తి సాంద్ర, విజితాఖిలాంధ్ర
జనతా సుధీంద్ర, మణి దీపకా //ఘన//
ఆహార్యాంగికా, వాచిక పూర్వక
అద్భుత, అతులిత నటనా ఘటికా
భీమసేన వీరార్జున కృష్ణా దానకర్ణ
మానధన సుయోధన భీష్మ బృహన్నల
విశ్వామిత్ర లంకేశ్వర
దశకంఠరావణాసురాధి పురాణ పురుష భూమికా పోషకా
సాక్షాత్ సాక్షాత్కారకా...
త్వదీయ చాయాచిత్రాచ్ఛాదిత
రాజిత రంజిత చిత్ర యవనికా...
న ఇదం పూర్వక రసోత్పాదకా...
కీర్తికన్యకా మనో నాయకా..
కథా నాయకా
ఘన కీర్తి సాంద్ర, విజితాఖిలాంధ్ర
జనతా సుధీంద్ర, మణి దీపకా
త్రిశతకధికా చిత్రమాలికా
జైత్రయాత్రికా, కధానాయకా..''
ఇది ఆ పాట. ఈ పాట మొత్తం రెండు సార్లు విన్నా, చదివినా నాకైతే అర్ధం కాలేదు. పదాలు అన్నీ అర్ధం అయినట్లు ఉంటాయి. కానీ భావం బోధపడదు. ఏడవతరగతి చదువుతున్న మా అబ్బాయికి, నాకు బోలెడన్ని సందేహాలు. ఒక పాట గురించి ఎందుకింత అని అడగచ్చు. కానీ నాకు ఆ ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిలు, మా అబ్బాయి కళ్ళముందు కదలాడుతున్నారు కనుక .
సాంద్ర అంటే తెలుసు ఇంటెన్సివ్ అని. అంటే బలమైన, గొప్ప ఇలా చాలా అర్ధాలు. ఈ అర్ధాలు ఇచ్చే ఘన అన్న పదం వాడినప్పుడు మళ్ళీ సాంద్ర ఎందుకు?
ఘనకీర్తి దానికదే కావలసిన అర్ధాన్ని ఇస్తోంది. సాంద్ర మరొక అనర్ధాన్ని ఇవ్వడం తప్ప సాధించే ప్రయోజనం ఏదీ లేదు. విజితాఖిలాంధ్ర అంటే అఖిలాంధ్ర దేశ హృదయాలను గెలుచుకున్న అని అర్ధం అనుకుంటే దాన్ని మరొకరకంగా ఈజీగా అర్ధం అయ్యేటట్టు 'అఖిలాంధ్ర హృదయ విజేత' అనవచ్చు. కానీ అక్కడ సాంద్ర అన్న పదం వాడటం వలన ఇక్కడ ప్రాస కోసం విజితాఖిలాంధ్ర అని రాయవలసి వచ్చింది. ఇంకా కొంచెం కిందకు వస్తే 'జనతా సుధీంద్ర మణి దీపకా' అన్నారు.
సుధ అంటే అమృతం అని అర్ధం. సుధీ అంటే పండితుడు అని అర్ధం. సుధీంద్ర అంటే పండితులలో ఇంద్రుడి లాంటి వాడు, లేదూ పండితోత్తముడు అని అర్ధం. అలాంటప్పుడు జనతా అనే పదం ఏ ప్రయోజనాన్ని సాధించినట్టు? మామూలుగా జనతా అంటే సామాన్య ప్రజానీకం అని కదా అర్ధం. జనతా సుధీంద్ర అనడంలో ప్యారడాక్స్ ఏమీ లేదా?
నటనకు సంబంధించిన, ఆహార్యం, ఆంగికం, వాచకం లాంటి పదాలు ఉపయోగించిన రెండవ స్టాంజాలో అద్భుత, అతులిత అంటే తేలికగా బోధపడుతుంది కానీ నటనా ఘటికా ఏమిటి? ఘటికా అంటే అర్ధం ఏమిటి? విద్యార్థి కల్పతరువు, శబ్ద రత్నాకరం లాంటి పుస్తకాలు తిరగేస్తే ఘటికా అంటే క్షణం అనీ, ఘటన అంటే సంఘటన అని, ఘటం అంటే కుండ అనే అర్ధాలు కనిపించాయి. బహుశా ఘటికుడు అనే పదాన్ని దృష్టిలో పెట్టుకుని పొయెటిక్ లిబర్టీ తీసుకుని ఘటికా అని రాశారేమో. ఘటికుడు అంటే గండర గండడు అని జన సామాన్యంలో అర్ధం.
'త్వదీయ చాయాచిత్రా చాదిత/ రాజిత రంజిత చిత్ర యవనికా'... త్వదీయ అంటే మీ యొక్క అని అర్ధం. చాయాచిత్రాచ్చాదిత అంటే ఛాయా చిత్రముల చేత కప్పబడిన అని అర్ధం. ఆచ్చాదనా, ఆచ్చాదిత ఇలా అన్న మాట. ఇప్పుడు మీ యొక్క సినిమాల చేత కప్పబడిన రాజిత రంజిత చిత్ర యవనికా అన్నారు. అసలు కవి చెప్పదలచుకున్నది ఏమిటంటే... వెండితెర నందమూరి తారక రామారావు పోషించిన వైవిధ్యమైన పాత్రల చేత మనోరంజకంగా విరాజిల్లుతున్నది అని. చిత్రాచ్ఛాదిత అన్న ఒక్క పదంతో అర్ధం మొత్తం మారిపోలేదా?
'న ఇదం పూర్వక/ రసోత్పాదకా'... అంటే కూడా అన్వయం కుదరడం లేదు. న ఇదం పూర్వకా అంటే ఇంతకు ముందు నుండి అని అర్ధం. ఆ తరువాత వచ్చే వాక్యాలకు ఈ వాక్యానికి ఎక్కడా లంగరు కుదరడం లేదు.
పాటలో ప్రతి వాక్యం, ప్రతి చరణం వాటివైన ప్రత్యేకమైన అర్ధాలు ఇస్తూనే, పాట మొత్తంగా ఒక అర్ధాన్ని ఇవ్వాలి. అది హృదయాన్ని కదిలించాలి. ఇంతకుముందు సినారే, వేటూరి, శ్రీశ్రీ ఇలా చాలామంది ఇంతకంటే సుదీర్ఘ సమాసాలతో కూడిన పాటలు రాసారు. అవన్నీ అర్ధాలు తెలుసుకుంటే తేలికగానే అర్ధం అయ్యాయి కానీ ఈ పాటే అర్ధం అయినట్టు ఉంటుంది. కానీ అర్ధం కాదు.
టైటిల్స్‌లో వచ్చే పాట అంటే ఆ సినిమా మొత్తాన్ని గుది గుచ్చినట్టు ఉండాలి. ఈ పాటలో ఉన్న ఇంకో విశేషం ఏమిటంటే రాముడు ఈ రాముడు, కృష్ణుడు పాత్రలకు పెట్టింది పేరో ఆ పాత్రల ప్రస్తావనే లేదు. వాటే పీటీ?!
- వంశీకృష్ణ, 9573427422