Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవర్ స్టోరీ బాగున్నది
టెలిఫోన్ కనిపెట్టిన గ్రహంబెల్ పనికి ఆటంకమని తలచి తన ఆఫీసులో ఫోన్ పెట్టిచ్చుకోలేదని చదివి అవాక్కయ్యాను. నేటి తరం అదే పనిగా పనిని చెడగొట్టే చర వాణులకు బానిసలవడం క్షమింపరాని నేరం. మొబైల్ వాడకాన్ని ,పని వేళలో చాలా సంస్థలు నిషేధిస్తున్నవి. ఏది ఏమైనా మొబైల్ జీవులు మేలుకోవాలి. ఎప్పుడు మేలుకుంటారో అనేదే ప్రశ్న. ఎమ్మేల్యేల ధర (కార్టూన్) గురించి చదివి చింతించాను, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నందుకు, వారు అంగడి సరుకుగా మారి నందుకు. నిరుద్యోగ భ తికి ఎవరు అర్హులు అనే ప్రశ్న లేవనెత్తి ఆలోచింప చేసే జవాబును అందించిన 'చౌరస్తా' గురించి ఏమని చెప్పను? ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం స్థాపన విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఒక నిర్ణయానికి రాకపోవడం ఎంతైనా శోచనీయం. కేంద్రం పట్టిచ్చుకొని మైసూర్లో ప్రారంభించడం ముదావహం. ఈ విషయం పై కవర్ స్టోరీ చదివి అది చేపట్టిన కార్యక్రమాల గురించి తెలుసుకున్నాము. ఆఫీస్ తప్ప మరో లోకం తెలియని ''మర''మనుషులు భువన్ షోమే తప్పక చూడాలి, వారికి చూపించాలి.
- పంజాల నరసయ్య; ఈసీఐల్, హైదరాబాద్
ఆ సంగతే తెలియదు
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో చేతివ్రాత ప్రతుల గ్రంథాలయం మరియు పరిశోధనాలయం ఉందని మాకు తెలియనే తెలియదు. అది ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం వర్క్‌షాపుకు వేదిక కావడం సంతోషించదగిన పరిణామం. ఇన్ని రాతప్రతులను సంరక్షించడం మామూలు విషయం కాదు. ఎక్కడి నుంచో పరిశోధకులు వచ్చి ఆ పరిశోధనాలయాన్ని ఉపయోగించుకుంటున్నారని రాశారు. మరి స్థానికుల మాటేంటి? మన ఇంటిపక్కన ఎవరున్నారో తెలుసుకోలేని తీరిక, ఓపిక లేని జీవితాలు మనవి. ఇక ఇటువంటి అరుదైన, విలువైన భాండాగారాల గురించి ఎంతమంది తెలుసుకుంటారు? తెలుసుకుని ఉపయోగించుకోవాలని ఆకాంక్ష.
- మనీష, హైదరాబాద్
మాయమై పోతున్నడమ్మా...
ఈవారం మరమనుషులై పోతున్న మనుషుల కథంటూ రాసిన సినీ వ్యాసం అద్భుతంగా ఉన్నది. ఈ వ్యాసం చదువుతుంటే ఇందులోని పాత్రల లక్షణాలు నాలోనూ ఉన్నాయనిపించింది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అంటూ ఓ రచయిత రాసిన పాట ఈ సందర్భంగా గుర్తొస్తున్నది. ఇది నా ఒక్కడి అనుభవమే అయిఉండదు. చాలామంది నాలాగే ఫీల్ అయి ఉంటారు. ఇక ఈవారం కథ కూడా బాగానే ఉన్నది. నిడివి తక్కువ కథలు, సింగిల్ పేజీ కథలు ప్రచురిస్తే బాగుంటుంది. ప్రింట్ మేకింగ్ కళలో ఆరితేరిన కవితా షా ఇంటర్వ్యూ కళలో ఆమె పైకి వచ్చిన విధానాన్నే కాక స్త్రీలు ఎందులోనూ తక్కువ కాదు అన్న సందేశాన్ని అంతర్లీనంగా ఇచ్చింది.
- బి.ప్రభాకర్, నల్లగొండ
బాగుంది
ఈ వారం సంచికలోని ముఖచిత్ర కథనం 'ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం తొలి అడుగులు' మంచి వ్యాసం. 'చర్నాకోల' కార్టూన్లు నవ్విస్తున్నాయి. 'చౌరస్తా' వ్యాసం బాగుంది. - గుండు రమణయ్య, పెద్దాపూర్ - పెద్దపల్లిన