Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తూర్పు సైబీరియా ప్రాంతంలో నివసిస్తున్న యాకుత్ ప్రజలు కష్టజీవులు. ప్రకృతితో నిరంతరం పోరాటం చేస్తూ మనుగడ సాగిస్తున్నారు. ఈ ప్రజలు నివసిస్తున్న ప్రాంతాన్నంతా కలిపి సఖ లేక యకూటియా అటానమస్ రిపబ్లిక్ గా వ్యవహరిస్తున్నారు.
ప్రధానంగా యాకుత్ ప్రజలు పశువులు, గుర్రాలను సాకుతూ బతుకుతారు. పూర్వం తమ పశువులను తీసుకుని ఏడాదిలో రెండు సార్లు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. ఇప్పుడు పరిస్థితిలో కొంత మార్పు ఉంది. శీతాకాలంలో యాకుత్ ప్రజలు 'బలగాన్' అని పిలిచే ఇంట్లో నివసిస్తారు. పేడ, మట్టి, కర్రలు, మొద్దులతో నిర్మించే ఈ ఇండ్లు చలిని తట్టుకోవడానికి బాగా అనువుగా ఉంటాయి. వేసవి కాలం వచ్చేటప్పటికి వీరు 'ఉరసా' అని పిలిచే మరో రకం ఇండ్లలోకి మారిపోతారు. ఇవి చెట్ల బెరడుతో నిర్మితమయ్యే ఇండ్లు. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయ గృహాల్లో నివసించడం కొంత తగ్గిందనే చెప్పవచ్చు.