Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలంలో వచ్చే ఉరుములు మెరుపులు ఎటువంటి భయానక వాతావరణాన్ని సృష్టిస్తాయో జానపద కళాకారడు వాయించే 'ఉరుము' అనే వాయిద్యం కూడా అటువంటి శబ్దాన్నే సృష్టిస్తుందని అంటారు. ఉరుమువాయించే వాళ్ళను 'ఉరుములోళ్ళు' అని వ్యవహరిస్తారు. ఇందులో పురుషులే పాల్గొంటారు కాని స్త్రీలు పాల్గొనరు. గూడూరు, ధర్మవరం, కొమ్మవారిపల్లి, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కమ్మ పండుగలు జరిగేటప్పుడు కళాకారులు ఉరుముల నృత్యం ప్రదర్శిస్తారు. అక్కమ్మ, పోతరాజు, కాటమయ్య, ఇతర శక్తి దేవుళ్ళను, దేవతలను కొలిచేటప్పుడు కూడా ఉరుము నృత్యం ప్రదర్శితమవుతుంది. ఉరుముల శబ్దం వచ్చినప్పుడు అటవీ మృగాలు పారిపోతాయి. కళాకారులు సర్పరాగాలను పాడి ప్రేక్షకులకు వినోదాన్ని కలిగిస్తారు.
అక్కమ్మ దేవతను పూజించినప్పుడు ఆమె స్త్రీలకు సంబంధించిన, రుతువులకు సంబంధించిన బాధలు పోయి ఏ మలినం లేక అక్క మహాదేవి పవిత్రురాలైన దేవతగా ఉండిందనే ఉద్దేశంతో ఈ కళను పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు.
ద్వారాకాపురం చెన్నకేశవ స్వామిని కుల దేవుడుగా, కుల దేవతను ఎల్లమ్మ దేవతగా వీరు పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో చిన్న ఓబులేశుని కూడా కొలుస్తారు. ఉరుము వాయిద్య కళాకారుల ఆచార సాంప్రదాయాలకు, నమ్మకాలకు, మతానికి వారి జీవిత విధానానికి సంబంధించిన కళారూపం. అక్కమ్మ దేవతను సంతృప్తి పరచడానికి ఆమె మూలంగా సమాజమంతా సంతోషంగా ఉండటానికి కళాకారులు ఈ స్రాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారని అంటారు.
వీరిలో వివాహాలు దగ్గరి బంధువుల మధ్యే జరుగుతాయి. ఉరుమును పూజించుకునే అక్కమ్మ దేవతను కొలిచిన తరువాతే వారి దినచర్య ప్రారంభమవుతుంది. ఉరుముల నృత్యంలో ఒక్కరుగాని, అంతకంటే ఎక్కువ మంది కాని పాల్గొనవచ్చు. అక్కమ్మ, పోతరాజు, కాటమయ్య మిగతా దేవతలను కొలుచుకొంటూ నృత్యం ప్రారంభిస్తారు. గంగమ్మకు మేలుకొలుపు పాటపాడతారు. ఉరుమును తమ తొడలపై పెట్టుకొని వాయిస్తారు. రెండు కర్రలతోటి ఉరుమును వాయిస్తూ నృత్యం చేస్తారు. ప్రేక్షకులకు నమస్కారం చేసేటప్పుడు 'పరాకు పరాకు' అంటారు. ఈ నృత్యకారులందరూ వర్తులాకారంగా ఏర్పడి ఒకరి కాళ్ళతో ఇంకొకరి కాళ్ళు మెలేసుకొని శరీరమంతా కదిలేటట్లు వలయాకారంగాను, అర్ద వలయాకారంగాను కదులుతూ నృత్యం చేస్తారు. అప్పుడు వారేయి పాటపాడరు. ఉరుము వాయిద్యానికి అనుగుణంగా వారు డ్యాన్స్ చేస్తారు. ముందుకు, వెనుకకు అడుగులు వేస్తూ అప్పుడప్పుడు పెద్దగా అరుస్తూ నృత్యం చేస్తారు. ఉరుము వాయిద్యాన్ని ఆపడంతో గాని, మరలా మోగించడంలో గాని ఎంతో నైపుణ్యాన్ని కనబరుస్తారు.
కుంకలత
ఉరుములవారు చేసే నృత్యంలో 'కుంకలత' అనేది వైవిధ్యంతో కూడుకున్న ది. కళాకారులు నెమలి ఈకలను ధరించి వాటిని కుంచె లాగా చేసి... వాటిని తలపై పెట్టుకొని ఉరుముల నృత్యం చేస్తారు. ఒక్కొక్కప్ఫడు లయబద్ధంగా నృత్యం చేసేటప్పుడు పరవశంతో ఊగిపోతూ ఒళ్ళు తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. పసుపు కుంకుమలతో వారిని శాంతింపచేస్తారు. చిట్టచివరకు గంగమ్మకు మంగళహారతులిస్తూ వారు ఉరుము నృత్యాన్ని ముగిస్తారు.
ఉరుము నృత్యం చేసేవారు తలకు తెల్లని పాగా, ఎడమ చెవికి ఒక పోగు, మెడలో పూదండ, వేసుకొని పొడుగాటి పసుపు పచ్చని ఉత్తరీయం వేసుకొని భుజంపై ఎరుపు, ఆకుపచ్చ శాలువాను ధరించి పంచెలు కట్టుకొని అరచేతులవరకు దుస్తులు ధరించి తమ మెడలో రుద్రాక్షలు ధరిస్తారు.