Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అంతరంగం' ఆలోచింపచేస్తున్నది
కార్టూన్లు నేటి రాజకీయస్థితికి అద్దం పట్టినవి. రచయితలు, కవులు, కళాకారులు 'మెచ్చుకోళ్ల' కోసం కాక 'సృజనాత్మకత' పెంచుకోవడం కోసం రచనలు చేయడం మేలు... అన్న 'అంతరంగం' సూక్తి బాగున్నది. ప్రజల అభిమానధనం మించిన పురస్కారముంండునా.. అనే హితోక్తి ఆలోచింప చేసింది. బలహీన మనస్కులు పురస్కారాలనే ఎంపిక చేసుకుంటారు. స్ట్రాంగ్ రూముల్లో బందీలైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు తమలో తాము గొణుక్కోవడం , ఓటింగ్ లోని అవకతవకలు బహిరంగ పరచడం... సామాన్యుని, నిస్సహాయుని గొంతు వినిపించినట్టుగా తోచింది. 'వికాసం' ద్వారా మానసిక వికాసానికి ఉపయోగపడే వ్యాసాలు అందిస్తున్నారు. జయాపజయాలు తోబుట్టువులు. వాటిని ఆహ్వానించి ముందుకెళ్లిన వారిని విజయలక్ష్మి వరిస్తుంది. విజయం ఆదిలోనే పలకరించదు. విజేతల విజయ గాథలు దీనికి నిలువెత్తు సాక్ష్యం.
- పంజాల నరసయ్య, ఈసీఐఎల్, హైదరాబాదు
పేజీలు పెంచండి
ఈ వారం కవర్ స్టోరీ 'విశ్వ రహస్యం' చదివి ఎన్నో విజ్ఞాన విషయములు తెలుసుకున్నాము. నెమలీక లో పేజీల సంఖ్య మరింత పెంచాలి.
- సయ్యద్ షఫీ. హన్మకొండ
చాలా బాగున్నాయి
ఈ వారం ముఖచిత్ర కథనం 'విశ్వ రహస్యం', పుప్పాల కృష్ణమూర్తి కథ 'సంఘం శరణం గచ్ఛామి', 'కొండెక్కుతున్న జీవితాలు' కవిత చాలా బాగున్నాయి.
- గుండు రమణయ్య, పెద్దాపూర్- పెద్దపల్లి
టవర్ ఆఫ్ డేవిడ్ లాంటివి అవసరం
'టవర్ ఆఫ్ డేవిడ్' పై అందించిన వ్యాసం ఆకట్టుకునే విధంగా ఉన్నది. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి దేశంలోను మురికివాడలు పెరిగిపోతున్నాయి. ఫుట్పాత్లు, రోడ్డుపక్క జాగాల్లో తాత్కాలిక గుడిసెల్లో నివసించే కోట్లాదిమంది నిరుపేద వలస కార్మికులకు స్థిరమైన నివాసం అవసరం ఎంతో ఉంది. ఆధునిక నగరాల్లో టవర్ ఆఫ్ డేవిడ్ వంటి భవనాలు రెండు మూడు కట్టినా చాలావరకు గృహసమస్య తీరుతుందనిపిస్తున్నది. భారతీయ సినిమాలలో ప్రత్యేకత కలిగిన మహిళల గురించి రాసిన వ్యాసంలో ఎన్నో కొత్త విషయాలు కనిపించాయి.
- వెంకట్, బోడుప్పల్, హైదరాబాదు
అవుటాఫ్ బాక్స్ చిత్రాలు
సినిమా వ్యాసాలు ఇటీవల కాలంలో తగ్గిపోయాయి. అందుకు కారణం ఏమిటో తెలియడం లేదు. మీరు ప్రచురించే సినిమా వ్యాసాలు మిగతా పత్రికల్లో వచ్చేవాటికన్నా భిన్నంగా ఉంటాయి. ఈవారం అవుట్ ఆఫ్ బాక్స్ చిత్రాలు అంటూ కొన్ని సామాజిక, సాంస్కృతిక పరంగా ప్రాముఖ్యం ఉన్న సినిమాలను, అందులోని స్త్రీల ప్రాధాన్యతను విశ్లేషించే వ్యాసాన్ని అందించారు. కృతజ్ఞతలు. అట్లాగే ప్రఖ్యాత నాటక కళాకారుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జీవితంపై రాసిన వ్యాసం కూడా బాగున్నది.
- మనోజ, కరీంనగర్