Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సున్నా నుంచి తొమ్మిది వరకూ అంకెలు హడావిడిగా అటూ ఇటూ పరుగెడ్తున్నవి. గంతులేస్తున్నవి. ఒకటి పక్కన ఐదు, ఐదు పక్కన ఏడు, ఏడుకి ఈ పక్క ఒకటి, ఎనిమిదికి ఆ పక్క సున్న రెండూ మూడూ నాలుగూ ఆరూ తొమ్మిది ఒకదాని పక్కన ఓటి దొర్లుతున్నవి. వీటి మధ్య చందమామలా కోడిగుడ్డులా తొంగి చూస్తున్నది సున్న.
ఎంతకని పరుగెడ్తయి, ఎంతని గంతులేస్తయి ఈ పక్కా ఆ పక్కా అట్నించిటు ఇట్నుంచటు దొర్లుతయి. పరుగెట్టే, గంతులేసే దొర్లీదొర్లీ అలసిపోయినయి అంకెలు, సున్నా నుంచి తొమ్మిది వరకూ వున్న అంకెలు. కొన్ని అంకెలు ఒంటరిగానే మిగిలిపోతున్నయి. కొన్ని అంకెలు మరో అంకె పక్కన జాగా సంపాదించి సంఖ్యలైపోతున్నయి. అయినా ఎంతసేపిట్లా అని విసుకున్నయి. అంకెల్ని ఆడించే వేళ్ళు, తొక్కి పెట్టే వేళ్ళు, నొక్కిపెట్టే వేళ్ళు ఆ పని చేస్తూనే వున్నాయి.
రిజల్టు తొందరగా వచ్చెయ్యాలి. ఫలానా రోజున ఫలానా గంట ఫలానా నిమిషానికి మంత్రిగారి కరకమలాల్తో రిజల్టు రిలీజవ్వాలి. కానీండి! కానీండి! అని అరిచారెవరో.
ఆ అరుపులకి అదిరిన వేళ్ళు మరింత వేగంగా టకటకలాడసాగినయి. ఏమిటిది ఆగమంటుంటే మరింత వేగం పెంచేయి వేళ్ళు అని విసుక్కున్నాయి అంకెలు. మేం మాత్రం విసుక్కోలేమా అలసిపోలేమా అన్నయి వేళ్ళు కూడా. వేళ్ళు తడబడ్డయి అంకెలు తడబడ్డయి. అధికారులు తొందరపెట్టడంతో కంప్యూటర్ కూడా ఖంగుతిన్నది. ఇది వరకు చెయ్యని కొత్త పని కదా అని కంగారు పడ్డది.
వేళ్ళు వాటి ఇష్టం వచ్చినట్టు కదిలాడేయి. చిర్రెత్తుకొచ్చి చిరాకుపడ్డ అంకెలు మానాన అవి నిలబడసాగినయి.
తొమ్మిదికి కుడిపక్కన సున్నాని నిలబడమంటే అది దాని ఎడమపక్కకి వచ్చి నిలుచుంది. ఐదుకి ఎడమపక్క ఏడును నించోబెడితే దాన్ని పక్కకు తోసి ఒకటి వచ్చి నిలబడ్డది. కొన్నిసార్లు అంకెలు వచ్చి నిలమడమని మొరాయిస్తే వాటి జాగాలో 'ఎయఫ్' అనే అక్షరాలు వచ్చి పడ్డయి.
మొత్తానికి అధికారుల కుమ్మక్కో, వేళ్ళ చిరాకో అంకెల తిరుగుబాటో పరీక్షా ఫలితాన్ని తారుమారు చేశాయి. తప్పు ఎక్కడ జరిగిందో, తప్పు ఎలా జరిగిందో తేలేలోపునే జరగకూడనివెన్నో జరిగిపోయేయి.
పోయిన ఏడు తొంభై మార్కులపైనే వచ్చి, ఈ సారి తొమ్మిది మాయమై సున్నా 'మెమో'లో నిలబడి వెక్కిరిస్తుంటే అన్నెం పున్నెం తెలియని వాడు, అమాయకుడు భవిష్యత్తును గురించి ఎన్నో కలలు కన్నవాడు భరించలేకపోయేడు. గుండె బద్దలయిపోయింది. మెదడు కీకారణ్యం అయింది. ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. లిఫ్టు ఎక్కాడు. అది ఒకటో ఫ్లోర్‌కి చేరింది. సెల్లార్లోకి వచ్చాడు తండ్రి, కొడుకు మెమోలో దొర్లిన తప్పుని సవరించిన మెమోని పట్టుకు వచ్చి లిఫ్టులో పైకి రావాలని నిలబడ్డాడు. లిఫ్టు రెండో ఫ్లోర్ నుంచి మూడవ ఫ్లోర్‌లోకి ఎగిరిపోతున్నది. నీకు వచ్చింది సున్నా కాదు నాన్నా తొమ్మిది పక్కన సున్నా తొంభై. చిన్న పొరపాటు దొర్లిందట అని చెప్పగానే అబ్బాయి ముఖం ఎలాగ వెలుగుతుందో చూడాలని తండ్రి తొందర. అందుకే మెట్లు ఎక్కనారంభించాడు.
తండ్రి నాలుగోఫ్లోర్లో వున్నాడు. మెట్ల మీద ఒగరుస్తూ నుంచున్నాడు. కొడుకు ఆరవఫ్లోర్లో లిఫ్టుని వెనక్కి పంపి పై మెట్లెక్కి రూఫ్ చివర గోడ దగ్గరికి నడిచాడు. తండ్రి ఐదవ ఫ్లోర్ చేరాడు. కొడుకు పిట్టగోడ దగ్గర నిలబడి కిందకి తొంగి చూస్తూ నిలబడ్డాడు. వాడి కళ్ళ ఎదురుగ్గా సున్నాతో వెక్కిరిస్తూ కనిపిస్తున్నది వాడి మార్కుల జాబితా.
ఆ ఫ్లోర్ చేరిన తండ్రికి ఎవరో అబ్బాయి పైకి వెళ్ళినట్టున్నాడని చెప్పారు. తండ్రి పై కప్పుకి చేరుకున్నాడు. దూరంగా గోడ దగ్గర ఓ ఆకారం గాలిలోకి లేస్తున్నట్టనిపించింది.
సున్నాకాదు నాన్నా తొంభై తంభై అంటూ బిగ్గరగా అరుస్తూ పరుగెత్తాడు తండ్రి. ఆరో అంతస్తు నుంచి గాలిలో దొర్లుతూ సున్నాకీ తొంభైకీ అందనంత దూరం వెళ్ళిపోయాడు అబ్బాయి.
నూనూగు మీసాల కుర్రాడొకడు చేతిలో తన మార్కుల జాబితాలో 'ఎయఫ్' (ఆబ్సెంట్ ఫెయిల్) ని పట్టుకుని అటునించి పరుగెత్తుకు వస్తున్న రైలుకి అడ్డంగా పరుగెత్తి వెళ్ళాడు చివరిసారిగా.
క్లాసులో ఫస్టు ర్యాంకు అమ్మాయి తెలుగులో ఉత్తీర్ణురాలు కాలేకపోయానని తెగించి ఫ్యాన్‌కి వేళాడింది.
ఇలాగ జరగకూడనివి ఎన్ని జరిగినా ఎవరినీ చీమ కుట్టదు.
- చింతపట్ల సుదర్శన్,
9299809212