Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అమ్మా చూశావా.. అన్నయ్య నన్ను నా ఫ్రెండ్ ఇంటిదగ్గర డ్రాప్ చెయ్యమంటే చెయ్యనంటున్నాడు'' ఫిర్యాదు చేశాడు శశాంక్.
''ఎందుకు సిద్ధూ... నువ్వెలాగూ వెళ్ళేదారే కదా? వాడేదో నోట్స్ రాసుకోవాలట డ్రాప్ చేయొచ్చు కదా?'' చెప్పింది తల్లి.
''వీడెప్పుడూ ఇంతే. వాడి పనులు మాత్రం నంగనాచిలా నీతో, నాన్నతో చెప్పి నా ద్వారా చెయించుకుంటాడు కానీ, నాకు మాత్రం ఏ విధంగానూ సాయపడడు'' ఉడుక్కున్నాడు సిద్ధార్ధ్.
''నేను ఏ విషయంలో సహాయం చెయ్యలేదు అన్నయ్యా నీకు?'' అడిగాడు శశాంక్.
''మొన్న నీ పుట్టినరోజుకు మామయ్య కొనిపెట్టిన కాస్ట్లీ పెన్ నా పరీక్షలకోసం ఇవ్వమంటే ఇవ్వలేదుగా?'' అన్నాడు కోపంగా సిద్ధార్ధ్.
''అది నాకెంతో ఇష్టమైంది అన్నయ్యా. దాన్ని నేను కూడా అవసరమైతే తప్ప వాడకూడదని భద్రంగా మామయ్య గుర్తుగా దాచుకున్నాను'' చెప్పాడు శశాంక్.
''ఏమిట్రా మీగొడవ మళ్ళీ మొదలైనట్టుంది?'' ఆఫీసునుంచీ వచ్చి ఫ్రెషప్ అయ్యి తనగదిలోంచీ వస్తూ అడిగాడు తండ్రి నాగేంద్ర.
''చూడండి.. పెద్దాడు ఏదో అడిగితే చిన్నాడు ఇవ్వలేదుట. అందుకని ఇప్పుడు పెద్దాడు చిన్నడ్ని వాడి స్నేహితుని ఇంటిదగ్గర వదిలిపెట్టడట'' చెప్పింది తల్లి రాధిక.
''ఓహో... అయితే అత్మాభిమానమన్నమాట. చూడండిరా పిల్లలూ అత్మాభిమానం ఉండాల్సిందే. కానీ, దాని అవసరం గుర్తించాలి. వాడు పెన్ ఇవ్వకపోతే నువ్వు మరో పెన్‌తో రాసినా ప్యాసవగలవు. కానీ, వీడిప్పుడు ముఖ్యమైన నోట్స్ రాసుకోకపోతే అసలు ఏ పెన్‌తో రాసినా పరీక్ష పాసవలేడు కదా?'' అన్నాడు తండ్రి.
''అదేం కాదు. మీకు వీడంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే వాడివైపు మాట్లాడుతారు'' ముఖం ముడుచుకున్నాడు సిద్ధార్ధ్.
''చూడు సిద్ధూ... మొన్న మనదేశ రహస్యాలను ప్రాణం పోయినా చెప్పనన్నాడు అభినందన్ అనే మన దేశ వీర పైలెట్. ఎందుకంటే, అది తన ఒక్కడికి సంబంధించినదైతే చెప్పేయవచ్చు. కానీ, మొత్తం దేశానికే హానిచేస్తుందని భావించాడు.
అంటే, వాళ్ళు కొట్టారు కదా? నన్ను అవమానిస్తే నా ఆత్మాభిమానం దెబ్బతినదా? అని అనుకోకుండా, కోట్లమంది దేశ ప్రజల ఆత్మాభిమానం ముఖ్యమని తన అవమానాన్ని దిగమింగాడు కదా? అదీ అసలైన ఆత్మాభిమానమంటే. దాన్నొక స్పూర్తిగా మనదేశ యువత తీసుకోవాలి. అది ఎంత చిన్న విషయమైనా, ఎంత పెద్ద విషయమైనా సరే, ఆత్మాభిమానం ఉండాల్సిందే. కానీ, సిల్లీ విషయాల్లో మాత్రం కాదు. రేపు ప్యాసయ్యాక తమ్ముడు నీ ముందు చెప్పకపోవచ్చు గానీ మా అన్నయ్య ఇలా హెల్ప్ చేశాడు, అలా హెల్ప్ చేశాడు అంటూ తన స్నేహితులతో చెప్పుకుంటాడా లేదా చెప్పు?'' అన్నాడు తండ్రి.
మొన్నామధ్య శశాంక్ స్నేహితుడు ఇంటికి వచ్చినపుడు ''అన్నయ్యా! మ్యాథ్స్‌లో మీరు శశాంక్‌కి బాగా హెల్ప్ చెస్తారట కదా? అందుకే ఇంత మంచి మార్కులు తెచ్చుకోగలుగుతున్నా అని చెప్పాడు శశాంక్. నాకూ నీలాంటి ఒక అన్నయ్య ఉంటే ఎంతబాగుండేదో'' అని చెప్పటం గుర్తొచ్చింది సిద్ధర్ధ్కి.
''చూడూ... నోట్స్ రాసుకోవటం కాదు, బాగా చదువుకుని సిద్ధార్ధ్ తమ్ముడ్రా అనిపించాలి. తెలిసిందా? ఎక్కు బండి'' హుకుం జారీచేసినట్టు అంటూ బండి స్టార్ట్ చేశాడు సిద్ధార్ధ్.
వెళ్తున్న అన్నదమ్ములవంక పెద్దల మాటకు విలువ ఇచ్చినందుకు ఆనందంగా చూశారు రాధిక, నరేంద్ర.
- డేగల అనితాసూరి,
9247500819.