Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవ మెదడు సూపర్ కంప్యూటర్లా పని చేస్తుంది. మానవుడు కృత్రిమంగా తయారు చేసిన కంప్యూటర్ దీనికి పోటి కానేకాదు. కంప్యూటర్లో పరిమితమైన మెమోరీ (జీబీ) మాత్రమే ఉంటుంది. కానీ మానవ మెదడులో ఎండ్లెస్ జీబీ ఉంది. మన మెదడులోని జీబీకి పరిమితి లేదు. ఇందులో ఎంత సమాచారమైనా నిక్షిప్తం చేయవచ్చు. అలాంటి అద్భుతమైన అవయవం మానవ మెదడు. వాస్తవం చెప్పాలంటే మన శరీరంలో ఒక ముఖ్యమైన సూపర్ కంప్యూటర్ ఉంది. అదే మన మెదడు. దానిని ఎప్పుడైనా, ఎక్కడైనా వాడవచ్చు. దానినే మానసిక శాస్త్రవేత్తలు అతిచేతనాత్మక మనసు అని పిలుస్తారు.
చరిత్రలో ఇంతవరకు ఆవిష్కరించిన వాటిలో ఇది అత్యంత శక్తివంతమైన మనశ్శక్తి. అతి చేతనాత్మక మనసుకు సంబంధించిన జ్ఞానం గురించి కొన్ని వేల సంవత్సరాలుగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈ జ్ఞానాన్ని సమాజంలో కొన్ని వర్గాల ప్రజలకే పరిమితం చేశారు. దీనిని ఉన్నత వర్గాలవారు గోప్యంగా ఉంచారు. ఎట్టకేలకు కొంత మంది ఔత్సాహికులు మానసిక శాస్త్రాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేశారు. ఇది ప్రజలందరికీ తెలియాలని వారు దానిని ప్రచారంలోకి తీసుకు వచ్చారు. దాని వల్ల సమాజ స్థితిగతులు మారతాయని భావించారు. వంద సంవత్సరాలుగా ఈ శాస్త్రం విరివిగా ప్రచారంలోకి వచ్చింది.
తొలిసారిగా మానసిక చికిత్సను కనుగొన్న డాక్టర్ సిగ్మండ్ ఫ్రాయిడ్ మూడు మనసులు 'ఈగో', 'ఇడ్', 'సూపర్ఈగో' గురించి తన గ్రంథం 'ది ఈగో అండ్ ది ఇడ్' లో రాశారు. ఈ గ్రంథం 1895లో వెలువడింది. జ్ఞానానికి సంబంధించిన ఈ మూడు విభిన్న తత్వాల మీద ఆయన పరిశోధనలు చాలా వరకు ఆధారపడి ఉన్నాయి. మన మెదడులోని ఈగో ఎల్లప్పుడు స్పృహలో ఉంటుంది. బాహ్య ప్రపంచంతో వ్యవహరిస్తుంది. అనేక అంశాలను విశ్లేషిస్తుంది. నిర్ణయిస్తుంది. చర్యలు తీసుకుంటుంది. దీనినే చేతనాత్మక మనసు అని పిలుస్తాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన 'ఇడ్' మెదడులోని అచేతన భాగం. దీనిని అచేతనాత్మక మనసు అని కూడా పిలుస్తారు. ఇదొక విశాలమైన జ్ఞాపకాల, భావనల భాండాగారం. ఇందులో గత ఆలోచనలు, నిర్ణయాలు, అనుభవాలు నిక్షిప్తమై ఉంటాయి. ఇది తనంతట తానే పని చేస్తుంది. గతంలోని అనుభవాలకు అనుగుణంగా ఆలోచనలు, అనుభూతులను విశ్లేషించి పని చేయిస్తుంది. ఫ్రాయిడ్ 'సూపర్ ఈగో' అని పిలిచేది ఆలోచనలకు సంబంధించిన మూడవ పార్శ్వం. దీనిని రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ 'ఓవర్సోల్' అని వర్ణించారు. నెపోలియన్ హిల్ దీనిని అనంతమైన మేథ అని వివరించారు. అమెరికాలోని విజేతలందరూ తమ వృత్తి జీవితాల్లో ఈ సిద్దాంతాలను నిరంతరం అనుసరించినట్టు తాము విజయం సాధించడానికి తమకు ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయని వారు పేర్కొనట్టు హిల్ చెప్పారు.
చరిత్రలో కనిపించే అన్ని రంగాలలోని గొప్ప విజయాలు అధిచేతన కార్యనిర్వహణ వల్ల సంభవించివేనని మానసిక నిపుణులు చెబుతున్నారు. మనసులో ఒక గొప్ప ఆలోచనగాని, అవగాహనగాని జనించి, ఆ పరిణామం వల్ల ఏదైనా జఠిల సమస్య పరిష్కారానికి గురైతే అధిచేతన చైతన్యం అనుభవంలోకి వచ్చిందని భావించాలి. ఈ ప్రపంచంలో గొప్ప శాస్త్రీయ ఆవిష్కారాలూ, డీఎన్ఏని కనిపెట్టడం, పింగాణీతో విద్యుత్తును జోడించి సూపర్ కండక్టివిటీ విద్యుత్వాహక శక్తిని కనిపెట్టటం వంటివి జరగటానికి అసలు కారణం అధిచేతనకు ఉన్న మహత్తర శక్తేనని నిపుణులు వివరిస్తున్నారు. పేరుగాంచిన సంగీత విద్వాంసులు కృతులను సృష్టించడంలో అధిచేతన శక్తిని మనసులో మళ్లీ మళ్లీ మననం చేసుకునేవారు. తాను రాయడానికి ముందే మోజార్ట్ అనే సంగీత నిపుణుడు తన మనస్సులో ఒక ఓపెరాని, అందులోని ప్రతి స్వరాన్ని పూర్తిగా చూడగలిగేవాడు. అనంతరం ఆయన తన మానసిక చిత్రాన్ని ఓపెరా లిపిలోకి మార్చేవాడు. అందులో ఒక తప్పు కూడా ఉండేది కాదు. మొదట రాసినదే ఎలాంటి మార్పు లేకుండా, ప్రజల ముందు ప్రదర్శించడానికి అనుకూలంగా ఉండేది. సంగీత చరిత్రలో ఇలాంటి దానిని ఎవరూ చూడలేదు. అనుభవించలేదు. భౌతిక శాస్త్రవేత్త స్టీఫన్ హాకింగ్ వికలాంగుడు. 'లూ గెహరిగ్స్' అనే వ్యాధి పీడితుడు. ఒక సారి ఉత్తరం రాసేందుకు ఆయనకు ఒక ప్రత్యేకమైన కంప్యూటర్ అవసరమైంది. కూర్చున్న చోటునుంచే తన పనులు చేసుకునేందుకు ఆయన తన సహాయకులతో ఒక సూపర్ కంప్యూటర్నే సృష్టించుకున్నాడు. వీల్ చైర్ నుంచే విశ్వదర్శనం చేశాడు. ఖగోళానికి సంబంధించి నూతన ఆవిష్కరణలు చేశాడు. ఆయన తన అధిచేతన మనసును ఉపయోగించి 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్' అనే ప్రసిద్ధ పుస్తకాన్ని రాశాడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకాల రచయితలలో ఆయన ఒకడయ్యారు. అధిచేతన క్రియాశీలత నియమం ఇంతవరకు కనుగొన్న మానసిక నియమాలన్నింటిలోకి ఎంతో ముఖ్యమైనది. ఈ నియమం ఎలా పని చేస్తుందంటే ఆలోచన, ప్రణాళిక, లక్ష్యం ఏదైనా విషయాన్ని క్రమం తప్పకుండా చేతనాత్మక మనసులోకి ప్రవేశపెడితే, తప్పకుండా అతిచేతనాత్మక మనసు వాటిని సాకారం చేస్తుంది. మనం ఏమి కావాలనుకుంటున్నామో, ఏది సాధించాలనుకుంటున్నామో అధిచేతన్మాక శక్తితో దానిని పరిపూర్తి చేయగలుగుతాం.
జి గంగాధర్ సిర్ప,
9010330529