Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రత్యేక అభినందనలు
అంతరంగం చదివి ప్రభావితమై, నా ఆలోచనలకు పదును పెడుతున్నాను. రాజుల కొలువులో వుండే వందిమాగధులతో నేటి మీడియాను పోల్చిన 'అంతరంగా'న్ని అభినందించకుండా ఉండ లేకపోతున్నాను. ఎందుకు మీడియా ఆ విధంగా ప్రవర్తిస్తున్నదో కూడా చెప్పడం భేషుగ్గా ఉన్నది. ఆలోచనలు రేకెత్తించడం ఆలోచనా పరుల విధి. 'అంతరంగం' చేస్తున్నది అక్షరాల అదే కదా! ఓటేసి మరచి పోవడమే ఓటర్ పని. నిలదీస్తే తోడేలు నోట్లో తలే !!! అని 'చౌరస్తా' హెచ్చరించడం చదివి నేటి దుస్థికి చింతించాను. 'హదయమా పదిలమా!' కవర్ స్టోరీ ఆరోగ్యమే మహా భాగ్యం అని భావించే వారికి ఉపయుక్తంగా ఉన్నది. పొగ పీల్చే వారు, మందు కొట్టే వారు ''రాజ (ప్రభుత్వ ) పోషకులు కదా! అవి మానితే గుండె జబ్బులు రావు. మరి ప్రభుత్వాల మనుగడ సాగేదెలా ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న సుమా! షెహర్ ఔర్ స్వప్నా సినిమా కాదు. నిజ జీవిత సారం. నేటికి అది చెక్కు చెదరని నిజం.
- పంజాల నరసయ్య, ఈసిఐల్, హైదరాబాద్
మంచి శీర్షికలు
''పఠాభి సినిమా ప్రపంచం''అనే వ్యాసంలో సంస్కార అనే సినిమాను పరిచయం చేయడం, నవలను సినిమాగా మలచినపుడు కలిగే పరిణామాలు తెలియజేయడం చాలా బావుంది. వ్యాసం చివరి వరకూ ఆసక్తిగా చదివించింది.మంచి వ్యాసాలు అందిస్తున్న రచయితకి ధన్యవాదాలు. అలాగే మానవసంబంధాలను గురించిన అనువాద కథ ''హత్య'' చాలా బావుంది. మంచి కథను అనువదించి అందించిన రచయితకి ధన్యవాదాలు. ప్రతీ ఆదివారం మంచి శీర్షికలతో అలరిస్తున్న 'సోపతి' డెస్క్‌కు ప్రత్యేక అభినందనలు.
- పద్మావతి రాంభక్త, విశాఖపట్నం (మెయిల్)
కవర్ స్టోరీ బాగుంది
ఈ వారం ముఖచిత్ర కథనం 'హృదయమా పదిలమా!' వ్యాసం ఉపయోగకరంగా వుంది. పఠాభి సినిమా ప్రపంచం' చదివి పఠాభి రామిరెడ్డి గారి గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం.
- గుండు రమణయ్య, పెద్దాపూర్ (పెద్దపల్లి)
సినిమా సమాచారం విలువైనది
షార్ట్ ఫిల్మ్స్‌పై ఇస్తున్న సమీక్షలు ఆకట్టుకుంటున్నాయి. నిజానికి షార్ట్ ఫిలిమ్స్ గురించే కాక మొత్తం సినిమా రంగంంపై ఇస్తున్న సమాచారం విలువైనదిగా ఉంటున్నది. పఠాభి సినిమాకి ఇంత సేవ చేసినట్లు మాకు తెలియదు. ఆయనపై రాసిన వ్యాసం అద్భుత విషయాలను తెలియజేసింది. అట్లాగే వంటగది గురించిన విశేషాలు, చిట్కాలు బాగున్నాయి. నిజంగా చాలామంది వంటగది విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ఇంట్లోని వరండా, డ్రాయింగ్ రూములను ఉంచుకున్నంత శుభ్రంగా వంటగదిని ఉంచుకోరు చాలామంది. ఇందుకు కారణం వచ్చిన అతిథులు, స్నేహితులు వంటగదివరకు వచ్చేవారు తక్కువ కావడమేనేమో. ఎవరి మెప్పుదల కోసమో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం సరికాదు కదా. మన ఆరోగ్యం, సౌకర్యం ముఖ్యం.
-మణి, వరంగల్