Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీ... అంటే భారతీయుల జీవితాల్లో ఒక ప్రత్యేకత ఉంది. టీని ఇష్టపడని భారతీయులు ఉండరు. ఉదయం నిద్రలేవగానే శరీరం, మనసు ఉత్తేజితమవడానికి టీ తాగడం అలవాటు. నిర్ణయాలు తీసుకునేపుడు, స్నేహితులు కలిసినపుడు, బంధువులు ఇంటికి వచ్చినపుడు ఇలా ప్రతి సమయంలోనూ టీ కి ప్రాధాన్యత నిస్తుంటారు. అంతేకాదు, వేసవి కాలం, చలి కాలం, వర్షాకాలం ఏదైనా సరే ఒక కప్పు వేడి వేడి టీతో పాటు ప్లేటులో స్నాక్స్‌తో ఆస్వాదించడమనేది ఎవరూ ఎదురు చెప్పలేనిది. మార్కెట్లో అందుబాటులో ఉంటున్న అనేక బ్రాండ్లు, వివిధ రకాల టీ పొడుల వల్ల ఏది ఎంచుకోవాలనే విషయంపై గందరగోళానికి గురిచేస్తుంటాయి.
ఆరోగ్యకరమైనది, రుచి కలిగినది కావాలంటే ఆలోచనలోకి వచ్చేది ఆర్గానిక్ టీని ఎంచుకోవాలి. దీని వెనుక ఉన్న ముఖ్య కారణం.. కృత్రిమ ఎరువులు, కలుపు నివారణకు వాడే రసాయనాలు, పురుగు మందులు వంటివి ఇందులో ఎక్కువగా ఉండకపోవడమే. దీని వల్ల ఆహార సమగ్రతను కాపాడవచ్చు. జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించినట్లవుతుంది. ఆర్గానిక్ పంటలు పండించడానికి అధిక దిగుబడులు సాధించడానికి ప్రయత్నించే వారు కృత్రిమ పద్ధతులపై ఆధారపడరు.
దాహం చల్లార్చే పానీయాల కోసం, ఆరోగ్యాన్ని అందించే వాటి కోసం చూస్తున్నట్లయితే ఆర్గానిక్ టీని ఎంచుకోవడం చాలా మంచిది.సేంద్రియంగా పండించిన వాటిని తినడం, తాగడం వంటివి చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. రోజువారీ ఆహారంలో ఆర్గానిక్ టీని కూడా చేర్చుకుంటే దీర్ఘకాలికంగా ప్రకృతికి, శరీరానికి రెండింటికీ మేలు చేసినట్లవుతుంది.
మంచి రుచి : రుచిలో మామూలు టీ కంటే ఆర్గానిక్ తక్కువగా ఉంటుందని చాలా మంది దీనిని తీసుకునేందుకు ఇష్టపడరు. ఈ మొక్కలు పెంచడానికి కృత్రిమ ఎరువులు, పురుగు మందులు వాడరు. మంచి రుచితో పాటు పరిమళం కలిగి ఉంటుంది. కృత్రిమ ఎరువులతో పండించిన ఆకులకు ఆ రసాయనల పొర అంటుకునే ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ రసాయనాల వాసనే ఆకులో ఇమిడిపోయి అదే వాసన వస్తుంటుంది. ఇంత వరకు ఆ టీని ఆస్వాదించకపోయినా, దాని గురించి తెలుసుకోలేకపోయినా రెండు ఒకేలా ఉంటాయి.. ఏం తేడా ఉండదు అనే అపోహ చెందే అవకాశం ఉంది.
ఆరోగ్య పరంగా : శరీరంలో విష పదార్థాలు పెరగకుండా నియంత్రించగలుగుతుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఆర్గానిక్ టీ తాగడం అంటే శరీరానికి ఉపకారం చేస్తున్నావనే అర్థం.
దంతాలకు మేలు : మిగిలిన ప్రయోజనాలకంటే ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. ఎందుకంటే.. సేంద్రియంగా పండించిన తేయాకు మొక్కలు నేలలో ఉండే ఫ్లోరైడ్‌ను గ్రహిస్తాయి. ఫ్లోరైడ్ అనేది పళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి గట్టిపడడానికి ఉపయోగపడుతుంది. అందుకే టూత్‌పేస్టులు, మౌత్ వాష్‌లలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. రోజు ఆర్గానిక్ టీ తాగడం వల్ల పళ్ళలో ఏర్పడే కావిటీలు, క్రిముల వల్ల ఏర్పడే సమస్యలను నివారిస్తుంది.
సాధ్యమైనంత త్వరగా కృత్రిమ రసాయనాలతో పండించిన టీ నుంచి సేంద్రియంగా పండించిన టీ వైపు అడుగులు వేయండి...
- అంకం రమాదేవి