Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన, అద్భుతమైన సృజనాత్మకతను వెలికి తీయండి. మనసులో జనించే ప్రతి ఆలోచన, ప్రతి సంఘటన జీవితంలో ఉపయోగపడేట్టు చూసుకోవాలి. ఉన్నది వున్నట్టుగా కాకుండా అది ఎలా ఉంటే బావుంటుందో ఒకసారి ఆలోచించండి. కలలు కనడం కాదు. వాటిని ఆచరణలో అమలు చేసి ప్రయోజనం ఎలా పొందాలో ప్రయత్నించండి. జీవితంలో అత్యున్నతమైన ఫలితాలు సాధించేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న దాని కన్నా కొద్దిగా ఎక్కువ మేధాశక్తిని ఉపయోగించాలి. ఆలోచనా విధానంలోని స్వల్ప మార్పు జీవితాన్నే మార్చేస్తుంది. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే భవిష్యత్తులో సాధించే ఫలితాలు మిమ్మల్ని, మీ బందువులను, స్నేహితులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
సగటు మానవులు తాము నిర్వహించే 100 శాతం పనులకు 1,2 శాతం మాత్రమే మెదడు సామర్థ్యాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న మేధాశక్తిని 4 శాతానికి పెంచుకోగలిగితే వృత్తిలో ముందుకు దూసుకు వెళ్లగలుగుతారు. అత్యున్నత స్థానానికి చేరుకోగలుగుతారు. జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోగలుగుతారు. అదే ఈ శక్తిని 5,6 లేదా 7 శాతం ఉపయోగించుకోగలిగితే మీ పని విధానాన్ని చూసి ఇతరులు ఆశ్చర్యపోతారు. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా తన మేధస్సును సుమారు 15 శాతమే ఉపయోగించాడని నిపుణులు చెబుతున్నారు.
సృజనాత్మకత ఒక సహజమైన, సామాన్యమైన సామర్థ్యం. అది అందరిలోనూ నిక్షిప్తమై ఉంటుంది. అది పుట్టుకతో వచ్చేది. శరీరంలోని జన్యువుల నిర్మాణంలో అది కూడా ఒక భాగమే. మానవాళికే సొంతమైన ఏకైక సామర్థ్యం. అందరూ సృజనాత్మకత గలవారే. జనాభాలో 95 శాతం మందికి, జీనియస్ స్థాయిలో కాకపోయినా, అసాధారణ స్థాయిలో పనిచేసే సామర్థ్యం ఉంటుంది. రష్యన్ ప్రొఫెసర్ సెర్జీ యెఫ్రమోవ్ కొన్నేండ్ల కితం చేసిన పరిశోధనల వల్ల అనేక విషయాలు వెల్లడయ్యాయి. మనిషికున్న మానసిక శక్తిలో 50 శాతాన్ని ఉపయోగించుకోగలిగితే 12 యూనివర్సిటీల్లో డాక్టరేట్ సంపాదించుకునేందుకు అవసరమైన అధ్యయనం పూర్తి చేయగలుగుతారు. మరో 12 భాషలు సులభంగా నేర్చుకోగలుగుతారు. 'ఎన్సైక్లోపీడియా బ్రిటానికా' అనే విజ్ఞానసర్వస్వంలోని 22 సంపూటాలను కంఠస్థం చేయగలుగుతారు. జీవితంలో పరిష్కరించలేని సమస్యంటూ ఏదీ లేదు. అధిగమించలేని అడ్డంకీ లేదు. ప్రస్తుతం ఉన్న సృజనాత్మకతను వినియోగించుకుని సాధించలేని లక్ష్యమంటూ ఏదీలేదు. వందేండ్లు బతికినా అప్పటివరకు ఉపయోగించుకునేందుకు సామర్థ్యం మిగిలే ఉంటుంది. సామర్థ్యాన్ని ఇకనైనా సంపూర్ణంగా ఉపయోగించండి. ఆ పని ఈ క్షణానే ప్రారంభించండి.
మానసిక బలం అనేది వ్యక్తి శారీరక దారుఢ్యంపై ఆధారపడి ఉంటుంది. శరీరం ధృడంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి. శరీరంలో కండరాలు పెరగాలంటే బరువులు ఎత్తాలి. డంబెల్స్ లాంటివాటితో వ్యాయామం చేసి, కండరాలపై ఒత్తిడి తెచ్చి, వాటిలోకి కొత్త రక్తాన్ని ప్రవహింపజెయ్యాలి. శరీరానికి ఎంత ఎక్కువ పని కల్పిస్తే అంత బలంగా తయారవుతుంది. మిత్రమా.... మనసు కూడా అచ్చం అలాంటిదే. మానసిక బలాన్ని పెంచుకునేందుకు మానసికంగా బరువులనెత్తాలి. అనగా మెదడుకు పని కల్పించి, దానికి తగిన తర్ఫీదు ఇవ్వాలి. మనసును పూర్తిగా లగం చేసి, ఏకాగ్రతతో కొత్త ఆలోచనలను సృస్టిస్తూ, లక్ష్య సాధనలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవాలి. అప్పుడప్పుడూ ప్రతి మనిషి మానసిక మథనాన్ని తనంతతానే చేసుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన పనులు సమీక్షించుకోవాలి. ఏవైనా లోపాలుంటే నిజాయితీగా సరిదిద్దుకోవాలి. విమర్శలను స్వీకరించాలి.
ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలను ఒకసారి పరిశీలించండి. చిన్న సైన్యాలు కూడా పెద్ద పెద్ద సైన్యాలను ఓడించిన సంఘటనలు గమనించవచ్చు. చిన్న సైన్యాలు ఒక ప్రణాళిక ప్రకారం నేర్పుతో యుద్ధం చేసి విజయాన్ని సాధిస్తాయి. పేరుకే పెద్ద సైన్యం అయినప్పటికీ వాటికి ఒక వ్యూహం, ప్రణాళిక ఉండవు. అందువల్లే అవి ఓటమిని చవిచూశాయి. అదే విధంగా సాధారణ మనిషి సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రణాళిక వేసుకోగలిగితే, దానిని తప్పకుండా పరిష్కరించుకోవచ్చు. పెద్ద పెద్ద చదువు సంధ్యలున్నవారు కూడా ఒక్కోసారి తమకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోలేక పోతారు. అందువల్ల సమస్యల పరిష్కారానికి తెలివి తేటలు చాలా ముఖ్యం. ఉన్నత చదువుల వల్లనే తెలివితేటలు వస్తాయని అనుకోవడం సరికాదు. సామాన్య మానవులు కూడా తమకున్న ప్రతిభతో అసాధ్యం కాని సమస్యలను పరిష్కరించిన ఉదంతాలను చరిత్రలో గమనించవచ్చు.
ప్రస్తుతం వేగవంతమైన సమాచార యుగంలో జీవిస్తున్నాం. ఆలోచనలే మన ఆస్తికి వనరులుగా ఉపయోగపడతాయి. మానసిక మథనంలో సమస్యలను పరిష్కరించే కీలక అంశాలుంటాయి. ఎలాంటి లక్ష్యాన్ని సాధించాలన్నా సామర్థ్యం చక్కగా ఉపయోగపడుతుంది.
- జి గంగాధర్ సిర్ప,
9010330529