Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్రెండ్సందరూ సైకిల్ కొనుక్కోవడంతో తనకూ సైకిల్ కొనివ్వమని గొడవచెయ్యసాగాడు అఖిల్. సైకిల్ కొనివ్వాలని అతని తల్లిదండ్రులు నిర్ణయించుకొన్నారు. అఖిల్ , వాళ్ళ నాన్న ఇద్దరూ కలిసి సైకిల్ కొనడానికి షాపుకి బయల్దేరారు.
అఖిల్ దారిలో కనిపించిన ఓ సైకిల్ని చూపించి.... ''నాన్న...ఈ సైకిల్ కావాలి'' అన్నాడు.
కొడుకు చూపించిన సైకిల్వైపు చూసాడు అఖిల్ తండ్రి. తన పక్కనే ఓ పన్నెండు, పదమూడు సంవత్సరాల వయసున్న వివేక్ అనే అబ్బాయి మూడు చక్రాల బండి నడుపుకొంటూ ట్రాఫిక్ జాం వల్ల రోడ్ ప్రక్కగా నిలబెట్టాడు. అఖిల్ ఆ బండి హేండిల్ను గట్టిగా పట్టుకొన్నాడు.
అఖిల్ తండ్రి ఏం చెబుతాడా అని బాధగా, భయం భయంతో చూడసాగాడు వివేక్. వెంటనే వెళ్లి పోదామన్నా, ట్రాఫిక్ జాం వల్ల ముందుకు వెళ్లే అవకాశం లేదు.
ఒక వారం రోజుల క్రితం ఇలాగే ఒక చిన్న అమ్మాయి మూడు చక్రాల బండి కావాలని అడిగినందుకు, తను పక్కనే వున్నానన్న ద్యాస అయినా లేకుండా ఆ అమ్మాయి తల్లి ''అది కాళ్ళు, చేతులు లేని కుంటి వాళ్ళు నడిపే బండి'' అని అసహ్యంగా చెప్పడం వివేక్ మనసును బాధించింది.
ఇప్పుడు అఖిల్ తండ్రి కూడా అలాంటి మాటలంటూ తన మనసును బాధిస్తాడేమోనన్న అనుమానం కలిగింది వివేక్కి.
అఖిల్ తండ్రి ఒక్క క్షణం అలోచించి ''ఇప్పుడు అంత డబ్బులు లేవు అఖిల్ ....'' అన్నాడు.
''నాకు ఇలాంటి సైకిలే కావాలి'' అంటూ ఆ సైకిల్ హేండిల్ గట్టిగా పట్టుకొని ఏడుపు ప్రారంభించాడు అఖిల్.
ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అఖిల్ తండ్రికి. పక్కనే ఆ వివేక్ లేకుంటే అర్థం అయ్యేలా చెప్పేవాడు.
''అఖిల్... షేమ్షేమ్ పప్పీ షేమ్...'' అంటూ గట్టిగా చెప్పట్లు కొట్టాడు వివేక్.
వెంటనే తన షర్ట్, ప్యాంట్ బటన్స్ ఒకసారి చూసుకున్నాడు అన్నీ సరిగ్గానే ఉన్నాయి. ''ఎందుకు షేమ్ షేమ్ అంటున్నావు'' చిరు కోపంతో అన్నాడు అఖిల్.
''నీకు అడగడానికి వేరే బండి దొరక లేదా? అసలు ఈ బండి ఎవరు వాడుతారో తెలుసా?'' వివేక్ అడిగాడు.
''ఎవరు వాడుతారు?'' అన్నాడు అఖిల్.
''చదువురాని వాళ్ళు వాడతారు. నువ్వు ఇలాంటి బండి కొనుక్కున్నావంటే, అందరు నిన్ను కూడా షేమ్షేమ్ పప్పీషేమ్.చదువు రాని మొద్దు అని అంటారు'' కళ్లింత పెద్దవిగా చేస్తూ వివేక్ చెప్పాడు.
''ఆ బండి ఎక్కితే చదువురాని మొద్దు అంటారా?'' తిరిగి ప్రశ్నించాడు అఖిల్.
''కావాలంటే నువ్వూ కాస్సేపు కూర్చో అందరూ నిన్ను షేమ్ షేమ్ అంటారు. చదువురాని మొద్దు అంటారు. ఆ తరువాత నిన్ను స్కూల్ వాళ్ళు కూడా రావద్దంటారు'' చెప్పాడు వివేక్.
''నాన్నా... ఈ బండి నాకు వద్దు. పెద్దయ్యాక అన్నయ్యకు తీసిచ్చినట్లు బైక్ కోనివ్వు'' అన్నాడు అఖిల్.
సమయస్ఫూర్తితో వ్యవహరించిన వివేక్ తలను నిమురుతూ మనసులోనే కృత్ఞతలు చెప్పుకొన్నాడు అఖిల్ వాళ్ళ నాన్న.
మూడు చక్రాల బండిలో కూర్చొన్న వివేక్ తన మనసు ఎక్కడ బాధపడుతుందోనని వికలాంగుడు అన్న పదం ఉపయోగించకుండా ప్రవర్తించిన అఖిల్ తండ్రి వైపు చూస్తూ కృతజ్ఞతా పూర్వకంగా చేతులు జోడించాడు.
- ఓట్ర ప్రకాష్ రావు,
09787446026