Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండవ తరగతిలో ఉన్నప్పుడు తనకు డ్రాయింగ్ కాంపిటీషన్లో ప్రైజ్ వచ్చిందని టీచర్ ఎనౌన్స్ చేస్తే ''ఓహో! నేను పెద్ద ఆర్టిస్ట్నన్నమాట'' అనే భావం మొగ్గతొడిగింది. ఆ ఆలోచనతోనే పెరిగి పెద్దదైంది కవితా షా. కాలేజ్‌లో చేరే సమయం వచ్చినప్పుడు హోమ్‌సైన్స్, ఎకనామిక్స్, ఫైన్ ఆర్ట్స్... ఈ మూడింటి మధ్య ఎందులో చేరాలి అనే సందేహం కల్గిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కవితా షా చేసిన కళాయాత్రను కండ్లకు కడుతున్నది ఈ ఇంటర్యూ...
మరి అన్నింటికంటే ఫైన్ ఆర్ట్స్ మీకు ఇష్టమనుకుని చేరారా?
లేదు. నేను గొప్ప డ్రాయింగులు ప్రాక్టీస్ చేసింది కూడా ఏమీ లేదు. నాకు ఎకనామిక్స్ సబ్జెక్ట్ బాగా వచ్చేది. హోమ్‌సైన్స్ సబ్జెక్ట్ కూడా నచ్చేది. మా అమ్మ ''ఇల్లు చూసుకోవటం, వంట చేయడం నేను నేర్పుతాలే. చిన్నతనం నుండీ ఆర్టిస్ట్‌ని అవుతానన్నావుగా, ఫైన్ ఆర్ట్స్‌లో చేరు. హోమ్‌సైన్స్ ఎందుకు?'' అంది. అందువల్ల ఫైన్ ఆర్ట్స్‌లో చేరాను. మేం బరోడాలో వుంటాం కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్లో చేరటం గొప్పగా అనుకుని చేరాను.
చేరాక ఎంజాయ్ చేశారా?
నాకేమీ అర్థమయ్యేది కాదు. బి.ఎ. పెయింటింగ్‌లో చేరాను. నా చుట్టుపక్కల స్టూడెంట్స్ అందరూ ముందే ఎంతో డ్రాయింగ్ ప్రాక్టీస్ చేసి వచ్చినవాళ్ళు. అందమైన బొమ్మలు అంటూ బిందె పట్టుకుని నిల్చున్న అమ్మాయిలు లను చిత్రించడం ఇంటలిజెంట్ ఆర్ట్ కాదనేవాళ్ళు బరోడా ఫైన్ ఆర్ట్స్‌లో. నస్రీన్ మహమది అని ఒక టీచర్ వుండేవారు. ఆమె మాకు ఏ విషయమైనా, వస్తువైనా వాటి రంగులూ, గీతలూ, విషయ భావాలూ ఎలా గమనించి ఆనందించాలో, అంతే సున్నితంగా చూసిన విషయాన్ని ఎలా డ్రాయింగ్, పెయింటింగ్‌లోకి మార్చాలో చెప్పి ప్రాక్టీస్ చేయించేవారు. ఇంతలోకి క్లాస్‌లో కొంతమంది ఫ్రెండ్స్ అవటం, ఈ చదువూ ఆనందించటం మొదలుపెట్టాను.
మీరు ప్రింట్ మేకర్‌గా పేరు పొందారు గదా...
బి.ఎ. పెయింటింగ్ తర్వాత 1983లో ఎం.ఎ. ప్రింట్ మేకింగ్ స్పెషలైజేషన్ తీసుకున్నాను. ఈ మీడియంలో పని చేయటం, లిథో ప్రేమ్ తిప్పటం, ప్రింట్లు తీయటం ఇవన్నీ లెబోరియస్ వర్క్. ఆ రోజుల్లో ఆడప్లిల్లలెవరూ ఈ స్పెషలైజేషన్ తీసుకునేవారు కారు. కానీ అలవాటయ్యాక నేను ఎంజారు చేయటం మొదలుపెట్టాను.
మీరు బయట దేశాలలోనూ ప్రింట్ మేకింగ్ అభ్యాసం చేశారనుకుంటాను.
అవును. కొన్ని ఫెలోషిప్‌లు, ఇన్విటేషన్ల మీద బయట దేశాల్లో ప్రింట్ మేకింగ్ చేసి వచ్చాను. ప్రింట్ మేకింగ్ కళలో కొన్ని ఇబ్బందులున్నాయి. శిల్పం, చిత్రంలా ఈ మీడియం సమాజానికి అంత పరిచితం కాదు. అంతర్జాతీయ సంఘాలు కొన్ని వున్నాయి ప్రింట్ మేకింగ్ ఆర్టిస్టుల కోసం. అందులో సభ్యత్వం పొందాను. ఆ విధంగా ఒక సంస్థ బరోడాలోనూ నిర్మించాలనిపించింది. 1997లో 'ఛాప్' అనే ప్రింట్‌మేకింగ్ స్టూడియోను స్థాపించాను. దీని ఉద్దేశ్యం ముఖ్యంగా ప్రింట్‌మేకింగ్ చేయాలంటే పెయింటింగ్ ప్రెస్, స్టూడియో విడిగా వుండాలి. ఎవరైనా కావాలంటే వచ్చి ఈ ఛాప్ స్టూడియోస్ వాడుకోవచ్చు. కళాకారులు చాలామందితో కలిసి కొన్ని వర్క్‌షాప్‌లు కూడా చేశాను. తరువాత ఎక్సేంజ్ ప్రోగ్రాములు, రెసిడెన్సీలు మొదలుపెట్టాను. బయట దేశాల నుండి కళాకారులొచ్చి ఇక్కడ వుండి పని చేసుకుంటారు. వాళ్ళకు ఏదైనా కొత్తరకం టెక్నిక్‌లు వస్తే ఇక్కడి కళాకారుల కోసం వారితో వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తాను.
మీ వర్క్‌షాపుల గురించి చెప్పండి
ఈ మీడియమ్‌లో ఎన్ని చాలెంజెస్ వున్నాయో అన్ని సర్ప్రైజెస్ కూడా వున్నాయి. పని మొదలుపెట్టాక డ్రాయింగ్ నుండి ప్రింట్ చేతికి వచ్చేవరకు చాలా ప్రాసెస్ వుంటుంది. ప్రతీ స్టేజ్‌లోనూ ఏదైనా ఊహించని మార్పులు జరగవచ్చు. పూర్తయ్యే లోపల మనం పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయిపోతాం. ఆ సర్ప్రైజెస్ వలన ఒక గేమ్ లాగా కూడా వుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇందులోని సర్ప్రైజ్ ఎలిమెంట్ నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు యాసిడ్ వంటి వస్తువులు వాడేవాళ్ళం. ఛాప్ ద్వారా నేను కొంతకాలంగా నాన్ టాక్సిక్ వస్తువులు వాడే పద్ధతులని చెప్పటానికి చాలా చోట్ల వర్క్‌షాపులు చేస్తున్నాను. ఇప్పుడు ఎన్నో కొత్త టెక్నిక్‌లు వచ్చాయి.
ఈ మీడియమ్‌లోని ఇబ్బందుల వలన చాలామంది కళాకారులు ఈ మీడియమ్ వదిలి పెయింటింగ్ చేస్తుంటారనుకుంటాను.
ప్రింట్లకి ఆర్ట్ మార్కెట్ కూడా ప్రోత్సహించదు. ఆర్ట్ కాలేజీలు ప్రింట్లు కొనుక్కోవటానికి ఇష్టపడరు. 10, 12 ఏళ్ళ క్రితం 'ఫుట్‌ప్రింట్స్' అనే ఒక ఎగ్జిబిషన్ చేశాను. అంతర్జాతీయంగా ప్రింట్‌మేకింగ్ చేస్తున్న స్త్రీ కళాకారుల ప్రింట్స్ తీసుకుని ప్రదర్శన చేశాను. నా గురువుల నుండి నా తరం వారు ఇందులో పార్టిసిపెంట్స్. అందరినీ నేను అడిగిన ప్రశ్న ఇదే... ఈ మీడియమ్‌లో వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటని!
మీ ప్రింట్లలో డిజైన్ పాట్రన్స్ ఎక్కువగా కనిపిస్తాయి.
నేను భోపాల్ ప్రింట్ మేకింగ్ స్టూడియోలో పని చేస్తున్నప్పుడు ట్రైబల్ ఆర్టిస్టులతో పాటు ఒక వర్క్‌షాప్ చేశాం. వారి కళలో డిజైన్లు, మోటిఫ్‌లు ఎక్కువగా కనిపిస్తాయి. అవి చూసి నాకు ఇన్స్పైరింగ్గా అనిపించింది. మన జీవితంలోనూ ఒక డిజైన్ పాట్రన్ వుంటుంది. ప్రతివాళ్ళకూ వారి పనిలో వారి వ్యక్తిత్వం ప్రకారం ఒక పాట్రన్ వుంటుంది. ఆ ఆలోచనలతోనే ఈ డిజైన్ పాట్రన్లు నా పనిలోకి తెచ్చాను.
మీ పనిలో మీకు నచ్చిన కొన్ని ప్రింట్స్ గురించి చెప్పండి.
నా వర్క్‌లు ఒక ఆలోచన నుండి ఇంకో ఆలోచనకు ప్రయానించినట్లు... అలా సాగుతూ వుంటాయి. ఒకసారి బాక్స్ డబ్బాల థీమ్ పై పనిచేస్తాను. అందులో మూడు స్టేజెస్ వుంటాయి. ఒకటి ఖాళీ, రెండవ స్టేజ్‌లో మనం జీవితంలో అన్నీ కూడపెట్టుకున్నట్టు అందులో వస్తువులు, పూలు వుంటాయి. చివరికి మళ్ళీ జీవితం ఖాళీ అయినట్టే డబ్బా కూడా ఖాళీ అవుతుంది. బాక్స్‌తో మార్కెట్, కాపిటలిజమ్ వంటి వ్యాపార ఆలోచనలూ జోడించి వున్నాయి. 'కింగ్ అండ్ ఐ' అనే ఇంకో ప్రదర్శన కూడా చేశాను.
మీ పనీ, ఛాప్ స్టూడియో పనీ రెండూ అలా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకువెళ్ళటం అభినందనీయం. ఛాప్లో రాబోయే కొత్త ప్రోగ్రామ్‌లు ఏంటి?
ప్రతిదీ డబ్బుతో ముడిపడి వుంటుంది. మళ్ళీ కొత్త ప్రోగ్రామ్‌లు చేయాలంటే ఇంకా ఫండ్స్ కూడా రావాలి.
- డా||ఎం.బాలామణి,
81067 13356