Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెదడుకి మేత
అంతరంగం.. చదవడమే కాక పదిమందితో చదివిస్తున్నాను. చర్చిస్తున్నాను. ఆశించిన ఫలితాలు పొందుతూ ఆనందిస్తున్నాం. ఎప్పటిలాగే ఈ వారం కూడా 'అంతరంగం'మెదడుకి మేత పెట్టింది. తాను ఊహించిన ప్రపంచానికి ఆవల ఏమున్నది తెలు సుకోవడానికి, జీవితాన్ని నిత్య నూతనంగా జీవించడానికి వ్యక్తి తన లక్ష్యాల పరిధిని విశాలం చేయాలి... అనే సూచన మేం ఈ వారం చర్చనీయాంశంగా స్వీకరించాం. కవర్‌స్టోరీ చదివి మానవుడు తన మరణ శాసనం తానే రాసుకుంటున్నాడని గ్రహించాం. అభివృద్ధి, పేదరికం రెండు సమాంతర రేఖలు అని చదివి తీవ్ర ఆలోచనలో పడ్డాం. మనిషి తోటి మనిషికి ఉపయోగపడడు. ఒక చెట్టు తోటి చెట్టుకు పనికొస్తుంది, మరణం తర్వాత కూడా అని చౌరస్తాలో పేర్కొన్న విధం ఆకట్టుకుంది.
- పంజాల నరసయ్య; ఈసీఐల్, హైదరాబాదు
మనుగడకు ప్రమాదం
ఈ వారం సోపాతి కవర్ స్టోరీ బాగుంది. పర్యావరణం లేకుండా మనిషి మనుగడ లేదు మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనవి గాలి, నీరు. ఇవి లేకుండా జీవరాశి ఒక్క క్షణం కూడా జీవితం గడుపలేదు. మనుషులు ప్రకృతిని వీడి యాంత్రిక జీవితం వైపు పరుగులు తీస్తున్నారు. ఇది మనిషికి చాల ప్రమాదం అనునది తెలవడం లేదు. పూర్వం మనుషులు ప్రకృతిలోని సహజ వనరులను మితంగా కావలసినంత వరకే ఉపయోగించుకుని బతికేవాడు. కానీ ఇప్పుడు అత్యాశతో ప్రకృతి ధ్వంసానికి పాల్పడుతున్నాడు. ఈ ధోరణి మానవ జాతి మనుగడకే ప్రమాదకరంగా పరిణమిస్తున్నది.
- సయ్యద్ షఫీ, హన్మకొండ
బాగున్నాయి
కెన్యాదేశంలో ఒంటెల సంచార గ్రంథాలయాలను నడపడం ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఇన్ని వనరులున్న భారత దేశం ఈ విషయంలో ఎంతో నేర్చుకోవలసి ఉన్నది. గ్రంథాలయాలు జాతి సర్వతోముఖాభివృద్ధికి చాలా ఉపయోగపడతాయనే సంగతి ప్రభుత్వాలు ఎప్పుడు గుర్తిస్తాయో మరి. ఇక సినిమా వ్యాసం ఆద్యంతం ఎకడమిక్‌గా సాగినట్లు ఉన్నది. కొంత బోర్‌గా అనిపించినా ఇచ్చిన సమాచారం ఎంతో విలువైనదని చెప్పవలసిందే. నరేషన్ పాత్ర సినిమా విజయంలో ఎటువంటి కీలక భూమిక పోషిస్తుందో వివరించిన ఈ వ్యాసం మొత్తం మీద బాగున్నది. కవర్ స్టోరీ కనువిప్పుుకలిగించేదానిలా ఉన్నది. ఈ వారం 'సోపతి'లోని ఆర్టికల్స్ అన్నీ బాగున్నట్లే!
- కె.నవీన, హైదరాబాదు
అక్షర నివాళి
ప్రఖ్యాత తెలుగు చిత్రకారులు సూర్యప్రకాశ్ మరణవార్త బాధించింది. ఆయనకు నివాళి అర్పిస్తూ రాసిన వ్యాసం అద్భుతంగా ఉన్నది. తెలంగాణలో మొదటి తరం చిత్రకారుల్లో ఆయన ఒకరు. నాటకాలు వేస్తూ పొట్టపోసుకోవడం ఈ ఆధునిక కాలంలో ఊహించనైనా ఊహించలేం. అస్సాంలో యేడాదిలో తొమ్మిది మాసాలు నాటక ప్రదర్శనలు ఇస్తూ సంచార నాటక బృందాలు బిజీగా ఉన్నాయనే సంగతి నాలాంటి కళాభిమానులకు నిజంగా సంతోషకరమైన వార్తే. వేలాదిమంది కళాకారులు ఈ బృందాల్లో నటిస్తూ ఉపాధిపొందడం మంచి పరిణామం.
- వి.రామరాజు, ఖమ్మం