Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ముందు మీరు కూర్చోండి', 'మీ మైకు లాగేసుకుంటున్నా', 'ప్రతిపక్ష సభ్యులు హుందాగా ప్రవర్తించాలి', 'సస్పెండు చెయ్యక తప్పటం లేదు', 'అధికార సభ్యుల్ని మాట్లాడనీయండి' వంటి మాటలు బాగా బట్టీపట్టి కొత్త సభను కొత్తగా నడిపించడానికి కొత్త స్పీకరు తన కుర్చీలో కూర్చున్నాడు. ఏదో విధంగా ప్రతిపక్ష సభ్యుల నోర్లు మూయించాలన్న తియ్యటి ఊహల్లో ఊయలూగుతూ!
గొంతు సవరించుకుని ప్రేమగా మైకుని తడిమి చూసుకుని కళ్ళు విప్పదీసుకుని సభను తేరిపారచూశాడు. ఉలిక్కిపడ్డాడు. కళ్ళజోడు మసకబారిందేమోనని చెవుల మీదనించి ఊడదీసి కర్చీఫ్ అంచుతో తుడిచి ఉఫ్ఫని ఊది మళ్ళీ చెవులకి తగిలించుకుని చూశాడు. మళ్ళీ ఉలిక్కిపడ్డాడు.
సభలో అధికార పక్షం సభ్యులు మాత్రమే కనిపించారు. ఏమిటిది ప్రతిపక్ష సభ్యుల సీట్లన్నీ ఖాళీగా వున్నాయి. బావురుమంటున్నయి అనుకున్నాడు సభాధ్యక్షుడు. అసలు సభ ప్రారంభం అవకముందే ప్రతిపక్ష సభ్యులంతా 'వాకవుట్' చేశారా? అట్లా చెయ్యడానికి రూల్స్ ఒప్పుకోవే అనుకున్నాడు ఆ మాటే పైకనేశాడు.
'సభలో వున్న అధికారపక్షం సభ్యులకి సభలో లేని రాని లేదా వచ్చి 'వాకౌట్' చేసి వెళ్ళిపోయిన ప్రతిపక్షాల సభ్యులకి స్వాగతం!'
అధ్యక్షుడి తొలిపలుకులు విన్న సభలో రకరకాల నవ్వులు మార్మోగినవి. కరతాళ ధ్వనులు హోరెత్తినయి. ఓ మూలనించి ఈలలు మరో మూలనుంచి కేకలు పై కప్పును 'ఢ' కొట్టినయి. సభ సద్దుమణిగాక అధికార పక్షం సభ్యుడు ఒకరు లేచి
'అధ్యక్షా! తమరు పొరబడుతున్నారు! తాము తమ కళ్ళజోడు తుడిచి మళ్ళీ మళ్ళీ చూసిన దృశ్యం వాస్తవ దృశ్యమే. సభలో వున్నది మేమే. మేమంటే మేమే. మేమనగా అధికార పక్షానికి చెందిన సభ్యులమే. సభకు రానివాళ్ళు, వచ్చినా వాకౌట్ చేసిన వాళ్ళు అంటూ ఎవరూ లేరు. అసలు ప్రతిపక్ష సభ్యులే లేని మహత్తరమైన సభ ఇది' అన్నాడు.
సభాధ్యక్షుడు ఖంగుతిని కంగారుపడి బేజారైన ముఖం పట్టాడు.
'ఇది చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖింప దగిన సందర్భం. ఇది 'మజాబుక్కు'లోనో, మరేదో బుక్కులోనో రికార్డు చెయ్యవలసిన సమయం' అన్నాడు మరో సభ్యుడు.
'మరి ప్రతిపక్షాలకు ఎన్నికయిన సభ్యులంతా ఏమయ్యారు నాకు తెలియాలి. నాకు తెలియకుండా ఏదీ జరగదు కదా!' అంటూ చిన్నబోయేడు అధ్యక్షుడు.
'ప్రతిపక్షాల సభ్యులంతా హుష్కాకి అయ్యేరు అధ్యక్షా!' అన్నాడొక సభ్యుడు ఆ మూల నుంచి.
మా వృత్తి రాజకీయం. మేమంతా రాజకీయ నాయకులం. ప్రజాసేవకులం. ఎన్నికలప్పుడు తప్ప తర్వాత మాకు తరతమ బేధాలు వుండవు. మేమంతా ఒక్కటే మా లక్ష్యం ఒక్కటే!' అన్నాడొక సభ్యుడు. ఈ సభ్యుడు 'లైఫ్ టైం' మంత్రిగా ఉండటానికి ఏమైనా చేసేవాడు. ఏ పార్టీ టికెట్టు దొరికితే ఆ పార్టీ నుంచి గెలిచి అటు పిమ్మట అధికార పార్టీలో దూరి మంత్రిపదవి కొట్టేస్తాడు. ఆయన అన్న 'లక్ష్యం' అనే మాటకు అర్థం అదే!
'అవును అధ్యక్షా వేరువేరు పార్టీలూ జండాలూ ఉత్తుత్తివే. ఎన్నికలప్పుడు 'బీఫామ్' కోసం ఎన్నో చేస్తాం. తర్వాత 'ఫామ్'లోకి రావడానికి అధికార పక్షంలో చేరతాం. ప్రజాసేవ చెయ్యాలి కదా మరి' అన్నాడొక సభ్యుడు.
ఆయనని గుర్తుపట్టాడు అధ్యక్షడు.
'అరే! తమరు అధికార పక్షం సీట్లో ఉన్నారేం? ప్రతిపక్షంలో కదా ఉండాల్సింది' అన్నాడు ఎలాగైతే నేం ప్రతిపక్షానికి చెందిన సభ్యుడ్ని పట్టుకోగలిగినందుకు తెగ సంబరపడుతూ.
'అధ్యక్షా! క్షమించాలి. నేను మాజీ ప్రతిపక్ష సభ్యుడ్ని. కానీ ప్రస్తుతం అధికారపక్ష సభ్యుడ్ని. నాకు మంత్రిపదవి, మా అబ్బాయికి ఎం.ఎల్.సీ పదవి దక్కబోతున్నాయి వారి దయవల్ల' అన్నాడా సభ్యుడు అధికార పక్షం నాయకుడి వైపు భయంతో కూడిన భక్తితో వచ్చిన ప్రేమతో, గౌరవంతో.
అధ్యక్షా! తమరు బెంబేలు పడవలసిన పనిలేదు. అతి తక్కువ సీట్లు వచ్చిన ఒకటి రెండు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు సభకు రాలేదు కానీ ప్రధాన ప్రతిపక్షం వాళ్ళంతా అధికార పక్షంతో మమేకమయ్యారు. నదులన్నీ సముద్రంలో కలవాల్సిందే కదా! ప్రజాస్వామ్యంలో ప్రజలసేవే అన్నింటికంటే ముఖ్యం ఆ అవకాశం అధికార పక్షంలో ఉంటేనే కదా దక్కేది అంచేత ప్రజలమీద భక్తిచేత వాళ్ళంతా మా పార్టీలో చేరిపోయారు. వాళ్ళని మేం బలవంతం చెయ్యలేదు, భయపెట్టలేదు, ప్రలోభపెట్టలేదు' అన్నాడు అధికార పక్షం నాయకుడు.
'అవును అదేనిజం. ప్రతిపక్షపార్టీ సభ్యుడిగా మొన్న ఓ ఆఫీసుకి వెళ్తే ఆఫీసరు కుర్చీ చూపకపోగా అడవిలో సింహం జూలో సింహం ఒక్కటి కాదు గదా అని జోక్ చేశాడు. ఆ సాయంత్రమే అడవి సింహంగా మారిపోయా' అన్నాడు ఓ సభ్యుడు ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి 'జంపు' చేసినందుకు సిగ్గులేకుండా గర్వపడుతూ.
'ప్రతిపక్షం లేకుండా సభ ఉప్పులేని పప్పులా చక్కెర లేని చారులా తుప్పు పట్టిన కత్తిలా గుళ్ళు లేని పిస్తోలులా వుంటుందని బాధపడకండి. అప్పుడప్పుడు మా వాళ్ళే ప్రతిపక్ష సభ్యులుగా 'యాక్ట్' చేసి సభను రంజింపచేస్తారు లెండి' అన్నాడు అధికార పక్ష నాయకుడు అదోమాదిరిగా నవ్వుతూ.
సభాధ్యక్షుడు సభను వాయిదా వేశాడు!
- చింతపట్ల సుదర్శన్,
9299809212