Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలో ప్రతి మనిషీ ఎప్పుడో ఒకప్పుడు మానసిక ఒత్తిడికి గురవుతాడు. సమస్యలతో సతమత మవుతాడు. బాధలు మనిషిని చుట్టుముట్టినపుడు జీవితం ఉక్కిరి బిక్కిరవుతుంది. ఇలాంటి పరిస్థితి నుంచి బయట పడడమెలాగో ఒకసారి పరిశీలిద్దాం.
విశ్రాంతి లేకుండా పని చేయడం, ఇలు ఇంట్లోనూ, అటు కార్యాలయంలోనూ తీవ్ర ఒత్తిడికి లోనుకావడం వల్ల జీవితం ఉక్కిరి బిక్కిరి కావచ్చు. జీవన విధానం యాంత్రికంగా మారిపోవడం, వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోవడం కూడా మనిషి జీవితాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. చేసిన పనినే ప్రతిరోజూ చేస్తుండడం వల్ల మనసులో యాంత్రీకత ఏర్పడుతుంది. పనిలో కొత్తదనం లేనందువల్ల ఆసక్తి తగ్గుతుంది. దీనివల్ల సృజనాత్మకత తగ్గడంతో పాటు తొందరగా అలసటకు గురవుతారు. వీటికి తోడు నమ్మకమైన స్నేహితులు లేకపోవడం, బాధలు పంచుకోలేక పోవడం కూడా ఒత్తిడికి లోనుచేస్తుంది. పని ఒత్తిడితో నిద్రాహారాలకు దూరం కావడం వంటి అంశాలు కూడా మానసిక ఒత్తిడికి కారణమవుతాయి. సమస్యలతో సతమతం కావడం వల్ల ఒక మనిషి జీవితంపై ఈ అంశాలు ప్రభావం చూపిస్తాయి.
ఒత్తిడి ప్రభావం నిరంతరం ఉంటుంది. ఇది ఒక్కరోజులో పరిష్కారమయ్యే సమస్య కాదు. మొదట ఈ సమస్య చిన్నదిగా కనిపించినా, జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఈ సమస్యను కౌమారదశలో ఉన్నపుడే పరిష్కరించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఒత్తిడికి గురైన మనిషి లక్షణాలలో ముఖ్యమైనది... దినచర్య అదుపు తప్పుతుంది. ఉద్వేగాలు నియంత్రికోలేరు. ఎప్పుడూ నిస్సహాయంగా, జీవితంలో ఏదో కోల్పోయినట్లు దిగులుగా ఉంటారు. అకారణంగా అలసటకు గురవుతారు. చేస్తున్న పని మీద ఆసక్తి తగ్గుతుంది. తరచుగా తలనొప్పితో పాటు ఏదో ఒక అనారోగ్యానికి గురవుతారు. సమయానికి నిద్రపోరు. జీవితంలో ఓడిపోతామోనన్న భయంతో వుంటారు. ఈ లక్షణాలు ఎదుర్కొంటున్నవారెవరైనా, వెంటనే అప్రమత్తం కావాలి. ఒత్తిడి బారిన పడకుండా ఉండగలనని నమ్మాలి. సాధారణ జీవితం గడపగలనన్న నమ్మకాన్ని కలిగి ఉండాలి.
జీవితంలో ఎన్ని సమస్యలెదురైనా వాటిని పరిష్కరించుకుంటానని, అలాంటి అద్భుతమైన సత్తా తనలో ఉందని విశ్వసించాలి. దెబ్బతినకముందే ఒత్తిడి నుంచి బయట పడాలి. ఎదుర్కొంటున్న సమస్యల నుంచి వైదొలగేందుకు జీవన విధానాన్ని మార్చుకోవాలి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో అమితంగా నచ్చే అంశామేమిటో, ఇతరుల కంటే మిమ్మల్ని భిన్నంగా చూపే అంశామేమిటో గుర్తించాలి. చేస్తున్న పనిలో ఎంత క్రియాశీలకంగా ఉన్నారో, సృజనాత్మకంగా యోచిస్తున్నారో పరిశీలించుకుని, నైపుణ్యాలను పెంచుకోవాలి. ఒకప్పుడు సాధించిన విజయాలను మననం చేసుకుని, వాటి నుంచి స్ఫూర్తి పొందాలి. మళ్లీ అలాంటి అద్భుతమైన పనులను సాధించగలనని మనసులో నిర్ణయించుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకు యత్నించాలి. వేషబాషల్లో మార్పు చేసుకోవాలి. ఇతరుల కంటే భిన్నంగా, కొత్తగా ఆలోచించాలి. కనీసం ఏడాది కొకసారి కొత్త ప్రదేశాలను సందర్శించి, ప్రకృతి దృశ్యాలను చూసి మనసును ఉల్లాసపర్చుకోవాలి. కొత్త ప్రదేశాలు మీ ఆలోచన విధానాన్ని మారుస్తాయి. ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ ప్రతిరోజూ అరగంట వ్యాయామం చేయడం వల్ల అనారోగ్యం దరి చేరదు. అదే విధంగా శ్వాససంబంధమైనా వ్యాయామం మనిషిని రోజంతా చురుకుగా ఉంచుతుంది. నిర్ణీత సమయానికి నిద్రపోవాలి. పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో అన్ని రకాలైన విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. జీవితంలో ఎదురయ్యే సమస్యలు తాత్కాలికమేనని భావించాలి. కష్టాలు తొలగిపోయి సాధారణ జీవితం గడిపే సమయం వస్తుందని విశ్వసించాలి.
సైకిల్ సవారీ చేస్తున్నపుడు కొండ అడ్డువస్తుంది. ఆ కొండ ఎక్కేటప్పుడు అదనపు శక్తిని ఉపయోగిస్తాం. ఆ సమయంలో కొంత కష్టానికి గురవుతాం. అయితే కొండ ఎక్కి దిగేటప్పుడు సైకిల్ తొక్కకుండానే ముందుకు వెళుతుంది. జీవితం కూడా అంతే! కష్టాలు, బాధలు కన్నీళ్లు, సమస్యలు వున్నాయని జీవితం నుంచి పారిపోకూడదు. మంచి రోజులు వస్తాయని విశ్వసించాలి. ఆత్మవిశ్వాసం ప్రదర్శించి, మానసిక ఆరోగ్యాన్ని సాధించాలి. అదే ముందుకు నడిపిస్తుంది. మానసిక ఉల్లాసమే ప్రతి మనిషిని విజయతీరాల వైపుకు తీసుకు వెళుతుంది. మానసిక ఆరోగ్యమే శారీరక ఆరోగ్యానికి పునాది. అందువల్ల ఆత్మవిశ్వాసమే ఆరోగ్యం. ఈ విషయంలో ఎలాంటి సందేహానికీ తావులేదు.
- జి గంగాధర్ సిర్ప, 9010330529