Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనగనగా ఒక అడవి. ఆ అడవిలో రెండు కుందేళ్ళు. ఒకదాని పేరు చింటూ, రెండోదాని పేరు మింటూ. చింటూ చెడ్డదైతే, మింటూ మంచి కుందేలు. వాటి ఇళ్ళు కూడా పక్కపక్కనే వుండేవి.
చింటూ ఆహారం కోసం ఏ మాత్రం కష్టపడకుండా, మింటూ ఇంట్లో లేనప్పుడు వాళ్ళ ఇంట్లో చొరబడి అతని ఆహారం ఎత్తుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకుని కడుపునిండా తిని కాలుమీద కాలు వేసుకుని హాయిగా నిద్రపోయేది.
ఇంటికొచ్చిన మింటూకి ఆహారం కనిపించకపోయేసరికి, చాలా బాధ పడేది. చింటూనే ఈ పని చేస్తున్నదని అనుమానమున్నా, ఏమీ అనకుండా తనే బాధపడేది. ఎవరితోనూ చింటూ మీద చెడుగా చెప్పేది కాదు.
మింటూ మించితనాన్ని అలుసుగా తీసుకుని మిగతా జంతువులు దగ్గర మింటూ మీద లేనిపోనివి చెప్పి చెడ్డపేరు వచ్చేలా చేయాలని చూసేది చింటూ.
మింటూ మంచితనం మిగతా జంతువులన్నిటికి తెలుసు. అందుకే చింటూ మాటలు పట్టించుకోకుండా దాన్నే తిట్టేవి. చేసేదేమీ లేక నోర్మూసుకుని ఇంటికి వెళ్ళేది చింటూ.
అయినా చింటూ ఏ మాత్రం మారకుండా ఎప్పటిలాగే ఒక రోజున మింటూ ఇంట్లో చొరబడి ఆహారం కోసం వెతికితే ఎక్కడా ఏమీ దొరకలేదు. బాగా ఆకలి వేస్తుంటే ఆహారం కోసం అడవంతా గాలించింది. ఎక్కడా ఏమీ దొరకలేదు. తిరిగి తిరిగి అలసిపోయి ఆకలితో కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తే, ఒక చోట కూలబడి పోయింది.
ఆ దారిన చాలా జంతువులు వెళ్తూ చింటూని చూశాయి. దాని చెడ్డతనం తెలిసి ఈ జంతువూ పట్టించుకోకుండా వెళ్ళిపోసాగాయి. వాటి తీరుకి చింటూ బాధపడింది. ఆకలితో, దాహంతో నీరసంతో అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది.
ఆహారం, నీళ్ళు తీసుకుని ఆ దారిన వస్తున్న మింటూ, సొమ్మసిల్లి పడిపోయివున్న చింటూని చూసి బాధపడింది. తన దగ్గరున్న నీళ్ళు తాపించి, ఆహారం తినిపించబోయింది.
చింటూ కళ్ళమ్మట బొటబొటా కన్నీళ్ళు కారుస్తూ మింటూని కౌగలించుకుని ''నేను చాలా చెడ్డదాన్ని. నీ ఆహారం ఎత్తుకెళ్ళి తిని, నీపై అందరికీ చాడీలు చెప్పి, నీకు చాలా చెడు చేయాలని చూశాను. అయినా అవేమీ నీ మనసులో పెట్టుకోక, నన్ను ఆదరించి అభిమానిస్తున్నావు. నా తప్పు తెలిసింది. నేనూ మంచిగా మారతాను. ఇగ ఎప్పుడూ నిన్ను బాధ పెట్టను. నా ఆహారాన్ని నేనే కష్టపడి సంపాదించుకుంటాను. ఇన్నాళ్ళు నేను చేసిన నా తప్పులకు నన్ను క్షమించు'' అంది చింటూ.
చింటూ మారినందుకు మింటూ చాలా సంతోషించింది. ఆప్యాయంగా చింటూ కన్నీళ్ళు తుడిచి, ఆనందంగా చింటూని కౌగిలించుకుంది మింటూ.
నీతి : ఉపకారికి ఉపకారం తప్పకుండా చేయాలి. కానీ అపకారికి కూడా ఉపకారం చేయటం చాలా గొప్ప విషయం.
- మా.శ్రీ.రాజు,
9248791885